తాడేపల్లి : బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా, ఆ హామీని చట్టబద్ధంగా అమలు చేసే దిశగా మాత్రం ముందడుగు వేయడం లేదని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన పరిమితులను అధిగమించాలంటే అవసరమైన చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేయకుండా కేవలం జీవో జారీ చేసి, మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామంటూ చెప్పడం బీసీలను మభ్యపెట్టడమేనని బొత్స మండిపడ్డారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణకు కృషి చేయకుండా బీసీ రిజర్వేషన్ల పేరుతో రాజకీయ ప్రచారం చేయడం వెనుక ఉద్దేశమేంటని నిలదీశారు. ఇది ముమ్మూటికీ బీసీలను మోసం చేయడమేనని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకున్నదే చంద్రబాబు: గతంలో వైయసా్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు.. టీడీపీ నాయకులతోనే కోర్టులో కేసులు వేయించి, స్టేలు తెప్పించి ఎన్నికలను అడ్డుకుంది స్వయంగా చంద్రబాబు నాయుడే. న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పటికీ, మా పార్టీ కమిట్మెంట్కు కట్టుబడి బీసీలకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన దానికంటే అదనంగా 40 నుంచి 50 శాతం వరకు పదవులు ఇచ్చాం. జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండి చట్ట సవరణ ఎందుకు చేయరు?: ఇవాళ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నది మీ కూటమి ప్రభుత్వమే కదా? సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే పార్లమెంటులో చట్ట సవరణ చేయాల్సిందే. కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని చెప్పుకునే మీరు, పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు ఎందుకు పెట్టరు? ఆ పని చేయకుండా మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పడం బీసీలను మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం కాదా? చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి. 1994 ప్రక్రియకు చంద్రబాబు క్రెడిట్ కొట్టేసే యత్నం: తానే బీసీలకు 34 శాతం జీవో ఇచ్చానని చంద్రబాబు ప్రచారం చేసుకోవడం పచ్చి అబద్ధం. అసలు ఆ ప్రక్రియ ప్రారంభమైంది 1994లో వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ తర్వాత ప్రభుత్వం మారి చంద్రబాబు అధికారంలోకి వచ్చి కేవలం ఆ కాగితంపై సంతకం పెట్టి జీవో ఇచ్చారు.. మరోవైపు ఆ టైంలో ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు. నిత్యం అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడమే చంద్రబాబు నైజం. స్వర్గీయ వైఎస్సార్ గారు చెప్పినట్లు నిజం చెబితే తల వేయి చెక్కలవుతుందన్న మునిశాపం చంద్రబాబుకు ఉన్నట్లుంది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించడం చేతకాక వాయిదా వేయాలనుకుంటే వేరే కారణాలు చూసుకోవాలి తప్ప, రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలతో చెలగాటం ఆడవద్దు. టీడీపీ బీసీ నేతలు ఎందుకు ప్రశ్నించరు?: టీడీపీలో ఉన్న బీసీ నాయకులను నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీ వర్గానికి చంద్రబాబు పచ్చి అన్యాయం చేస్తుంటే మీ నాయకుడిని ఎందుకు నిలదీయడం లేదు? పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదు? బాబు ఆడే మోసపూరిత నాటకాలకు తందాన తాన అంటూ వంతపాడటం సమంజసమేనా? బీసీలకు ఎవరు ఎన్ని పదవులు ఇచ్చారో ఎల్లో మీడియా ఒక టేబుల్ వేసి రాయగలదా? మేం నిలదీస్తే తప్ప ఒక రాజ్యసభ సీటు బీసీలకు ఇవ్వని చరిత్ర టీడీపీది. బీసీ సోదరులారా.. చంద్రబాబు నైజాన్ని గుర్తించండి: రాష్ట్రంలోని నా బీసీ సోదర, సోదరీమణులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు మన బలహీనతలను రాజకీయ కోణంలో వాడుకుంటూ మరోసారి మోసం చేయడానికి చూస్తున్నారు. ఆయన కల్లబొల్లి మాటలను ఎవరూ నమ్మవద్దు. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చే వరకు మనమంతా ఐక్యంగా గళమెత్తాలి. డీఎస్సీపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలి: మరోవైపు డీఎస్సీ పరీక్షల నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగాయి, స్పోర్ట్స్ కోటా పేరిట తప్పుడు సర్టిఫికెట్లతో అక్రమాలకు పాల్పడ్డారని ఆధారాలతో సహా నిరూపించినా ప్రభుత్వంలో చలనం లేదని బొత్స సత్యనాార మండిపడ్డారు. దీనిపై విచారణ జరిపించడంతో పాటు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో 2004లో ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమల శాఖ మంత్రిగా నా శాఖపై ఆరోపణలు వచ్చిన వెంటనే, వైఎస్సార్ గారి వద్దకు వెళ్లి నా శాఖ నుంచి తప్పుకుని స్వచ్ఛందంగా సీబీఐ విచారణ కోరానని... సీబీఐ విచారణలో నాకు ఎలాంటి సంబంధం లేదని తేలిందన్నారు. మరి ఇప్పుడు డీఎస్సీ అవకతవకలపై ఆరోపణలు వస్తుంటే కూటమి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుందో చెప్పాలన్నారు. విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.