శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ చైర్‌కు గౌరవం ఏదీ?

రాజ్యాంగబద్ధమైన పదవిని అవమానిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న కూటమి ప్రభుత్వం

తూమాటి మాధవరావు ఫైర్ 

ప్రోటోకాల్‌ ఉల్లంఘనలపై  గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ ను కలిసి ‌ఫిర్యాదు చేసిన శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ తూమాటి మాధవరావు. 

అనంత‌రం విజయవాడ లోనే మీడియాతో మాట్లాడిన మాధవరావు.

డిప్యూటీ చైర్మన్‌ పదవికి తగిన గౌరవం, ప్రోటోకాల్‌ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం

ఎన్నికైన తర్వాత కూడా చాంబర్‌, సిబ్బంది, వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సౌకర్యాలు కల్పించలేదు

రాజ్యాంగబద్ధమైన పదవిని అవమానించేలా కూటమి ప్రభుత్వ వ్యవహారశైలి

టీటీడీ ఆలయాల్లోనూ డిప్యూటీ చైర్మన్‌ హోదాకు తగిన గౌరవం ఇవ్వడం లేదు

అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలవుతోందా? రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందా?

మాధవరావు ఆగ్ర‌హం

ప్రోటోకాల్‌ ఉల్లంఘనలపై గవర్నర్‌కు వివరించా.. సానుకూలంగా స్పందించారు

సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్రపతిని కలిసి రాజ్యాంగ ఉల్లంఘనలను వివరిస్తాం

తేల్చి చెప్పిన తూమాటి మాధ‌వ‌రావు 

విజ‌య‌వాడ‌: రాజ్యాంగబద్ధమైన శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ పదవిని అవమానించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని తూమాటి మాధవరావు ధ్వ‌జ‌మెత్తారు. తనపై వ్యక్తిగతంగా కక్ష సాధించినా, డిప్యూటీ చైర్మన్‌ చైర్‌కు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో గవర్నర్‌ అబ్దుల్ నజీర్ ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన తనకు ప్రోటోకాల్‌ ప్రకారం అందాల్సిన గౌరవం, సౌకర్యాలు కల్పించడం లేదని తెలిపారు. ఇది తన వ్యక్తిగత సమస్య కాదని, రాజ్యాంగబద్ధమైన పదవి గౌరవానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లానని, సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్రపతిని కూడా కలిసి వివరిస్తానని తూమాటి మాధవరావు వెల్లడించారు.
మీడియాతో  మాధ‌వ‌రావు ఏమ‌న్నారంటే..
  
- వ్యక్తిగత కక్షలకు, రాజ్యాంగబద్ధమైన పదవికి మధ్య తేడా గుర్తించాలి: 
“ఆగస్టు 19న ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా మండలి సభ్యులందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే, బాధ్యతలు చేపట్టి చైర్‌లో కూర్చోబెట్టే సమయంలో కూటమి పార్టీల సభ్యులు బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. రాజ్యాంగబద్ధమైన పదవులకు పార్టీలకు అతీతంగా గౌరవం ఇవ్వడం ప్రజాస్వామ్య సంప్రదాయం. తెలుగుదేశం పార్టీకి గానీ, కూటమి ప్రభుత్వానికి గానీ నాపై వ్యక్తిగత కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. కానీ డిప్యూటీ చైర్మన్‌ పదవిని, ఆ చైర్‌ను అవమానించకూడదు. ఆ పదవికి తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

- చాంబర్‌, సిబ్బంది, భద్రత, ప్రోటోకాల్‌ సౌకర్యాలు కల్పించాలి:
 డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత కూడా నాకు చాంబర్‌, వ్యక్తిగత కార్యదర్శి, అదనపు వ్యక్తిగత కార్యదర్శి, ఇతర సిబ్బంది, భద్రత వంటి సౌకర్యాలు కల్పించలేదు. ప్రోటోకాల్‌ ప్రకారం దక్కాల్సిన గౌరవం విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంబంధిత అధికారులు బాధ్యతను ప్రభుత్వంపైకి నెడుతుండగా, ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదని చెబుతున్నారు. టీటీడీ ఆలయాలకు వెళ్లిన సందర్భాల్లోనూ నా హోదాకు తగిన మర్యాద లభించని పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. ఇవి నా వ్యక్తిగత సమస్యలు కావు.. రాజ్యాంగబద్ధమైన పదవికి సంబంధించిన అంశాలు.

- అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలవుతోందా.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందా?: 
ప్రభుత్వ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌కు ప్రాధాన్యం ఇస్తూ, డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న నన్ను ఆహ్వానించకపోవడం ఏమిటి? ప్రోటోకాల్‌ విషయంలో ఒకరికి ఒక విధంగా, మరొకరికి మరో విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం అమలవుతోందా? లేక రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందా? తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలోనూ నేను శాసన మండలిలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించినప్పటి నుంచి నాపై కక్ష సాధింపు జరుగుతోందని భావిస్తున్నాను. లడ్డూ ప్రసాదంపై చేసిన ప్రచారానికి సంబంధించి వచ్చిన నివేదికలపై కూటమి నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలి. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

- గవర్నర్‌కు ఫిర్యాదు.. వారం రోజులు వేచి చూస్తాం: 
ఈ అంశాలన్నింటినీ విజయవాడలో గవర్నర్‌ను కలిసి వివరించాను. ఆయన సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులకు లేఖలు రాసి, వారి సమాధానం కోసం వారం రోజులు వేచి చూడాలని సూచించారు. ఆ గడువులో సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్రపతిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలు, రాజ్యాంగబద్ధమైన పదవులకు ఎదురవుతున్న సమస్యలను వివరిస్తాను. ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా, శాసన వ్యవస్థలోని ప్రతి రాజ్యాంగబద్ధమైన పదవికి తగిన గౌరవం దక్కాలి. డిప్యూటీ చైర్మన్‌ చైర్‌కు ఇవ్వాల్సిన గౌరవం కల్పించాలని కోరుతున్నాను” అని తూమాటి మాధవరావు స్పష్టం చేశారు.

Back to Top