తాడేపల్లి: అధికారంలోకి వస్తే పారదర్శక పరిపాలన ఇస్తామని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు, ప్రభుత్వం ఏర్పాటైన 28 నెలల కాలంలో, అత్యంత గోప్యంగా ఎవరికీ తెలియకుండా ఏకంగా 434 రహస్య జీవోలను విడుదల చేయాల్సిన అవసరం ఏముందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి సూటిగా ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రహస్య జీవోలతో ప్రజాధనాన్ని దోచుకునేందుకు తెరవెనుక కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. పరిపాలనలో పారదర్శకత లేకపోవడానికి ఈ రహస్య జీవోలే నిదర్శనమని కారుమూరి పేర్కొన్నారు. అత్యధికంగా రెవెన్యూ శాఖలో 181, హోమ్ డిపార్ట్‌మెంట్‌లో 83, ఫైనాన్స్‌లో 24, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో 18 రహస్య జీవోలను జారీ చేశారని వివరించారు. 2014-2019 మధ్య గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ 1,729 కాన్ఫిడెన్షియల్ జీవోలు జారీ అయ్యాయని ఆయన ప్రస్తావించారు. సెప్టెంబర్‌లో 15 రహస్య జీవోలు విడుదల కాగా, 2026 అక్టోబర్ 12 నాటికి ఈ నెలలోనే 11 జీవోలు వెలువడినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి రెండు రోజులకు ఒక రహస్య జీవో వెలువడుతుందని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా, కన్సల్టెంట్ల నియామకాలు, ప్రత్యేక కేటాయింపుల పేరుతో సాగుతున్న ఈ చీకటి జీవోల బాగోతంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే వైఎస్ జగన్ గారు సీఎం అయ్యాక వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో వీటిపై సమగ్ర విచారణ జరిపిస్తామని కారుమూరి వెంకటరెడ్డి హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు దాస్తున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 28 నెలల కాలంలో ప్రజలకు తెలియకుండా ఏకంగా 434 రహస్య జీవోలు విడుదల చేశారు. అసలు ఈ జీవోల్లో ఏముంది? ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? ప్రజలకు తెలియాల్సిన ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు దాస్తున్నారు? చంద్రబాబు ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. 2024 జూలై 25న హోం శాఖ నుంచి తొలి రహస్య జీవో విడుదలైంది. 2026 అక్టోబర్ 9 నాటికి మొత్తం 434 రహస్య జీవోలు విడుదలయ్యాయి. ఒక ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తే జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం పెద్ద సంఖ్యలో జీవోలను రహస్యంగా ఉంచుతోంది. 2014 నుంచి 2019 వరకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 1,729 కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇచ్చారు. ఇప్పుడు కేవలం 28 నెలల్లోనే 434 రహస్య జీవోలు ఇచ్చారు. సెప్టెంబర్‌లో 15 జీవోలు, అక్టోబర్ 12వ తేదీ నాటికే ఈ నెలలో 11 రహస్య జీవోలు విడుదలయ్యాయి. దాదాపు ప్రతి రెండు రోజులకు ఒక రహస్య జీవో విడుదలవుతోంది. ఇంత రహస్యంగా ప్రభుత్వం ఏం చేస్తోంది? రెవెన్యూ శాఖలో అత్యధికంగా 181 రహస్య జీవోలు శాఖలవారీగా చూస్తే రెవెన్యూ శాఖలో అత్యధికంగా 181 రహస్య జీవోలు విడుదలయ్యాయి. హోం శాఖలో 83, ఆర్థిక శాఖలో 24, పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 18 రహస్య జీవోలు ఇచ్చారు. అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు సంబంధించిన జీవోలను కూడా రహస్యంగా ఉంచారు. రెవెన్యూ శాఖ అంటే భూములు, ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే శాఖ. అలాంటి శాఖలో 181 జీవోలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? హోం శాఖలో 83 జీవోల్లో ఏముంది? ఆర్థిక శాఖలో 24 జీవోల్లో ఏముంది? పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న శాఖల్లో రహస్యంగా ఉంచాల్సిన అంశాలేమున్నాయి? ప్రభుత్వం వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలి. మేమొచ్చాక