పార్వతీపురం: అరకు పార్లమెంట్ సభ్యురాలు డా. గుమ్మ తనూజరాణిని బొర్రా ట్రైబల్ టాక్సీ యూనియన్, అరకు వాయుపుత్ర మోటార్ యూనియన్, ఆటో యూనియన్ నాయకులు, ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. కేకే రైల్వే లైన్‌లో సమస్యల కారణంగా రైలు సర్వీసులు నిలిచిపోవడంతో అరకు, బొర్రా ప్రాంతాలకు పర్యాటకుల రాక తగ్గిపోయిందని, దీంతో టాక్సీ, ఆటో, మోటార్ వాహన యజమానులు, డ్రైవర్లు, గైడ్లు, హోటల్ నిర్వాహకులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. కిరండూల్ వరకు రైలు నడపడం సాధ్యం కాకపోయినా, కనీసం విశాఖపట్నం–అరకు మధ్య ప్యాసింజర్ రైలు సర్వీసును పునరుద్ధరించాలని వారు కోరారు. రైలు సర్వీసు అందుబాటులోకి వస్తే అరకు, బొర్రా ప్రాంతాలకు పర్యాటకుల రాక పెరిగి, పర్యాటక రంగంపై ఆధారపడిన అనేక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. వినతిని సానుకూలంగా స్వీకరించిన ఎంపీ డా. గుమ్మ తనూజరాణి సంబంధిత రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైలు సర్వీసు పునరుద్ధరణ ద్వారా అరకు ప్రాంత పర్యాటక రంగానికి ఊతం లభించడంతో పాటు స్థానికంగా ఉపాధి పొందుతున్న వాహన యజమానులు, డ్రైవర్లు, గైడ్లు, హోటల్ నిర్వాహకులు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలిగేలా చొరవ తీసుకుంటామని తెలిపారు.