తాడేపల్లి: ప్రతిపక్ష వైయస్ఆర్సీపీ అభ్యర్థులను పోటీలో లేకుండా చేయడమే లక్ష్యంగా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ వ్యూహాత్మక కుట్రలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దసరా నవరాత్రుల పవిత్ర సమయాన్ని ఎంచుకుని హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన మండిపడ్డారు. నయానో, భయానో వ్యవస్థలను వాడుకుని ఎలాగైనా ఎన్నికల్లో గట్టెక్కలనే ఈ కుటిల యత్నాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని ధ్వజమెత్తారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, అభ్యర్థులకు కావాలనే కుల ధృవీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు సకాలంలో ఇవ్వకుండా జాప్యం చేయడం, ఇస్తే తప్పుల తడకగా ఇవ్వడం లాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మరోవైపు, అభ్యర్థులు, నాయకులను టార్గెట్ చేస్తూ పోలీసులు ఇష్టానుసారంగా బైండోవర్ కేసులు పెట్టడం, అదర్స్ పేరుతో అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి బెదిరింపులకు గురిచేయడం, వారి కదలికలపై నిఘా పెట్టడం వంటి చర్యలను తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ప్రస్తావించారు. అశాస్త్రీయమైన వార్డుల విభజనలు జరిగాయని, ఇవాళ కూడా బలహీనమైన చోట్ల ఎన్నికలను మేనేజ్ చేసి వాయిదా వేయించే కుతంత్రాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికలు అత్యంత పక్షపాత రహితంగా, స్వేచ్ఛగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, వైయస్ఆర్సీపీఎన్నికలకు ఎప్పుడూ భయపడదని కన్నబాబు గారు స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి వైయస్ఆర్సీపీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్న పోలీస్ అధికారులు మరియు అక్రమాలకు పాల్పడుతున్న వారిపై భవిష్యత్తులో న్యాయస్థానాల్లో కఠినమైన పోరాటం చేస్తామని, చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... నయానో భయానో గట్టెక్కాలని చూస్తున్నాడు: చంద్రబాబు నయానో, భయానో, వ్యవస్థలను, పోలీసులను, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కాలని చూస్తున్నారు. దసరా నవరాత్రుల సమయంలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక ఆంతర్యం కూడా అదే. ప్రజలు పండుగల హడావుడిలో ఉంటే ఎన్నికల ప్రక్రియను హడావుడిగా ముగించేయాలనేది ఆయన ఆలోచన. రాష్ట్రంలో పోలీసులతో రాజకీయం చేస్తున్నారు. తప్పుడు కేసులు, పాత కేసులు, అదర్స్ పేరుతో అరెస్టుల భయాలు, బైండోవర్ కేసులతో వైయస్ఆర్సీపీ అభ్యర్థులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు పోటీలో లేకుండా చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ వ్యూహాత్మక కుట్రలకు పాల్పడుతోంది. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, అభ్యర్థులకు కావాలనే కుల ధృవీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు సకాలంలో ఇవ్వకుండా జాప్యం చేయడం, ఇస్తే తప్పుల తడకగా ఇవ్వడం లాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. బలమైన అభ్యర్థులను పిలిచి కౌన్సెలింగ్ పేరుతో బెదిరించడం, వ్యాపారాలు దెబ్బతీస్తామని హెచ్చరించడం వంటి చర్యలతో ప్రతిపక్షాలను పోటీలో లేకుండా చేయాలనే వ్యూహాత్మక కుట్రలు జరుగుతున్నాయి. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సింది పోయి, అరాచకాలకు, దొడ్డిదారులకు తెరతీయడం సరికాదు. ప్రజాబలం లేనివాళ్లే ఇలాంటి పద్ధతులకు పాల్పడతారు. అశాస్త్రీయమైన వార్డుల విభజన, రిజర్వేషన్లలో పారదర్శకత లేకపోవడం వంటి ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పోలీసులు చట్టప్రకారం నడుచుకోవాలి: పోలీసు అధికారులు రాజకీయ పార్టీలకు తొత్తులుగా పనిచేయకూడదు. పోలీసుల విధి చట్టాన్ని అమలు చేయడం, ప్రజలకు రక్షణ కల్పించడం; అధికార పార్టీ రాజకీయ అవసరాలను తీర్చడం కాదు. గుంటూరు, పల్నాడు, రాయలసీమ తదితర ప్రాంతాల్లో మా నాయకుల కదలికలపై నిఘా