సోషల్ మీడియా విభాగం పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే శక్తిగా మారాలి

గ్రామస్థాయి వరకు నెట్‌వర్క్‌ను విస్తరించి, లోకల్ కంటెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ఎన్నికల్లో ప్రతి ఘటనను విజువల్ ఎవిడెన్స్‌గా రికార్డు చేయాలి

సోషల్ మీడియా పోస్టుల్లో భాష హుందాగా, విషయం బలంగా ఉండాలి

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్  సజ్జల రామకృష్ణారెడ్డి

 తాడేపల్లి : నున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం అత్యంత కీలకమైన బాధ్యతను నిర్వహించాలని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్  సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా విభాగంలో బాధ్యతలు నిర్వహించే వారు సాధారణ కార్యకర్తల కంటే భిన్నంగా కంటెంట్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే ఆర్గనైజర్లుగా పనిచేయాలని సజ్జల సూచించారు. కంటెంట్ క్రియేట్ చేయడం ఒక్కటే కాకుండా, పార్టీ నుంచి వచ్చే మెసేజ్‌ను వెయ్యి మందికా, పదివేల మందికా, లక్ష మందికా ఎంత వేగంగా తీసుకెళ్లగలుగుతున్నామన్నదే అసలు సామర్థ్యమని చెప్పారు. సోషల్ మీడియా ప్రస్తుతం పార్టీ వ్యవస్థకు శరీరంలో రక్తప్రసరణలాంటి పాత్ర పోషిస్తోందని, ప్రజాభిప్రాయాన్ని చేరుకోవడంలో, పార్టీ వాదనను ప్రజల ముందు ఉంచడంలో దాని పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. సోషల్ మీడియా విభాగం అన్ని అనుబంధ విభాగాలతో అనుసంధానమై పనిచేయాలని చెప్పారు.    

గ్రామం, మండలం, నియోజకవర్గం వారీగా నెట్‌వర్క్ పెంచాలి

ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గంలో సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని సజ్జల సూచించారు. ప్రతి కార్యకర్త తనకు అందిన పార్టీ సందేశాన్ని ఎంతమందికి చేరవేయగలుగుతున్నాడో స్పష్టంగా గుర్తించుకోవాలని చెప్పారు.
రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఉన్న సోషల్ మీడియా కమిటీలను ఉపయోగించి, ప్రతి ప్రాంతానికి ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలు, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పార్టీ కంటెంట్‌ను నేరుగా గ్రౌండ్ లెవెల్‌కు తీసుకెళ్లాలని సూచించారు.

లోకల్ కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం

రాష్ట్రస్థాయి సాధారణ రాజకీయ సందేశాలతో పాటు స్థానిక సమస్యలే ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపుతాయని సజ్జల చెప్పారు. ఒక గ్రామంలో పెన్షన్లు తొలగించడం, స్థానికంగా సంక్షేమ ప్రయోజనాలు అందకపోవడం, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యార్థుల ఫీజులు, రైతుల ఇబ్బందులు, ధరల పెరుగుదల, స్థానిక నాయకులపై ఉన్న ఆరోపణలు వంటి అంశాలను వాస్తవ ఉదాహరణలు, గణాంకాలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
మహిళా విభాగం మహిళల సమస్యలపై, యువజన విభాగం నిరుద్యోగం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై, రైతు విభాగం రైతు సమస్యలపై కంటెంట్ రూపొందిస్తే, సోషల్ మీడియా విభాగం ఆ కంటెంట్‌ను విస్తృతంగా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పారు.

స్థానికంగా మాట్లాడగలిగే వారిని గుర్తించాలి

గ్రామం, మండలం, నియోజకవర్గ స్థాయిలో మంచి విషయ పరిజ్ఞానం ఉండి, స్పష్టంగా మాట్లాడగలిగే వారిని గుర్తించి ప్రోత్సహించాలని సజ్జల సూచించారు. పార్టీ విభాగాలకు చెందిన వారితో పాటు, ప్రజా సమస్యలపై మాట్లాడగలిగే రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, స్థానిక ఇన్‌ఫ్లూయన్సర్లను గుర్తించి వారి ద్వారా వీడియోలు, టెస్టిమోనియల్స్ రూపొందించాలని చెప్పారు. అలాంటి వారిని జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా పరిచయం చేసి వారి రీచ్ పెంచడం ద్వారా పార్టీకి ఉపయోగపడే బలమైన లోకల్ వాయిస్‌లను తయారు చేయాలని అన్నారు.

