నెల్లూరు: వైయస్ఆర్సీపీ తరఫున నెల్లూరు మేయర్ అభ్యర్థిగా తనను ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రిజర్వేషన్లు ఖరారు కాకముందే తన పేరును ప్రకటించడాన్ని జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని పేర్కొన్నారు. పార్టీకి విధేయంగా పనిచేసే నాయకులకు వైయస్ జగన్మోహన్రెడ్డి తగిన గుర్తింపు, అవకాశం కల్పిస్తారనడానికి ఇది నిదర్శనమని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైయస్ జగన్ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలతో కలిసి విజయం దిశగా అడుగులు వేస్తామని ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వైయస్ఆర్సీపీకి అభ్యర్థులే లేరని విమర్శిస్తున్న కూటమి నేతలు ఇప్పటివరకు తమ అభ్యర్థిని ప్రకటించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరంలోని 72 డివిజన్ల ప్రజలు వైయస్ఆర్సీపీకి అండగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 2024లో పొరపాటు చేశామని, మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేమని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులు, బైండోవర్ చర్యలు, బెదిరింపులకు వైయస్ఆర్సీపీ శ్రేణులు భయపడబోవని ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. గత వైయస్ జగన్ పాలనను, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకునే ప్రజలు వైయస్ఆర్సీపీకి మద్దతుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.