బీసీ జనగణన  చేపట్టడం అత్యవసరం

ప్రత్యేక బీసీ కమిషన్ నియమించి చర్యలు తీసుకోవాలి

వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ మార్గాని భరత్

ఖచ్చితమైన బీసీ జానాభా గణంకాలతో  సమగ్రవిధానం రూపొందించాలి

అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్టసవరణ చేయించాలి జరపించాలి

తేల్చి చెప్పిన మాజీ ఎంపీ మార్గాని భరత్

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబువి కపట నాటకాలు

ఓ వైపు రాజకీయ ప్రకటనలు, మరోవైపు మోసపూరిత చర్యలు

మార్గాని భరత్ ఆక్షేపణ

బీసీలకు 60 శాతానికి పైగా పదవులు ఇచ్చిన చరిత్ర వైయ‌స్ఆర్‌సీపీదే

మభ్యపెట్టే ప్రకటనలు బాబు మానుకోవాలి

వెనుకబడిన వర్గాలకు రాజకీయ, సామాజిక న్యాయం జరిగేే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం

ప్రెస్ మీట్ లో మార్గాని భరత్ స్పష్టీకరణ

తాడేపల్లి: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు శాశ్వతంగా న్యాయం చేయాలంటే ప్రభుత్వం తక్షణమే  బీసీ జనగణన చేపట్టడం అత్యవసరమని వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎంపీ  మార్గాని భరత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీల జనాభా ఎంత ఉందో శాస్త్రీయంగా లెక్కించాలని, అందుకు ప్రత్యేక బీసీ కమిషన్‌ ద్వారా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 
తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,  బీసీ జనాభాకు సంబంధించిన ఖచ్చితమైన గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లపై సమగ్ర విధానం రూపొందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, బీసీలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం జరిగేలా పార్లమెంటులో రాజ్యాంగ సవరణకు కృషి చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. బీసీల అభ్యున్నతికి అవసరమైన చర్యలను అమలు చేయకుండా, వైఎస్సార్‌సీపీపై నిందలు వేయడం ద్వారా ప్రజలను మభ్య పెట్టలేరని స్పష్టం చేశారు. నేటి యువతకు రాజకీయ పరిణామాలపై అవగాహన ఉందని, ఎవరు బీసీలకు అవకాశాలు కల్పించారు, ఎవరు అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు బీసీ రిజర్వేషన్ల అంశంపై తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 
ప్రెస్ మీట్ లో ఆయన ఇంకా ఏం మాట్లాడరంటే..

బిర్రు ప్రతాప్‌రెడ్డికి టీడీపీతో సంబంధాలు లేవని చెప్పగలరా?: 
బీసీ రిజర్వేషన్లపై న్యాయస్థానాల్లో పిటీషన్ దాఖలు చేసిన బిర్రు ప్రతాప్‌రెడ్డికి వెన్నుపోటు పార్టీతో సంబంధాలు లేవని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు స్పష్టంగా ప్రకటించగలరా..?  2014–2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో బిర్రు ప్రతాప్‌రెడ్డికి విద్యుత్‌ రంగానికి సంబంధించిన బోర్డు లేదా కమిషన్‌లో పదవి కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు జీఓ నిజం కాదా..? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లతో బిర్రు ప్రతాప్‌రెడ్డి ఉన్న ఫొటోలు,  వారి మధ్య సంబంధాలపై టీడీపీ నేతలు వివరణ ఇవ్వాలి.  కేవలం ఫొటోల ఆధారంగా ఆరోపణలు చేయడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులను కూడా చూపుతూ సమాధానం కోరుతున్నా.. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కేసు విషయంలో బిర్రు ప్రతాప్‌రెడ్డి తీసుకున్న న్యాయపరమైన చర్యలకు, వెన్నుపోటు పార్టీ  నాయకత్వానికి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయనే తమ అనుమానాలపై టీడీపీ స్పష్టత ఇవ్వాలి.  ఈ అంశంపై మా ఆరోపణలను టీడీపీ ఖండిస్తుందా, లేక సమాధానం చెబుతుందా ..?  బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం వెన్నుపోటు పార్టీకి  ఉంటే, న్యాయపరమైన అడ్డంకులను అధిగమించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై విమర్శలు చేయడం కాకుండా, ఇప్పుడు వాటిని ఎలా అమలు చేస్తారో చెప్పాలి.