ఎన్నికల్లో విజువల్ ఎవిడెన్స్ అత్యంత కీలకం

స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు ఎక్కడైనా అడ్డంకులు, అధికారుల దుర్వినియోగం, పోలీసుల జోక్యం లేదా ప్రత్యర్థుల దౌర్జన్యాలు జరిగితే వాటిని తప్పనిసరిగా వీడియో రూపంలో రికార్డు చేయాలని సజ్జల సూచించారు.
ఈ విజువల్ ఎవిడెన్స్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు, కోర్టుల్లో న్యాయపరమైన చర్యలకు కూడా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. గ్రామస్థాయి కార్యకర్త వరకు ఎక్కడ ఏ ఘటన జరిగినా దాన్ని వెంటనే రికార్డు చేసి సోషల్ మీడియా నెట్‌వర్క్‌కు చేరవేసే వ్యవస్థ ఉండాలని సూచించారు.

సోషల్ మీడియా కార్యకర్త అభ్యర్థికి అండగా ఉండాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో సోషల్ మీడియా కార్యకర్తలు కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం కాకుండా, నామినేషన్ నుంచి పోలింగ్ ఫలితాల వరకు పార్టీ అభ్యర్థులకు అండగా ఉండాలని సమావేశంలో పిలుపునిచ్చారు. అభ్యర్థి పేరు, గుర్తు, స్థానిక సమస్యలు, ప్రచార కార్యక్రమాలను సోషల్ మీడియాలో విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల్లో సోషల్ మీడియా పనితీరును వచ్చే సాధారణ ఎన్నికలకు ఒక డ్రెస్ రిహార్సల్‌గా తీసుకోవాలని సజ్జల పేర్కొన్నారు.

విమర్శలో విషయం ఉండాలి.. భాష హుందాగా ఉండాలి

సోషల్ మీడియా పోస్టుల్లో ఆవేశానికి లోనై వ్యక్తిగత దూషణలకు వెళ్లవద్దని సజ్జల ప్రత్యేకంగా సూచించారు. “మనము ఎవరికి సమాధానం చెబుతున్నామన్నది కాదు, మనం కమ్యూనికేట్ చేసేది ప్రజలకు” అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. విమర్శలో విషయం, ఆధారాలు ఉండాలని, ఉపయోగించే భాష హుందాగా ఉండాలని స్పష్టం చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు అదే స్థాయిలో స్పందించడం వల్ల పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టేందుకు అవకాశం కల్పించకూడదని సూచించారు.    

సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా నిలిచింది: దొడ్డా అంజిరెడ్డి

వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి మాట్లాడుతూ, గత రెండేళ్లలో సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదైన సందర్భాల్లో పార్టీ నాయకత్వం, లీగల్ సెల్ వారికి న్యాయపరంగా అండగా నిలిచిందన్నారు.
పార్టీ నాయకత్వం సోషల్ మీడియాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ నుంచి ఫలితాల వరకు అభ్యర్థులకు సోషల్ మీడియా విభాగం అండగా నిలవాలని కోరారు.    

ఆవేశానికి లోనుకాకుండా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సుదర్శన్ రెడ్డి

లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చగొట్టే పోస్టులు, వ్యాఖ్యలకు స్పందించే సమయంలో సహనం పాటించాలని సూచించారు. ఆవేశంలో చేసే వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందని, అందువల్ల వాస్తవాలు, ఆధారాలతో పద్ధతిగా ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు సోషల్ మీడియా కార్యకర్తలు పూర్తి మద్దతుగా నిలిచి, గత ప్రభుత్వంలో జరిగిన మంచిని, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆధారాలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సోషల్ మీడియా విభాగం తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశంగా తీసుకుని, నెట్‌వర్క్ విస్తరణ, లోకల్ కంటెంట్, వేగవంతమైన డిస్ట్రిబ్యూషన్, విజువల్ ఎవిడెన్స్, అభ్యర్థులకు డిజిటల్ సపోర్ట్ అనే అంశాలపై వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని సమావేశంలో దిశానిర్దేశం చేశారు.

సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, సోషల్ మీడియా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top