జగన్‌ గారి వ్యక్తిగత హాజరుపై ఎలాంటి ఆదేశాలు లేవు

ఎల్లో మీడియా చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమే 

మలసాని మనోహర్‌ రెడ్డి స్పష్టీకరణ 

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌ రెడ్డి

తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను డైవర్ట్‌ చేయడం కోసం జగన్‌ గారి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలంటూ ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌ రెడ్డి మండిపడ్డారు. వైయస్ జగన్‌ గారు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలంటూ ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ, సీబీఐ కోర్టులో జగన్‌కు షాక్‌ అంటూ ఎల్లోమీడియా తప్పుడు ప్రచారానికి తెర తీసిందని ఆయన ఆక్షేపించారు. పిటిషన్లపై ఇప్పటికే రోజువారీ విచారణలు జరుగుతున్నాయని, అయినప్పటికీ రోజువారీ విచారణలు జరపాలంటూ ఈడీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంపై అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేతిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఒక కీలుబొమ్మలా మారిందని, ఈడీని కేంద్రంగా చేసుకుని చంద్రబాబు రాజకీయ కుట్రలకు తెరలేపాడనే ఆరోపణలకు ఈ సంఘటన బలం చేకూర్చేలా ఉందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. 
ప్రెస్‌మీట్‌లో ఎం.మనోహర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే:

ఈడీ వ్యవహార శైలిపై అనుమానాలు నిజమనిపించేలా..:
    ఎల్లో మీడియాకు ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ గారి నామస్మరణ లేకుండా రోజు గడవడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక విషప్రచారంతో జగన్‌ గారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల దృష్టిని మళ్లించేందుకు జగన్‌గారి వ్యక్తిగత హాజరుకు కోర్టు ఆదేశాలంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారు. 
    జగన్‌గారు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలంటూ ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ, సీబీఐ కోర్టులో జగన్‌కు షాక్‌ అంటూ ఎల్లోమీడియా తప్పుడు ప్రచారానికి తెర తీసింది. జగన్‌ గారిపై నమోదైన కేసుల్లో ఇప్పటికే రోజువారీ విచారణలు జరుగుతున్నాయి. అయినప్పటికీ రోజువారీ విచారణలు జరపాలంటూ ఈడీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిందని జగన్‌గారి తరఫు న్యాయవాదులు సీబీఐ కోర్టుకు వివరించారు. ఈ కేసులను త్వరగా తేల్చాలని తామే కోరుతున్నామని, పిటిషన్లపై ఇప్పటికే రోజువారీ విచారణ జరుగుతోందని వారు స్పష్టం చేశారు.
    దీంతో ఈడీ తరఫు న్యాయవాదులను కూడా పిలిపించిన కోర్టు, వారు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించి, సీబీఐతో పాటు ఈడీ ఛార్జిషీట్లపైనా విచారణ జరుపుతామని తెలిపింది. వాస్తవాలు ఈ విధంగా ఉంటే, వాటిని వక్రీకరిస్తూ జగన్‌ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఎల్లోమీడియా దుష్ప్రచార ధోరణికి నిదర్శనం. మరోవైపు, ఈడీని కేంద్రంగా చేసుకుని రాజకీయ కుట్రలకు చంద్రబాబు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈడీ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తోందన్న అనుమానాలకు తావిచ్చేలా ఈ పరిణామాలు ఉన్నాయి. కోర్టు ఆదేశాలను వక్రీకరించకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియాపై ఉంది.

చంద్రబాబు కేసుల్లో దర్యాప్తు స్థితిని కూడా చెప్పాలి: 
    ఈడీ నిజంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తుంటే, చంద్రబాబుకు సంబంధించిన కేసుల దర్యాప్తు ఏమైందో చెప్పాలి. స్కిల్‌ స్కామ్‌తో పాటు, ఇతర ఆర్థిక ఆరోపణలపై దర్యాప్తు పురోగతి ఏమిటి? చంద్రబాబు గారి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌కు సంబంధించిన వ్యవహారంలో అనుమానాస్పద లావాదేవీలపై ఏం తేల్చారు? ఆ దర్యాప్తు స్థితిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. అలాగే ఈడీలో పనిచేసిన బొల్లినేని శ్రీనివాస గాంధీ వ్యవహారంపై గతంలో వచ్చిన ఆరోపణలు, వాటికి సంబంధించిన పరిణామాలపైనా సమాధానం చెప్పాలి. జగన్‌ గారి కేసుల విషయంలో చూపిస్తున్న శ్రద్ధను ఇతర కేసుల విషయంలోనూ చూపించాలి. 
    ఒకవైపు జగన్‌ గారిని లక్ష్యంగా చేసుకుని ప్రచారం జరుగుతుంటే, మరోవైపు ఇతర కేసుల దర్యాప్తులో పురోగతి ఏమిటన్న ప్రశ్నలకు సమాధానం లేకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. జగన్‌ గారి కేసుల విషయంలో ఒక రకంగా, చంద్రబాబుకు సంబంధించిన కేసుల విషయంలో మరో రకంగా ఈడీ వ్యవహరిస్తున్నదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ప్రతి కేసులోనూ చట్టప్రకారం, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలి. రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నారనే అనుమానాలకు తావులేకుండా వాటి పనితీరు ఉండాలి. 

ఎల్లో మీడియాపై పరువు నష్టం దావా వేస్తాం: 
    కోర్టు ఆదేశాలను వక్రీకరించి, జగన్‌ గారి వ్యక్తిగత హాజరుపై తప్పుడు వార్తలు ప్రసారం చేయడం ఎల్లో మీడియా మానుకోవాలి. వాస్తవాలను నిర్ధారించకుండా తప్పుడు కథనాలు ప్రసారం చేసే మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేయడంతో పాటు చట్టపరమైన చర్యలను తీసుకునే అంశాన్ని పరిశీలిస్తాం. ఏదేమైనా న్యాయస్థానాల ప్రక్రియను రాజకీయ ప్రచారానికి ఉపయోగించకూడదని ఎం.మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. 

Back to Top