రహస్య జీవోల గుట్టు తేలుస్తాం: చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ గతంలో పారదర్శక పాలన అందిస్తామని, ప్రభుత్వ జీవోలన్నింటినీ ఆన్‌లైన్‌లో పెడతామని చెప్పారు. మరి ఇప్పుడు 434 జీవోలను ఎందుకు రహస్యంగా ఉంచారు? పారదర్శకతకు పెద్దపీట వేస్తామని చెప్పిన మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటే సరిపోదు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు తెలిసేలా ఉండాలి. ప్రజలకు జవాబుదారీగా పాలన సాగించాలి. ఏ ప్రాతిపదికన కేటాయించారు? ఈ రహస్య జీవోల ద్వారా ఎవరికైనా అనుచిత ప్రయోజనాలు కల్పించారా? భూముల కేటాయింపుల్లో ఏమైనా అక్రమాలు జరిగాయా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాలి. ప్రతి రహస్య జీవోలో ఏముందో ప్రజలకు తెలియాలి. ఈ ప్రభుత్వం వివరణ ఇవ్వకపోతే భవిష్యత్తులో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రతి జీవో వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీస్తాం. తమ్ముళ్లు పదవుల్లో ఉన్నారనే చిరంజీవి పొగడ్తలు: ఆంధ్రప్రదేశ్‌లో తన కుటుంబ సభ్యులంతా పదవుల్లో ఉన్నారు కాబట్టే ప్రభుత్వం బాగా పనిచేస్తోందని చిరంజీవి చెబుతుండొచ్చు. పైగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి లబ్ధి చేకూర్చడంలో భాగంగానే ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు బాగున్నాయని మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనం. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను ఒక్కసారి పరిశీలిస్తే రాజధాని అమరావతిలో హైకోర్టుకు వెళ్లే దారిలోనే గజానికి ఓ గొయ్యి, అడుగుకో గుంత అన్న పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ఈనాడు పత్రిక కూడా ప్రచురించింది. దీంతోపాటు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు, బియ్యం ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీ ఎన్నికల్లో అవకతవకలపైనా ఈసీ సమాధానం చెప్పాలి: ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్‌ను వైయస్ఆర్‌సీపీ సమర్థిస్తోంది. వైఎస్ జగన్ గారు గతంలోనే ఎన్నికల ప్రక్రియలో అవకతవకలపై ప్రశ్నించారు. వీవీప్యాట్ స్లిప్పుల అంశంపై వైయస్ఆర్‌సీపీ న్యాయపోరాటం చేసింది. 2024 లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియపై మాకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ శాతాల వివరాల ప్రకటనలో జరిగిన జాప్యం, ఫామ్-20ను ఆలస్యంగా అప్‌లోడ్ చేయడం, వీవీప్యాట్ స్లిప్పుల నిర్వహణ వంటి అంశాలపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలి. పోలింగ్ ముగిసే సమయానికి ప్రకటించిన వివరాలకు, ఆ తర్వాత వెల్లడించిన పోలింగ్ శాతాలకు మధ్య ఉన్న వ్యత్యాసాలపై ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయి. అర్ధరాత్రి వేళ సుమారు 48 లక్షల ఓట్లు, 12 శాతం అదనపు పోలింగ్‌కు సంబంధించి చేస్తున్న ఆరోపణలపై ఇంతవరకు సరైన సమాధానం రాలేదు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం కలగాలంటే ఎన్నికల సంఘం అన్ని సందేహాలకు రికార్డుల ఆధారంగా సమాధానం చెప్పాలి. 2024 ఎన్నికల్లో కూటమి ప్రజాభిమానంతో గెలవలేదని, ఎన్నికల ప్రక్రియపై ఉన్న అనుమానాలను చూస్తే ఎవరైనా చెబుతారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలగాలంటే ఎన్నికల సంఘం స్వతంత్రంగా, పారదర్శకంగా పనిచేయాలి. మేము ఎన్‌డీఏ కూటమిలోనూ లేము, ఇండియా కూటమిలోనూ లేము. ఏ కూటమిలో చేరాలనే ఆలోచన కూడా మాకు లేదు. మా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై, ప్రజల ప్రయోజనాలపై మాత్రమే మేము ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం. ఎన్నికల పారదర్శకత విషయంలోనూ మేము ఇదే వైఖరితో ఉన్నామని కారుమూరి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.