కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు

మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌.బి. అంజాద్‌ బాషా

వైయ‌స్ఆర్ జిల్లా:  క‌డ‌ప నగరంలోని మరియాపురం 40వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్‌ బాలస్వామి రెడ్డి ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌.బి. అంజాద్‌ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్‌ పాకా సురేష్‌, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ ఉమైర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజాద్‌ బాషా మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించడమే వైయ‌స్ఆర్‌సీపీ లక్ష్యమన్నారు. ఎండనక, వాననక శ్రమించిన కార్యకర్తల సేవలను ఎప్పటికీ మరచిపోమని పేర్కొన్నారు. ఐడీ కార్డులు కేవలం గుర్తింపు కార్డులు మాత్రమే కాదని, పార్టీతో కార్యకర్తలకు ఉన్న అనుబంధానికి, వారి సేవలకు గుర్తుగా నిలుస్తాయని తెలిపారు.

పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, వారి కష్టమే పార్టీకి బలమని అంజాద్‌ బాషా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్‌లో ప్రజలతో మమేకమై పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ కోఆప్షన్‌ సభ్యురాలు మరియలు, నగర వైఎస్సార్‌టీయూసీ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు ఆల్ఫోన్స్‌, ప్రదీప్‌, దేవదాస్‌, కేశవరెడ్డి, భరత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top