ఉర్సు ఉత్సవాలకు వైయస్‌ జగన్‌కు ఆహ్వానం

పార్టీ కేంద్ర కార్యాల‌య‌లో వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన కడప అమీన్‌ పీర్‌ దర్గా ప్రతినిధులు 

తాడేపల్లి  : కడప అమీన్‌ పీర్‌ దర్గా ఉర్సు ఉత్సవాలకు వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దర్గా పీఠాధిపతి, ప్రతినిధులు ఆహ్వానించారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనను కలిసిన దర్గా ప్రతినిధులు, ఈ నెల 24 నుంచి 30 వరకు ఉర్సు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వివరించారు.

ఉత్సవాలను ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని వైయస్‌ జగన్‌ సూచించారు. కడప అమీన్‌ పీర్‌ దర్గా ఆధ్యాత్మిక విశిష్టతతో పాటు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. అన్ని మతాల ప్రజలు భక్తితో దర్గాను దర్శించుకోవడం, ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనడం ఈ పవిత్ర స్థల ప్రత్యేకతను చాటుతోందన్నారు.

హిందూ–ముస్లిం ఐక్యత, పరస్పర గౌరవం, సోదరభావం సమాజానికి బలమని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉత్సవాల్లో పాల్గొని మత సామరస్య సందేశాన్ని చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతి ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేనీ, చీఫ్‌ ముజావర్‌ అమీరుద్దిన్‌, ముజావర్లు వాజిద్‌ ఖాన్‌, బాజీ షేక్‌, రియాజుద్దిన్‌, పకీర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top