తాడేపల్లి: ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న నారా లోకేష్ తన సమాధానాలతో జాతీయ స్థాయిలో పాన్ ఇండియా జోకర్‌గా మారిపోయారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఎద్దేవా చేశారు. యాంకర్ అడిగిన సూటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబించారని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు, 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, డీఎస్సీ సర్టిఫికెట్లు, స్వతంత్ర విచారణ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి కీలక అంశాలపై లోకేష్ ఇచ్చిన సమాధానాలు ప్రజలకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన యనమల నాగార్జున యాదవ్.. డీఎస్సీ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రెస్‌మీట్‌లో నాగార్జున యాదవ్ ఏమన్నారంటే.. - 20 లక్షల ఉద్యోగాలు.. రూ.3 వేల నిరుద్యోగ భృతి ఏమయ్యాయి? “ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీల అమలు గురించి ఇండియా టుడే యాంకర్ ప్రశ్నిస్తే లోకేష్ స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కలిపి 30,99,476 ఉద్యోగాలు కల్పించారు. రెండున్నరేళ్ల కూటమి పాలనలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో ప్రజలకు చెప్పాలి. నిరుద్యోగ భృతి హామీ పరిస్థితి ఏమిటో కూడా స్పష్టం చేయాలి” అని యనమల నాగార్జున యాదవ్ అన్నారు. - డీఎస్సీ సర్టిఫికెట్లపై స్వతంత్ర విచారణకు ఎందుకు వెనుకడుగు? “డీఎస్సీ స్పోర్ట్స్ కోటా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లపై స్వతంత్ర దర్యాప్తుకు సిద్ధమా అని ప్రశ్నించినప్పుడు కూడా లోకేష్ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. తప్పు చేయలేదని చెబుతున్నప్పుడు స్వతంత్ర విచారణకు సిద్ధమని స్పష్టంగా చెప్పాలి. డీఎస్సీ వ్యవహారంలో సర్టిఫికెట్ల పరిశీలన, స్వతంత్ర విచారణ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తదితర అంశాలపై వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలి. డీఎస్సీ అంశంలో పారదర్శకతకు సంబంధించిన ప్రశ్నలను దాటవేయకుండా పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలి. డీఎస్సీ వ్యవహారంలో పారదర్శకతపై సమాధానం చెప్పలేకపోతే విద్యాశాఖ మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలి” అని యనమల నాగార్జున యాదవ్ తేల్చి చెప్పారు. - యూడైస్ గణాంకాలు ఏం చెబుతున్నాయో లోకేష్‌కు తెలియదా? “ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని లోకేష్ చెబుతున్నారు. కానీ యూడైస్ గణాంకాల ప్రకారం 2023–24లో ప్రభుత్వ పాఠశాలల్లో 40,05,016 మంది విద్యార్థులు ఉండగా, 2025–26లో ఆ సంఖ్య 34,93,450కు తగ్గింది. అంటే 5,11,566 మంది విద్యార్థుల తగ్గుదల నమోదైంది. అదే సమయంలో 2023–24లో ప్రైవేట్ పాఠశాలల్లో 45,55,380 మంది విద్యార్థులు ఉండగా, 2025–26లో 48,40,296 మందికి పెరిగారు. అంటే 2,84,916 మంది విద్యార్థులు పెరిగారు. ఈ గణాంకాల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్న లోకేష్ వాదనకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖ పనితీరుపై వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించాలి” అని యనమల నాగార్జున యాదవ్ పేర్కొన్నారు. - “త్రీ ఎస్”లో స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ ఎక్కడ? “స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ అంటూ లోకేష్ చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలకు కనిపిస్తున్నది మాత్రం సైలెంట్, స్కామ్స్, సఫరింగ్. 20 లక్షల ఉద్యోగాలు, రూ.3 వేల నిరుద్యోగ భృతి, డీఎస్సీ వ్యవహారం వంటి కీలక అంశాలపై సూటి ప్రశ్నలు ఎదురైనప్పుడు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబించారు. స్పీడ్ అంటున్న ప్రభుత్వం హామీల అమలులో ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? సర్వీస్ అంటున్న ప్రభుత్వం ప్రజల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదు? స్టెబిలిటీ అంటున్న పాలనలో వివాదాలు, ప్రజల్లో ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి? ‘త్రీ ఎస్’ గురించి చెప్పే ముందు వాటి అమలులో కనిపిస్తున్న ఫలితాలను లోకేష్ ప్రజలకు వివరించాలి” అని యనమల నాగార్జున యాదవ్ అన్నారు. - ఎన్నికల హామీల బాధ్యత ఓటర్లదంటూ కొత్త వాదన! “ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేస్తామని చెప్పిన టీడీపీ.. ఇప్పుడు హామీల అమలు బాధ్యత రాజకీయ పార్టీలదే కాదని, ఓటర్లకు కూడా బాధ్యత ఉందని లోకేష్ చెప్పడం విడ్డూరంగా ఉంది. హామీలు ఇచ్చింది రాజకీయ పార్టీలే అయినప్పుడు వాటి అమలు బాధ్యత కూడా ఆయా పార్టీలదే కదా? ఆర్థిక పరిస్థితిపై ప్రశ్నించినప్పుడు హామీల అమలుకు సంబంధించిన స్పష్టమైన కార్యాచరణను వివరించాలి. 2019లో ఎన్నికల సంఘం, ప్రధాని మోదీపై టీడీపీ చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు లోకేష్ చెబుతున్న ‘వాస్తవాల ఆధారంగా వెళ్తాం’ అనే వైఖరికి మధ్య ఉన్న తేడాపైనా వివరణ ఇవ్వాలి” అని యనమల నాగార్జున యాదవ్ డిమాండ్ చేశారు.