బీసీలపై నయవంచన రాజకీయాలు ఇంకా ఎన్నాళ్లు చంద్రబాబూ?

34 శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో మాట్లాడి రాజ్యాంగబద్ధమైన మార్గం తీసుకురండి

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ 

తాడేపల్లి: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. కోర్టులో నిలబడే అవకాశం లేని నిర్ణయాలు తీసుకుని బీసీలను మభ్యపెట్టడం ఎందుకని ప్రశ్నించారు. బీసీలకు నిజంగా 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన మార్గాన్ని తీసుకురావాలని స్పష్టం చేశారు.

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అవకాశాలు కల్పించిన విధానాలను వైయ‌స్‌ జగన్‌ వివరించారు. 2019లో నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టు పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం, 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవుల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించిన విషయాలను ప్రస్తావించారు. బీసీలకు నిజమైన న్యాయం చేయాలంటే మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని చంద్రబాబును కోరారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో వైయ‌స్ జ‌గ‌న్ పోస్టు చేశారు.

వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా..

చంద్ర‌బాబు గారూ… మీరు బీసీలపై నయవంచనతో కూడిన రాజకీయాలు ఇంకా ఎన్నాళ్లు చేస్తారు? ఇంకా ఎన్నాళ్లు వారిని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ డ్రామా చేస్తున్నారని మీకూ తెలుసు? సుప్రీంకోర్టు గత తీర్పుల వల్ల అది ఏ కోర్టులోనూ నిలబడదని కూడా మీకు తెలుసు? కోర్టులో నిలబడదని తెలిసీ, 44 రోజులుగా మీరు చేసింది కపట నాటకం కాదా? ఇవాళ  మీరిచ్చిన  జీవోలను కొట్టేస్తూ, హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీసీలకు క్షమాపణలు చెప్పి, లెంపలు వేసుకోండి చంద్రబాబుగారూ..

చంద్రబాబుగారూ.. నిజంగా మీకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే.. మీరు చేయాల్సింది కేంద్రంలో ఉన్న మీ కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి ఆ మేరకు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఒక మార్గాన్ని తీసుకొస్తే గాని, ఈ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. మరి ఆ దిశగా మీరు ఏం చేశారు? కేంద్రంతో మాట్లాడారా? కనీసం మీ కేంద్ర మంత్రులతో అక్కడి కేబినెట్‌ సమావేశాల్లో ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారా? మీరు ఢిల్లీ వెళ్లినప్పుడు ఎన్నిసార్లు దీనిపై కేంద్రంతో చర్చించారు? ఇవి చేయకుండా, చెల్లని జీవోలు ఇచ్చి డ్రామాలు చేయడం వెనుక మీ ఉద్దేశం, బీసీలను మభ్య పెట్టి, మోసం చేయాలనే కదా? రాజకీయ స్వార్థం కోసం మీ డ్రామాలు ప్రదర్శించడానికి బీసీలే కావాల్సి వచ్చారా?

బీసీలపై ప్రేమ మాటల్లో కాదు చంద్రబాబుగారూ… చేతల్లో చూపించాలి. మా ప్రభుత్వ హయాంలో మనసా, వాచా, కర్మణా బీసీల సహా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా పైకి తీసుకురావడానికి అన్ని రకాలుగా పనిచేశాం. చరిత్రలో తొలిసారి విప్లవాత్మకమైన చట్టాన్ని, 2019 ఆగస్టులో తీసుకువస్తూ, రాష్ట్రంలోని కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీలు, కమిటీలలోని నామినేటెడ్‌ పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో BC, SC, ST, మైనార్టీలకు 50% రిజర్వేషన్ కల్పించాం. పదవులు పొందిన ఎంతోమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు రాజకీయంగా చైతన్యవంతులయ్యారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక మెట్టు పైకి వచ్చి, ప్రజాసేవలో పాల్గొన్నారు. దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ వర్గాల్లో సరికొత్త నాయకత్వాన్ని తయారు చేసిన ఘనత ఒక్క వైయస్సార్‌సీపీకే దక్కింది. అంతేకాదు 139 బీసీ కులాలను కవర్‌ చేస్తూ 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. మీ ప్రభుత్వం వద్దే మేం తెచ్చిన చట్టం ఉంది. రెండున్నరేళ్లుగా ఆ చట్టాన్ని ఎందుకు పట్టించుకోలేదు? మా మాదిరి మీరు ఎందుకు అమలు చేయలేదు? కళ్లముందే బీసీలకు మేలు కలిగే చట్టం ఉన్నా ఎందుకు పట్టించుకోలేదు? ఇదీ బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి.

అంతేకాదు, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మాకు మేముగా బీసీలకు రాజకీయంగా మంచి అవకాశాలను కల్పించాం. 11 రాజ్యసభ స్థానాల్లో నాలుగు బీసీలకు అవకాశం ఇచ్చాం. 58 ఎమ్మెల్సీ స్థానాల్లో 28 స్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాం. చివరకు స్థానిక సంస్థల్లో కూడా జనరల్‌ స్థానాల్లో టిక్కెట్లు బీసీలకే ఇచ్చాం. 13 జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవుల్లో ఆరు, 13 మేయర్‌ పదవుల్లో తొమ్మిది, 84 మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవుల్లో 44 బీసీలకు ఇచ్చాం. 636 మండలాధ్యక్ష పదవుల్లో 239, 639 జడ్పీటీసీల్లో 227 బీసీలకే ఇచ్చాం, చంద్రబాబుగారూ.. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా? 

అంతేకాదు.. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్‌ కానుక, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు, తోడు తదితర సంక్షేమ కార్యక్రమాల్లో బీసీ కుటుంబాలు పెద్ద సంఖ్యలో లబ్ధిపొందాయి. వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకు మొత్తం రూ.1.82 లక్షల కోట్ల ప్రయోజనం అందించాం. ఇప్పుడు వీటన్నింటినీ నాశనం చేసి బీసీల ఉసురు తీస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలను పైకి తీసుకురావడం కోసం మేం ఏర్పాటు చేసిన నిచ్చెనలను విరగ్గొట్టారు. పైగా మీరిచ్చిన సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌లు సహా అనేక హామీలను మోసాలుగా మార్చారు.

చంద్రబాబుగారూ.. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు 34% రిజర్వేషన్‌ ఇవ్వాలనుకుంటే, అది రాజ్యాంగబద్ధమైన చర్యల ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నమీరు, అక్కడ మీ పరపతిని వాడి, కేంద్రాన్ని ఒప్పించి, చట్ట సవరణ ద్వారా 34% రిజర్వేషన్లు తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నాం.

Back to Top