స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్ధులకు తక్షణం సర్టిఫికెట్లు జారీ చేయాలి

సాంకేతిక సమస్యల పేరుతో అంతరాయాలు లేకుండా చూడాలి

జాప్యం వల్ల ఏ దరఖాస్తుదారుడూ పోటీ చేసే అవకాశం కోల్పోకూడదు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కోరిన వైఎస్సార్సీపీ 

 

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు కులం/కమ్యూనిటీ సర్టిఫికెట్లు, నో-డ్యూస్/NOC సర్టిఫికెట్లు పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవడంపై పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు మరోసారి లేఖ రాశారు. గతంలో అక్టోబర్ 1, 5 తేదీల్లో ఈ మేరకు సమర్పించిన రెండు వినతిపత్రాలకు కొనసాగింపుగా ఆయన ఎస్ఈసీకి ఈ లేఖ రాశారు. ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు తక్షణం కావాల్సి సర్టిఫికెట్లు జారీ అయ్యేలా చూడాలని, ఇందులో జాప్యం కారణంగా ఏ దరఖాస్తుదారుడూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా చూడాలని లేళ్ల అప్పిరెడ్డి కోరారు. 

రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు కులం, నో డ్యూస్/ఎన్వోసీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నా, వారికి సకాలంలో అవి అందడం లేదని ఇప్పటికే రెండుసార్లు విజ్ఞాపనలు ఇచ్చామని, అయినా ఇప్పటికీ అవసరమైన సర్టిఫికెట్లు పొందడంలో దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమకు సమాచారం అందుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎస్ఈసీకి రాసిన లేఖలో తెలిపారు. తమ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో తగిన స్పందన కనిపించడం లేదని, తాము గత లేఖల్లో ప్రస్తావించిన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ఆయన గుర్తుచేశారు. 

త్వరలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నందున, ఈ జాప్యాలపై అత్యవసరంగా దృష్టి సారించాలని ఎస్ఈసీని లేళ్ల అప్పిరెడ్డి కోరారు. నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన చోట ఈ సర్టిఫికెట్లను అభ్యర్థులు పొందాల్సి ఉంటుందని, జాప్యం కొనసాగితే, అర్హులైన వ్యక్తులు తమ నామినేషన్లు దాఖలు చేయలేక ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన గుర్తుచేశారు.  అందువల్ల, అర్హులైన దరఖాస్తుదారులకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎలాంటి మరింత జాప్యం లేకుండా ఈ సర్టిఫికెట్లు అందేలా అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఇతర సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని కమిషన్‌ను కోరారు. 

ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను అత్యవసరంగా పరిష్కరించాలని ఆయన ఎస్ఈసీని కోరారు. కొత్తగా వచ్చే దరఖాస్తులను కూడా ఎలాంటి వివక్ష లేకుండా సత్వరమే ప్రాసెస్ చేయాలని విజ్ఞప్తి చేశారు.  సాంకేతిక సమస్యల వల్ల సేవలకు అంతరాయం కలిగితే, సర్టిఫికెట్ల జారీ నిరంతరంగా కొనసాగేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా అధికారులు ఈ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షిస్తూ, పరిపాలనా జాప్యం కారణంగా ఏ ఒక్క అర్హుడైన దరఖాస్తుదారుడూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోకుండా చూడాలని కోరారు. రాబోయే ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కమిషన్ తక్షణమే జోక్యం చేసుకోవాలని , అలాగే తమ వినతిపత్రాలపై తీసుకున్న చర్యలను తెలియజేయాలని ఎస్ఈసీకి రాసిన లేఖలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోరారు. ఈ లేఖకు గతంలో ఎన్నికల కమిషన్ కు రాసిన రెండు లేఖల ప్రతుల్ని ఈ లేఖకు జత చేశారు. అలాగే కేంద్ర ఎన్నికల కమిషన్ కు సైతం ఈ లేఖతో పాటు గత లేఖల ప్రతుల్ని కూడా పంపారు. 

Back to Top