టెట్ రాయకుండానే టీచర్ ఉద్యోగం ఎలా వచ్చింది? 

30 వేల మంది ఫిర్యాదులకు సమాధానం చెప్పాలి

ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి

వైయ‌స్ఆర్ జిల్లా: డీఎస్సీ నియామకాలపై అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డీఎస్సీని సక్రమంగా నిర్వహించి ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. టెట్ రాయకుండానే టీచర్ ఉద్యోగం ఎలా వచ్చిందని, సాఫ్ట్‌బాల్ సంఘానికి చెందిన వ్యక్తి భార్యకు ఉద్యోగం ఎలా దక్కిందని ప్రశ్నించారు. నిజాలు బయటకు వస్తే దోషులుగా నిలబడాల్సి వస్తుందనే భయంతోనే విచారణకు వెనుకాడుతున్నారని అన్నారు. అసమర్థ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారాలు జరిగాయని, ఏదో ఒక రోజు బాధ్యులంతా చట్టం ముందు నిలబడాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

తమతో చర్చకు రావాలని సవాళ్లు విసరడం కాదని, డీఎస్సీపై ఫిర్యాదులు చేసిన 30 వేల మంది అభ్యర్థులతో చర్చ పెట్టి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైయస్ అవినాష్ రెడ్డి కోరారు. నిజాయితీ, దమ్ము, ధైర్యం ఉంటే అభ్యర్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని అన్నారు. డీఎస్సీ అక్రమాలపై వాస్తవాలను వెల్లడిస్తూ తప్పులను ఎత్తిచూపుతున్న సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేస్తున్నారని, ప్రభుత్వం చెప్పుకునే గొప్పలు మాత్రమే ప్రజల్లోకి వెళ్లేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమ తప్పులు బయటకు రాకుండా మీడియాపై కూడా ఉక్కుపాదం మోపుతున్నారని పేర్కొన్నారు.
 

Back to Top