చంద్రబాబు అండతోనే అధికారుల బరితెగింపు

భూమన కరుణాకర్‌రెడ్డి ఫైర్‌

తాజాగా ‘కుడా’ పీడీ వ్యవహారమే ఒక ఉదాహరణ

భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడి

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి. 

తాగి తందనాలాడుతూ పోలీసులపైనే దాడులా!

బెంగళూరులో ఐఏఎస్‌ వికాస్‌ మర్మత్‌ అనైతిక ప్రవర్తన

ఆయన్ను కాపాడేందుకు చంద్రబాబు ప్రయత్నం

ప్రెస్‌మీట్‌లో భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజం

తాడేపల్లి: చంద్రబాబునాయుడి అండదండలు ఉన్నాయన్న ధీమాతోనే రాష్ట్రంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో పాటు కేంద్ర సర్వీసుల అధికారులు సైతం అవినీతి, అరాచకాలకు పాల్పడుతూ పక్క రాష్ట్రాల్లో కూడా బరి తెగిస్తున్నారని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న ‘కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ’ (కుడా) ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ (పీడీ)గా పని చేస్తున్న ఐఏఎస్‌ అధికారి వికాస్‌ మర్మత్‌ బెంగళూరులోని పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, విచారణకు వచ్చిన పోలీసులు, కస్టమర్లపై దాడికి దిగడమే ఈ ప్రభుత్వ అరాచక పాలనకు ప్రత్యక్ష నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తన దోపిడీ కోసం అధికారులను, కార్యకర్తలను విచ్చలవిడిగా వదిలేసిన చంద్రబాబు.. చివరకు అలాంటి సంఘవిద్రోహ ప్రవర్తన కలిగిన అధికారులను కాపాడేందుకు స్వయంగా రంగంలోకి దిగడం దుర్మార్గమని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ప్రెస్‌మీట్‌లో భూమన కరుణాకర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

చంద్రబాబు పాలనలోనే ఇలాంటి ఘోరాలు:
    రాష్ట్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలనే కాకుండా ఐఏఎస్‌ లాంటి ఉన్నత స్థాయి అధికారులను కూడా రౌడీల్లా తయారు చేసిన ఘనత ముమ్మాటికీ చంద్రబాబునాయుడిదే. ఆదర్శప్రాయంగా నిలవాల్సిన కేంద్ర సర్వీసు అధికారులు ఇంత బజారు స్థాయికి దిగజారి గూండాల కంటే హీనంగా ప్రవర్తించడం చంద్రబాబు పాలనలోనే చూస్తున్నాం. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో పనిచేసే ఒక అధికారి పక్క రాష్ట్రానికి వెళ్లి పబ్‌లో దాడికి దిగడం ఈ ప్రభుత్వ విచ్చలవిడితనానికి అద్దం పడుతోంది.
    బెంగళూరులోని కావొర్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పబ్‌లో మద్యం సేవించి తందనాలాడుతూ, విచారణకు వచ్చిన పోలీసులపై ఐఏఎస్‌ అధికారి వికాస్‌ మర్మత్‌ అత్యంత దురుసుగా ప్రవర్తించడమే కాకుండా చేయి చేసుకోవడం, అసభ్య పదజాలంతో దూషించడం సిగ్గుచేటు. పబ్‌లోని కస్టమర్లపై కూడా దాడికి పాల్పడ్డారు. మన వెనుక చక్రం తిప్పుతున్న చంద్రబాబు ఉన్నాడు, నన్నెవరూ ఏమీ చేయలేరన్న ధైర్యం తప్ప ఇంతగా తెగించడానికి మరొకటి కారణం కాదు. చంద్రబాబు ఇస్తున్న అలుసు వల్లే ఈ అరాచకాలు జరుగుతున్నాయి.

కుప్పంలో దోపిడీ.. లోకేష్‌కు వాటాలు:
    ఈ వికాస్‌ మర్మత్‌ పెద్ద అవినీతిపరుడు అన్న సంగతి కుప్పంలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. డబ్బులు ఇవ్వకుండా అక్కడ ఏ పనీ జరగదు. కుప్పంలో జరిగే అభివృద్ధి పనులను ఏకపక్షంగా టీడీపీ నేతలకు కట్టబెట్టి అడ్డగోలుగా పర్సంటేజీలు వసూలు చేస్తున్నారు. ఆ కమిషన్లలో సగం పైకి, సగం ఈ అధికారికి వెళ్తోంది. ఆ అవినీతి సొమ్ములో భాగాన్ని లోకేష్‌కి కూడా ముట్టజెబుతున్నాన్న ప్రచారం బహిరంగ రహస్యమే.

సీఎంఓ అండదండలు..అవినీతి నెట్‌వర్క్‌:
    ఈ అధికారికి సీఎంఓలో చక్రం తిప్పుతున్న మరో అధికారి ప్రద్యుమ్న పూర్తి అండదండలు ఉన్నాయి. వీరిద్దరికీ అవినీతిలో భాగస్వామ్యం ఉండటం వల్లే రాజకీయ నాయకులపై సైతం లెక్కలేనితనం, దురుసుతనం ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలను గానీ, కార్యకర్తలను గానీ కంట్రోల్‌ చేయలేకపోగా, అధికారులను కూడా అవినీతి ఊబిలోకి దింపి గూండాలుగా మారుస్తున్నారు.

అధికారిని కాపాడేందుకు సీఎంఓ తీవ్ర ఒత్తిళ్లు:
    పబ్‌లో అంతటి వికృత చేష్టలకు పాల్పడిన అధికారిని రక్షించేందుకు సాక్షాత్తు ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగి బెంగళూరు పోలీసులపై ఒత్తిడి తెచ్చినా, ఆ అధికారి విశృంఖలత్వాన్ని చూసి అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి సంఘవిద్రోహ ప్రవర్తన కలిగిన వ్యక్తులకు చంద్రబాబు కీలక పోస్టింగులు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు కాబట్టే ప్రజల సొమ్ముతో వీకెండ్లలో పబ్‌లకు వెళ్లి ఎంజాయ్‌ చేయడం వీరికి అలవాటుగా మారిందని భూమన కరుణాకర్‌రెడ్డి ఆక్షేపించారు.

Back to Top