శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో పేద కుటుంబాలపై అక్రమాలకు పాల్పడితే ఎవరినీ విడిచిపెట్టేది లేదని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు. రేణిగుంట మండలం కరకంబాడి రెవెన్యూ పరిధిలోని రామకృష్ణాపురంలో నాలుగు దశాబ్దాలుగా నివాసముంటున్న నిరుపేద కుటుంబాల ఇళ్లను రోడ్డు విస్తరణ పేరుతో ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాళ్లు లేని దివ్యాంగుడిని, మహిళలను బూట్లతో తన్ని, జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లడం అత్యంత అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత కక్షలతోనే పేదలపై ప్రతాపమా? స్థానిక టీడీపీ బూత్ కమిటీ నాయకుడు ముని కృష్ణ వ్యక్తిగత కక్షలతో, కార్ పార్కింగ్, భూ ఆక్రమణల ఉద్దేశంతో పోలీసులను, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని ఈ చర్యలకు పాల్పడ్డారని బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. పేదల ఇళ్లను నేలమట్టం చేసిన వారితో పాటు ఈ ఘటనకు సహకరించిన అధికారులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్పీ, జిల్లా కలెక్టర్, ఆర్డీవో స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. న్యాయం జరిగే వరకు పోరాటం బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని బియ్యపు మధుసూదన్‌రెడ్డి స్పష్టం చేశారు. బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించడంతో పాటు న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని పేర్కొన్నారు. పేదలపై ఇలాంటి వేధింపులకు పాల్పడితే భవిష్యత్తులో ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హరిప్రసాద్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గంగారి రమేష్, రహీం, దయాకర్‌రెడ్డి, యోగేశ్వర్‌రెడ్డి, రేణిగుంట మాజీ సర్పంచ్ నగేష్, మాజీ సర్పంచ్ మునిశేఖర్, అస్సన్ సాహెబ్, జాన్‌బాబు, ఖాదర్, గుణశేఖర్, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.