కొంద‌రు ఐఏఎస్ అధికారులు కూడా రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి భూమన కరుణాకరరెడ్డి ఫైర్‌

తాడేపల్లి: చంద్రబాబు పాలనలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, కుప్పం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వికాస్‌ మర్మత్‌ వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. బెంగళూరులోని ఓ పబ్‌లో మద్యం మత్తులో పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు వచ్చిన ఘటనపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఐఏఎస్‌ అధికారి పోలీసుల పట్లే అలా వ్యవహరించడంపై పాలనా వ్యవస్థలో క్రమశిక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు.

వికాస్‌ మర్మత్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు అండదండలు ఉన్నాయనే ధైర్యంతోనే అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని భూమన ఆరోపించారు. కుప్పంలో అభివృద్ధి పనుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, కమీషన్లలో నారా లోకేష్‌కు వాటాలు వెళ్తున్నాయనే ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎంవోలో కీలక అధికారి ప్రద్యుమ్న అండదండలు వికాస్‌ మర్మత్‌కు ఉన్నాయని పేర్కొంటూ, కుప్పం నుంచి జరుగుతున్నట్లు చెబుతున్న కమీషన్ల పంపకాల వ్యవహారంపై వాస్తవాలు వెలుగులోకి తేవాలన్నారు.

తీవ్ర ఒత్తిళ్ల మధ్య పోలీసులు వికాస్‌ మర్మత్‌పై కేసు నమోదు చేసినప్పటికీ, ఆయనను రక్షించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని భూమన ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని, సంబంధిత అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు కీలక పోస్టింగులు ఇవ్వడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.

Back to Top