తాడేపల్లి : తప్పుడు జీవోలు ఇచ్చి బీసీలతో పాలాభిషేకాలు చేయించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... చివరకు ఆ జీవోలు కోర్టుల్లో కొట్టేసినప్పుడు బీసీలకు ఎందుకు క్షమాపణలు చెప్పలేదని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ నిలదీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు బలహీన వర్గాలను అత్యంత చులకనగా చూస్తున్నారని, బీసీలకు చేసిన చారిత్రక ద్రోహాన్ని కప్పి పుచ్చుకునేందుకే రాష్ట్రవ్యాప్తంగా బీసీ సభల డ్రామాలు ఆడుతూ వైఎస్సార్‌సీపీపై నిందలు మోపుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో చట్టబద్ధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకు కల్పించిన 34 శాతం రిజర్వేషన్లను అడ్డుకున్న ఘనత కూడా చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. అమరావతి కోసం పోరాడిన చంద్రబాబు... బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పార్లమెంట్‌లో ఎందుకు పోరాడలేదని.., ప్రధాని, కేంద్ర హోంమంత్రిలతో ఎందుకు చర్చించలేదని నిలదీశారు. అసలు బీసీలు కేవలం కుల వృత్తులకే పరిమితం కావాలనేది చంద్రబాబు కుటిల ఆలోచన అని మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... అమరావతి మీద ఉన్న చిత్తశుద్ధి బీసీ రిజర్వేషన్లపై లేదే? : అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేసింది. మరి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అదే స్థాయిలో ఎందుకు ప్రయత్నించడం లేదు? అమరావతి కోసం పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో చట్టం తీసుకురావడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? ఈ అంశంపై కేంద్ర హోంమంత్రితో, ప్రధానమంత్రితో ఎందుకు మాట్లాడటం లేదు? బీసీలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. బీసీల హక్కుల కోసం రాజ్యాంగపరమైన పరిష్కారాలను అన్వేషించాలి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి, ఆ హామీని చట్టబద్ధంగా అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు సమాధానం చెప్పాలి. జీవో ఇచ్చినప్పుడు గొప్పలు చెప్పుకోవడం, పాలాభిషేకాలు చేయించుకోవడం కాదు.. ఆ జీవో ద్వారా బీసీలకు న్యాయం జరిగేలా చూడాలి. బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయినందుకు చంద్రబాబు బీసీలకు క్షమాపణ చెప్పాలి. బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలి: రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించలేకపోతే, మీ పార్టీ తరఫున బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చామని చెప్పుకోండి. కానీ పార్టీ టికెట్లు ఇవ్వడాన్ని చట్టబద్ధమైన రిజర్వేషన్లుగా చూపించకండి. పార్టీ తరఫున సీట్లు కేటాయించడం వేరు, చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించడం వేరు. బీసీలకు నిజంగా న్యాయం చేయాలంటే చట్టబద్ధమైన రిజర్వేషన్ల కోసం కృషి చేయాలి. అసలు బీసీ రిజర్వేషన్లు తగ్గడానికి చంద్రబాబే కారణం. బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో నమ్మబలికి, ఆ హామీని సాధించడంలో విఫలమయ్యారు. ఇప్పుడు ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా బీసీ సభలు నిర్వహిస్తూ వైఎస్సార్‌సీపీపై నిందలు వేస్తున్నారు. బీసీలకు చేసిన అన్యాయంపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వైఎస్సార్‌సీపీపై నిందలు వేయడం సరికాదు. చంద్రబాబుకు సన్మానాలు చేసే బీసీ నాయకులు ఆయన బీసీల పట్ల అనుసరిస్తున్న విధానాలను కూడా గమనించాలి. 2014–19 మధ్య ఒక బీసీ నాయకుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు అదే పదవిని బీసీకి ఎందుకు ఇవ్వలేదు? బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యత కల్పించడంలో తన వైఖరి ఏమిటో చంద్రబాబు స్పష్టం చేయాలి. బలహీన వర్గాలను చులకనగా చూస్తున్నారనే విమర్శలకు సమాధానం చెప్పాలి. బీసీలకు ఇచ్చిన ఈ హామీలపై స్పష్టత ఇవ్వండి: ఎన్నికల సమయంలో బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదు? బీసీలు తమ కులవృత్తులకే పరిమితం కావాలన్నట్టుగా ఆదరణ పథకం తీసుకొస్తామని చెబుతారు. బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారు. కానీ ఆ నిధులను ఖర్చు చేయరు. గడిచిన మూడు బడ్జెట్లలో ఆదరణ పథకానికి కేటాయించిన నిధులు ఎంత? వాటిలో ఎంత ఖర్చు చేశారు అనే వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు పెట్టాలి. బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందిస్తామని చెబుతున్నారు. రుణాల కోసం మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే కనీసం ముగ్గురికైనా అందించలేదు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1,500 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒక్కరికైనా ఇచ్చారా? మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ హామీని ఎప్పుడు అమలు చేస్తుందో చెప్పాలి. కుట్టు మిషన్ల కోసం లక్ష మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. శిక్షణ కూడా పొందిన మహిళలకు ఇప్పటివరకు కుట్టు మిషన్లు ఇవ్వలేదు. పేద, బీసీ కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతో ముఖ్యం. కానీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ.9 వేల కోట్లకు పేరుకుపోయాయి. జగన్ గారిని తిట్టడానికే బీసీలకు మంత్రి పదవులా? : బీసీ మంత్రులు తమ పదవులను జగన్ గారిని తిట్టడానికి, వైఎస్సార్‌సీపీని విమర్శించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. జగన్ గారిని విమర్శించడానికే చంద్రబాబు బీసీ నాయకులకు పదవులు ఇచ్చారా? బీసీలకు న్యాయం చేయాల్సిన మంత్రులు తమ ప్రభుత్వ వైఫల్యాలపై ఎందుకు మాట్లాడటం లేదు? బీసీల సమస్యలను పరిష్కరించకుండా, వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. చంద్రబాబు బీసీలను బీసీలతోనే తిట్టించే రాజకీయాలు మానుకోవాలి. బీసీలకు న్యాయం చేయాలంటే వారి సమస్యలపై మాట్లాడాలి, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు అనేక పదవుల్లో అవకాశాలు కల్పించాం. బీసీల రాజకీయ సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చాం. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టింది కూడా వైఎస్సార్‌సీపీయే. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలంటే చట్టబద్ధమైన చర్యలు అవసరం. బీసీల హక్కులు, సంక్షేమం, రాజకీయ సాధికారత కోసం వైఎస్సార్‌సీపీ తరఫున తమ పోరాటాన్ని కొనసాగిస్తామని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్పష్టం చేశారు.