తాడిపత్రిలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు సర్టిఫికెట్ల జారీలో జాప్యం

స్థానిక ఎన్నికల వేళ రెవెన్యూ అధికారుల తీరుపై ఆందోళన

అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ తాడిపత్రిలో రెవెన్యూ అధికారుల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కుల, పన్ను, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ వాటిని మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు అవసరమైన పత్రాలు అందకపోవడంతో ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, తాడిపత్రి తహశీల్దార్‌తో పాటు సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వైయ‌స్ఆర్‌సీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డంకులు సృష్టించేందుకు టీడీపీ కుట్రలకు పాల్పడుతోందని, అందుకు అధికారులు సహకరిస్తున్నారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సకాలంలో జారీ చేసి, నామినేషన్ల ప్రక్రియకు ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

Back to Top