బీసీలకు పదవులు ఇచ్చిన చరిత్ర వైఎస్సార్‌సీపీదే: 
బీసీలకు రిజర్వేషన్ల విషయంలో టీడీపీ మాటలకు, చేతలకు పొంతన లేదు.  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్  బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో చారిత్రాత్మక చర్యలు తీసుకున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవుల్లో ఆరు పదవులను బీసీలకు కేటాయించారు. ఇది సుమారు 46 శాతం  పదవులు వెనుకబడిన వర్గాలకు దక్కాయి.   అప్పటి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుచుకున్న మండల పరిషత్‌ అధ్యక్ష పదవుల్లో సుమారు 67 శాతం బీసీలకు అవకాశాలు కల్పించారు.    రాష్ట్రంలోని 14 కార్పొరేషన్లలో తొమ్మిది మేయర్‌ పదవులను బీసీలకు కేటాయించగా,  సుమారు 64 శాతం రిజర్వేషన్లు దక్కేలా జగన్ నిర్ణయాలు తీసుకున్నారు.  రాష్ట్రస్థాయిలో వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 53 పదవులను బీసీలకు ఇచ్చారు.  బీసీ వర్గాల అభ్యున్నతి కోసం 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు  చేసారు.  మార్కెట్‌ కమిటీల్లోనూ బీసీలకు అత్యధిక  ప్రాతినిధ్యం కల్పించారు.  బీసీలకు మేలు చేస్తామని ప్రకటనలు చేయడానికి చంద్రబాబు పరిమితం కాగా, వాస్తవంగా పదవులు కేటాయించి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం బీసీల పట్ల జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్ల అంశంతో పాటు వివిధ పదవుల్లో విస్తృత అవకాశాలు కల్పించింది.
 
మభ్యే పెట్టే ప్రకటనలు మానుకోవాలి: 
టీడీపీ నాయకులు బీసీలకు 34 శాతం మాత్రమే కాకుండా, అవసరమైతే 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్నారు. అయితే, ఆ హామీలను ఏ విధంగా అమలు చేస్తారో స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి.  ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, మేయర్లు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు వంటి పదవుల్లో బీసీలకు ఎంత శాతం అవకాశాలు కల్పిస్తారో ప్రకటించాలి.  బీసీలకు అవకాశాలు కల్పించే విషయంలో వైఎస్సార్‌సీపీతో పోటీ పడేందుకు టీడీపీ సిద్ధంగా ఉందా..?   బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే అంశంలో మాటలకే పరిమితం కాకుండా, ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి పదవుల కేటాయింపు వరకు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
 
బీసీలకు రాజకీయ, సామాజిక న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాటం: 
బీసీలకు న్యాయం చేసే విషయంలో ఎవరి చిత్తశుద్ధి ఎంత ఉందో ప్రజలు గమనిస్తున్నారు.  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో, ప్రభుత్వ కార్పొరేషన్లలో, వివిధ రాజకీయ పదవుల్లో అవకాశాలు కల్పించింది. 
బీసీలకు న్యాయం చేయాలంటే కేవలం ప్రకటనలు సరిపోవని, రిజర్వేషన్ల అమలుకు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, విద్య, ఉపాధి రంగాల్లో సముచిత అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేయాలి.  బీసీలకు అన్యాయం జరిగిందనే అంశంపై టీడీపీ నాయకత్వం సమాధానం  చెప్పాలి. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని మార్గాని భరత్ స్పష్టం చేశారు.

Back to Top