నిరుపేదలకు ఇళ్ల‌ స్థలాలు అప్పగించే వరకు పోరాటం

మాజీ ఎంపీ మార్గాని భరత్ 

రాజమహేంద్రవరం: నిరుపేదలకు పంపిణీ చేసిన ఇంటి స్థలాల పట్టాల ప్రకారం లబ్ధిదారులకు స్థలాలు స్వాధీనం చేసే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి మార్గాని భరత్‌ రామ్‌ స్పష్టం చేశారు. పట్టాలు దొంగవని నిరూపిస్తే గోకవరం బస్టాండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి సిద్ధమని, నిరూపించలేకపోతే ఈవీఎం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్‌ విసిరారు. నిరుపేదల హక్కుల కోసం రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.

 25 వేల కుటుంబాలకు న్యాయం చేయాలి

నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా 2024 మార్చి 12న రెవెన్యూ శాఖ ద్వారా జీవో నంబర్‌ 36 విడుదలైందని, రూ.313.25 కోట్లకు పైగా పరిపాలన ఆమోదం లభించిందని మార్గాని భరత్‌ తెలిపారు. రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి, సర్వే నంబర్లు, ప్లాట్‌ నంబర్లతో పట్టాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. అవి నకిలీ పట్టాలైతే ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కానవరం, కాపవరం, పల్లకడియం, బురుగుపూడి ప్రాంతాల్లో సుమారు 25 వేల మంది లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాల ప్రకారం స్థలాలను వెంటనే స్వాధీనం చేయాలని డిమాండ్‌ చేశారు.

 పట్టాలు సరెండర్‌ చేయాలంటూ ఒత్తిడి చేయడం సరికాదు

లబ్ధిదారులను సచివాలయాలకు పిలిపించి టిడ్కో ఇళ్లు ఇస్తామని, గతంలో ఇచ్చిన పట్టాలను సరెండర్‌ చేయాలని సమ్మతి పత్రాలు తీసుకోవడంపై భరత్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లకు బ్యాంకు రుణాలు తీసుకుని నెలవారీ వాయిదాలు చెల్లించాల్సి ఉంటుందని, తాము పంపిణీ చేసిన పట్టాల ద్వారా ప్రతి కుటుంబానికి 50 గజాల స్థలం ఉచితంగా ఇచ్చామని తెలిపారు. సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ నిర్వహించి, అధికారుల సంతకాలతో పట్టాలు అందజేశామని పేర్కొన్నారు. అవి తప్పుగా ఇచ్చినవైతే సంబంధిత అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 స్థలాలు అప్పగించకపోతే లబ్ధిదారులతో కలిసి పోరాటం

నిరుపేద కుటుంబాలకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన ఆస్తి లభించే అవకాశాన్ని అడ్డుకోవడం సరికాదని మార్గాని భరత్‌ అన్నారు. కూటమి ప్రభుత్వం, ఈవీఎం ఎమ్మెల్యే కుట్రలను వైయ‌స్ఆర్‌సీపీ అడ్డుకుంటుందని పేర్కొన్నారు. లబ్ధిదారులకు స్థలాలు అప్పగించకపోతే వారిని స్వయంగా గ్రామాలకు తీసుకెళ్లి స్థలాలు చూపిస్తామని హెచ్చరించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టాల ప్రకారం లబ్ధిదారులకు స్థలాలు స్వాధీనం చేస్తామని భరోసా ఇచ్చారు.

 కమిషనర్‌ను కలిసి వినతి

మహాధర్నా అనంతరం వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ను కలిసి సమస్యను వివరించి, స్థలాల స్వాధీనానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టాలు నకిలీవని జరుగుతున్న ప్రచారాన్ని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు భరత్‌ తెలిపారు. గతంలో పనిచేసిన కలెక్టర్‌, కమిషనర్‌ ధ్రువీకరణతోనే పట్టాలు పంపిణీ చేశారని, అవి దొంగ పట్టాలు కావని కమిషనర్‌ ధ్రువీకరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ రుడా చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు, ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మేడపాటి షర్మిళారెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ మున్సిపల్‌ వింగ్‌ అధ్యక్షుడు మజ్జి అప్పారావు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.

Back to Top