కూటమి పాలనలో అట‌కెక్కిన‌ జగ్గయ్యపేట మున్సిపాలిటీ 

వైయస్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ విజయం ఖాయం

జగ్గయ్యపేట: జగ్గయ్యపేట పట్టణంలో రెండో రోజు “గడపగడపకు ప్రజా పోరుబాట” కార్యక్రమాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉదయం ఉత్సాహంగా నిర్వహించారు. జగ్గయ్యపేట నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలోని 13వ వార్డులో ప్రతి గడపను తట్టి ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో జగ్గయ్యపేట మున్సిపాలిటీలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను ప్రతి ఇంటికి అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి మౌలిక వసతులను మెరుగుపరిచామని, ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేశామని తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగ్గయ్యపేట పట్టణంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, గతంలో అభివృద్ధి పనులతో ముందుకు సాగిన మున్సిపాలిటీ నేడు నిర్లక్ష్యానికి గురవుతోందని తన్నీరు నాగేశ్వరరావు పేర్కొన్నారు. పారిశుధ్యం పడకేసిందని, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి కార్యాలయాల్లో కూర్చుని ప్రకటనలు చేయడం కాదని, ప్రజల గడప వద్దకు వెళ్లి వారి కష్టాలను కళ్లారా చూడాలనే ఉద్దేశంతోనే “గడపగడపకు ప్రజా పోరుబాట” చేపట్టామని చెప్పారు. ప్రతి వార్డులో ప్రజలను కలుస్తూ వారి సమస్యలను నమోదు చేసుకొని, ప్రజల పక్షాన వైయస్ఆర్‌సీపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ విజయ గీతం ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు గత పాలనను, ప్రస్తుత కూటమి పాలనను బేరీజు వేసుకుంటున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజా తీర్పు వైయస్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉంటుందని అన్నారు. ప్రజల సమస్యలను విస్మరిస్తే రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, జిల్లా కార్యదర్శి షేక్ జుబేర్, వార్డు అధ్యక్షులు ఆటిపాముల వెంకన్న, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు నాయకులు పాల్గొన్నారు.
 

Back to Top