రైతుల ఆవేదనను పట్టించుకోని కూటమి ప్రభుత్వం

 డాక్టర్‌ అశోక్‌కుమార్‌ చింతలపూడి ఆగ్రహం

అద్దంకి: రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, కానీ కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కన్నీరు పెడుతున్నారని అద్దంకి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ అశోక్‌కుమార్‌ చింతలపూడి విమర్శించారు. సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు గ్రామంలో విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు విద్యుత్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగిన ఘటనపై ఆయన స్పందించారు. పంటలు ఎండిపోతున్నాయని, తమ పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నా ప్రభుత్వం, విద్యుత్‌ అధికారులు పట్టించుకోవడం లేదని డాక్టర్‌ అశోక్‌కుమార్‌ మండిపడ్డారు. గంట, అరగంట మాత్రమే విద్యుత్‌ సరఫరా చేస్తున్న పరిస్థితుల్లోనూ తీవ్రమైన వోల్టేజీ సమస్యలు ఎదురవుతున్నాయని, అధికారుల నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. 

విద్యుత్‌ శాఖ మంత్రి సొంత ఇలాకా పరిధిలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ఆందోళనకరమని డాక్టర్‌ అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం, విద్యుత్‌ శాఖ తక్షణమే స్పందించి రైతులకు సకాలంలో నాణ్యమైన విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. పంటలు ఎండిపోకుండా తగిన చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ తరఫున కోరారు.

Back to Top