తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇసుక, మద్యం, గ్రావెల్, రేషన్ బియ్యం మాఫియాల రూపంలో సాగుతున్న దోపిడీ ఇప్పుడు చివరికి మున్సిపాలిటీల్లోని చెత్త వరకు చేరిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.1,200 కోట్లకు పైగా విలువైన భారీ కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో క్లియర్ చేసిన చెత్తను కూడా మళ్లీ రికార్డుల్లో చూపిస్తూ, కేవలం ఐదు నెలల వ్యవధిలోనే లెగసీ చెత్త పరిమాణాన్ని అమాంతం రెట్టింపు చేసి తప్పుడు లెక్కలతో వందల కోట్ల దొంగ బిల్లులు కాజేస్తున్నారని ఆధారాలతో సహా బయటపెట్టారు. చెత్తకుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్ధలకు ఫిర్యాదు చేస్తామని.. దీనిపై కచ్చితంగా స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... చెత్తనూ వదలకుండా రూ.1,200 కోట్ల దోపిడీ స్కెచ్! రాష్ట్రంలో చంద్రబాబు పాలనను గమనిస్తే ఒక్కటే లక్ష్యం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా దోపిడీ, దోపిడీ, దోపిడీయే. అమరావతి భూములు, పీపీపీ పేరుతో ప్రభుత్వ ఆస్తుల ధారాదత్తం, ఇసుక, గ్రావెల్, మద్యం, రేషన్ బియ్యం మాఫియాల తర్వాత ఇప్పుడు చివరికి మున్సిపాలిటీల్లోని చెత్తను కూడా వదలకుండా దోచుకుంటున్నారు. చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో లెగసీ వేస్ట్ పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారు. ఒక్క టన్ను చెత్తను ప్రాసెస్ చేయడానికి ఏకంగా రూ.800 చొప్పున క్లెయిమ్ చేస్తూ, కోటి 63 లక్షల టన్నుల వరకు లెక్కలు పెంచి దాదాపు రూ.1,200 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. 5 నెలల్లోనే చెత్త రెట్టింపు ఎలా అయింది?.. 2024 మార్చి, సెప్టెంబర్ నెలల్లో మంత్రి నారాయణ స్వయంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 85 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందని చెప్పారు. అక్టోబర్ 2, 2025 నాటికి మొత్తం క్లియర్ చేస్తామన్నారు. కానీ 2026 ఫిబ్రవరి నాటికి వచ్చేసరికి కేవలం ఐదు నెలల వ్యవధిలోనే ఆ లెక్కను అమాంతం కోటి 53 లక్షల టన్నులకు, ఆ తర్వాత కోటి 62 లక్షల టన్నులకు ఎలా పెంచారు? ఐదు నెలల్లో చెత్త పరిమాణం దాదాపు రెట్టింపు ఎలా అవుతుందో ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి, మంత్రి చెప్పే లెక్కలకు కనీస పొంతన లేదు. ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లలోనే పచ్చి అబద్ధాలు!.. రాజ్యంగబద్దమైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సంతకాలతో సమర్పించిన ఐదు అఫిడవిట్లలో పరస్పర విరుద్ధమైన లెక్కలు, పచ్చి అబద్ధాలు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో ఇప్పటికే 100 శాతం తొలగించామని చెప్పిన చెత్తను, మళ్లీ కొత్తగా రికార్డుల్లో చూపిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు: కడప: మొదటి అఫిడవిట్‌లో 1.08 లక్షల టన్నుల చెత్త ఉందని, 100% తొలగించామని, 20 ఎకరాల డంపింగ్ యార్డ్ ల్యాండ్‌ను రీక్లెయిమ్ చేశామని చెప్పారు. ఐదు నెలల తర్వాత అదే చెత్తను 8.41 లక్షల టన్నులకు పెంచారు. రోజుకు 156 టన్నుల తాజా చెత్త మాత్రమే వచ్చే కడపలో 800 శాతం చెత్త ఎలా పెరిగింది? అనంతపురం: 3.32 లక్షల టన్నుల చెత్త 100% క్లియర్ అయిపోయిందని, 12 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పి, మళ్లీ 7.10 లక్షల టన్నుల చెత్త ఉందని లెక్కలు చూపించారు. తిరుపతి: 2.04 లక్షల టన్నులు పూర్తిగా తొలగించామని చెప్పి, తర్వాతి అఫిడవిట్లలో దాన్ని 7.42 లక్షల టన్నులకు పెంచారు. కుప్పం: ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే కుప్పంలో 2,555 టన్నులు క్లియర్ చేశామని అఫిడవిట్ ఇచ్చి, ఐదు నెలల్లో దాన్ని ఏకంగా 35 వేల టన్నులకు పెంచారు. కుప్పాన్ని కూడా దోపిడీకి వదలలేదు. తాడేపల్లిగూడెం, ప్రొద్దుటూరు: తాడేపల్లిగూడెంలో 14 వేల టన్నులు క్లియర్ అయ్యాక మళ్లీ 1.32 లక్షల టన్నులు చూపించారు. ప్రొద్దుటూరులో 57 వేల టన్నులను 4.04 లక్షల టన్నులకు పెంచారు. రాజమహేంద్రవరం: 5.11 లక్షల టన్నుల చెత్త క్లియర్ చేశామని ఒక అఫిడవిట్‌లో బిల్లులు పెట్టి.. మరో అఫిడవిట్‌లో అసలు ఉన్న చెత్తే 2.78 లక్షల టన్నులని రాశారు. ఉన్నదానికంటే డబుల్ క్లియర్ చేశామని బిల్లులు ఎలా పెడతారు? విశాఖపట్నం : విశాఖలో వేస్ట్ టు ఎనర్జీ (WTE) ప్లాంట్ ఉంది, తాజా చెత్త నిల్వ ఉండదు. గతంలో 9.60 లక్షల టన్నులు క్లియర్ అయిపోయిందని చెప్పి, ఇప్పుడు 17.84 లక్షల టన్నుల చెత్త ఉందని చూపించారు. జైపూర్ డార్క్ రూమ్ ఆపరేషన్స్.. అనుమతులు లేని టెండర్లు! ఎటువంటి పరిపాలనా అనుమతులు (అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్) లేకుండానే వందల కోట్ల విలువైన చెత్త టెండర్లను తమ బినామీలకు కట్టబెట్టారు. 2025 మార్చిలో రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక ప్రైవేట్ భవనంలో 'డార్క్ రూమ్ ఆపరేషన్స్' నడిపి, రహస్య సమావేశాల్లో కాంట్రాక్టులు ఖరారు చేసుకున్నారు. స్థానికంగా టెండర్లలో పాల్గొనడానికి వచ్చిన ఇతర కాంట్రాక్టర్లను 'విజిలెన్స్ విచారణలు చేయిస్తాం, బిల్లులు రావు' అని బెదిరించి పక్కకు తప్పించారు. అక్టోబర్ 2, 2025 నాటికి పని పూర్తి చేయకపోతే టెండర్ నిబంధనల ప్రకారం 20% బిల్లుల్లో కోత విధించాల్సింది పోయి, బినామీలకు దోచిపెడుతున్నారు. ప్రాసెసింగ్ చేయకుండా నిప్పంటించి ప్రజారోగ్యంతో చెలగాటం! టన్నుకు రూ.800 చొప్పున బిల్లులు క్లెయిమ్ చేస్తున్న కూటమి నేతలు.. వాస్తవానికి డంపింగ్ యార్డుల్లో చెత్తను ప్రాసెస్ చేయకుండా నేరుగా నిప్పంటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా మున్సిపాలిటీల డంపింగ్ యార్డుల్లో ప్లాస్టిక్, లీషెట్ వ్యర్థాలను తగలబెడుతున్న దృశ్యాలు లాంగిట్యూడ్, లాటిట్యూడ్ వివరాలతో సహా మా వద్ద ఉన్నాయి. చెత్తను తగలబెట్టడం వల్ల డయాక్సిన్లు, ఫ్యూరాన్లు, బెంజీన్, పీఎం 2.5 వంటి ప్రమాదకర వాయువులు వెలువడి సమీప ప్రజలు క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రజారోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో 70 లక్షల టన్నుల చెత్త గుట్టలుగా పేరుకుపోయి దర్శనమిస్తోంది. పారిశుద్ధ్య విప్లవం తెచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమే! రాష్ట్ర చరిత్రలో దశాబ్దాలుగా పేరుకుపోయిన లెగసీ వేస్ట్ సమస్యను గుర్తించి, 2021లోనే 'క్లాప్' (CLAP - Clean Andhra Pradesh) ప్రోగ్రామ్ ద్వారా పారిశుద్ధ్య విప్లవానికి నాంది పలికింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే 41 లక్షల టన్నులకు పైగా లెగసీ చెత్తను తొలగించినట్లు కూటమి ప్రభుత్వం ఇచ్చిన తొలి అఫిడవిట్ సాక్షిగానే స్పష్టమైంది. 12 కోట్ల ఉచిత డస్ట్ బిన్లు, జీపీఎస్ ట్రాకింగ్‌తో కూడిన 4,097 గార్బేజ్ ఆటోలు, వేలాది టిప్పర్లు ఇచ్చి డోర్ టు డోర్ కలెక్షన్ విధానాన్ని తీసుకొచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. గతంలో చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు, నారాయణ 5 ఏళ్లు మంత్రిగా ఉన్నప్పుడు ఈ చెత్త కుప్పలు గుర్తుకురాలేదా? వైఎస్సార్‌సీపీ చేసిన పనులను సిగ్గులేకుండా తమ ఖాతాలో వేసుకుంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. కమిషన్ల కోసమే ప్రాసెసింగ్ యూనిట్లు, డబ్ల్యూటీఈ ప్లాంట్లు! రాష్ట్రంలో రోజుకు ఉత్పత్తయ్యే మొత్తం తాజా చెత్త 6,890 టన్నులు. అందులో ఇప్పటికే విశాఖ, గుంటూరు డబ్ల్యూటీఈ ప్లాంట్లలో 2,800 టన్నులు ప్రాసెస్ అవుతోంది. మిగిలిన 4,000 టన్నుల తాజా చెత్త కోసం రూ.600 కోట్లతో 107 ప్రాసెసింగ్ యూనిట్లు ఎవరి కమిషన్ల కోసం పెడుతున్నారు? మళ్లీ సమాంతరంగా వేల కోట్ల వ్యయంతో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు తెచ్చి, 30 శాతం వయబిలిటీ గ్యాప్ ఫండ్ మింగేయాలని చూస్తున్నారు. ఉండేదే 4 వేల టన్నుల చెత్త అయితే.. ప్రాసెసింగ్ యూనిట్లకు ఎక్కడి నుంచి తెస్తారు, ప్లాంట్లకు ఎక్కడి నుంచి తెస్తారు? ఎన్జీటీకి, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఆధారాలతో సహా ఫిర్యాదు! ప్రధానంగా స్వయంగా చీఫ్ సెక్రటరీ సంతకాలతో కూడిన అఫిడవిట్ల ద్వారా రాజ్యాంగబద్ధమైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)ను సైతం కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపించారు. ప్రభుత్వం అధికారుల ద్వారా సమర్పించిన తప్పుడు లెక్కలు, ఫోటోలు, వీడియోలు, జియో కోఆర్డినేట్స్ అన్ని ఆధారాలనూ తీసుకుని ఎన్జీటీతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ఈ రూ.1,200 కోట్ల చెత్త కుంభకోణంపై తక్షణమే స్వతంత్ర దర్యాప్తు జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.