ఎందుకు పెడుతున్నారు? ఎన్నికల పర్యవేక్షణలో ఉన్న నాయకులను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? నిజాయితీగా, నిష్పక్షపాతంగా పనిచేసే అధికారులపై ఫిర్యాదులు చేయించి వారిని విధుల నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఏదైనా సమస్య సృష్టించి, ఎన్నికల కమిషన్ ద్వారా మరో విడతకు వాయిదా వేయించి, ఆ తర్వాత అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలనే వ్యూహాలపై కూడా ఎన్నికల సంఘం అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా అభ్యర్థులకు, ఓటర్లకు ఇబ్బందులు ఎదురైతే పోలీసులు తక్షణమే స్పందించాలి. చట్టవిరుద్ధంగా వ్యవహరించే పోలీసు అధికారులపై వైయస్ఆర్సీపీ న్యాయస్థానాల్లో న్యాయపోరాటం చేస్తుంది. ఎన్నికల సంఘం ప్రతి ఫిర్యాదునూ నిష్పక్షపాతంగా పరిశీలించి, తప్పు చేసినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. వైయస్ఆర్సీపీ డిమాండ్లు: ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల సంఘం ముందు వైయస్ఆర్సీపీ స్పష్టమైన డిమాండ్లు ఉంచుతోంది. దీనిమీద తప్పనిసరిగా స్పందించాల్సిన అవసరం ఉంది. 1. అధికార దుర్వినియోగంతో పూర్తిస్థాయిలో ఎన్నికల అక్రమాలకు దిగే అవకాశం ఉన్నందున, బ్యాలెట్ బాక్సులు ఉంచే స్ట్రాంగ్ రూమ్స్‌లో కచ్చితంగా సీసీ కెమెరాలు ఉంచాలి. 2. సీసీ కెమెరాలను కేవలం స్ట్రాంగ్ రూం వెలుపలే కాకుండా, హాల్లో నలు దిశలా, బాక్స్‌లు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు పెట్టాలి. వెబ్ క్యాం లైవ్‌ను పార్టీలకు, వారి ఏజెంట్లకు ఇవ్వాలి. 3. అలాగే పోలింగ్ బూత్ల్లోకూడా అన్ని కోణాల్లో సీసీ కెమెరాలు పెట్టి, వాటి లైవ్‌ను కూడా పార్టీలకు ఇవ్వాలి. 4. వైయస్ఆర్సీపీకి చెందిన ఓటర్లను ఓట్లు వేయనీయకుండా చంద్రబాబు పోలీసులను వాడుకుని చెల్లాచెదురు చేసే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి, చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి పారా మిలటరీ బలగాలను భద్రత కోసం వాడాలి. 5. ఇష్టానుసారంగా పోలీసులు బైండోవర్లు చేస్తూ, మా పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకోవాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. ఈ బైండోవర్లను కచ్చితంగా అడ్డుకోవాలి. చట్ట ఉల్లంఘనలను తక్షణమే అడ్డుకోవాలి. 6. అభ్యర్థులకు కులధృవీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు అప్లై చేసిన 24 గంటల్లోగా ఇవ్వాలి. దీనికోసం సింగిల్ విండో వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే: ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల సంఘానికి స్పష్టంగా చెబుతున్నాం. ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలంగా నిర్వహించకూడదు. వార్డుల విభజన, రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాలు, నామినేషన్లు, పోలీసుల బైండోవర్లు, అభ్యర్థులకు సర్టిఫికెట్ల జారీ వంటి ప్రతి అంశంలోనూ నిబంధనలు పాటించాలి. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి, తీసుకున్న చర్యలను వెల్లడించాలి. అధికార కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వ్యవస్థలను ఉపయోగిస్తోందన్న మా ఆందోళనలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించాలి. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలు నిర్ణయిస్తారు, పోలీసులు కాదు, అధికారులు కాదు. వైయస్ఆర్సీపీ ఎన్నికలకు ఎప్పుడూ భయపడదు. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నాం. ఇప్పుడు కూడా ప్రతి స్థాయిలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సింది ఒక్కటే, అభ్యర్థులకు సమాన అవకాశం, ఓటర్లకు స్వేచ్ఛ, ఎన్నికల నిర్వహణలో పూర్తి పారదర్శకత. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఆ బాధ్యతను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని కురసాల కన్నబాబు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.