స్థానిక ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీదే పైచేయి

బీసీ రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం మోసపూరిత వైఖరి.. 

బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం: పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి

 పుంగనూరు: స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో బీసీలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ నేత పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి విమర్శించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులోనూ న్యాయపరమైన ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో, బీసీలకు నిజమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి పార్లమెంట్‌లో చట్టం చేయించాలని కోరారు. 

బీసీలకు అండగా ఉంటామని చెబుతూనే వారిని మోసం చేయడం సరికాదని సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా బీసీలకు శాశ్వత న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే బీసీ సంఘాలతో కలిసి వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు.

పెన్షన్ల విషయంలోనూ ప్రజలను భయపెట్టే రాజకీయాలు చేస్తున్నారని సుధీర్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికలు సమీపించినప్పుడు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత వాటిని అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం విషయంలోనూ కేంద్ర పథకానికి కొత్త రూపం ఇచ్చి కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైయ‌స్ఆర్‌సీపీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని సుధీర్‌రెడ్డి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురిచేసినా వెనక్కి తగ్గేది లేదని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. పుంగనూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, స్థానిక ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Back to Top