అనంతపురం: చంద్రబాబుకి నిజంగా రాయలసీమ పౌరుషం ఉంటే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మోసం చేసినందుకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలక్షన్ల సమయంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు కేవలం 25.18 శాతమే ఇచ్చి వెన్నుపోటు పొడిచారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పది రోజుల వ్యవధిలో హైకోర్టు, సుప్రీంకోర్టులో కూటమి ప్రభుత్వానికి ఎదురైన పరాభవాలు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నాయని ఎద్దేవా చేశారు. గతంలో నీలం సంజీవ రెడ్డి, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రుల నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుపడితే నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సైతం న్యాయస్థానాల్లో నిలబడలేని నిర్ణయాలతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోందని, కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతాయని ముందే తెలిసినా, రాజకీయ లబ్ది కోసం అదే అబద్ధాలను మళ్ళీ మళ్ళీ ప్రచారం చేస్స్తున్నాదని మండిపడ్డారు. బీసీలకు నిజంగా న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే, వారి రాజకీయ వెనుకబాటుతనాన్ని నిరూపించే శాస్త్రీయమైన ఇంపిరికల్ డేటాను సేకరించి, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాదిరిగా కేంద్రంతో పోరాడి 9వ షెడ్యూల్‌లో చేర్చడం చేతకాని అసమర్థ ప్రభుత్వమని ఇదని తలారి రంగయ్య దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... పది రోజుల్లో హైకోర్టు, సుప్రీంలో ప్రభుత్వానికి మొట్టికాయలు: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో బీసీలకు 34 శాతం రాజకీయ రిజర్వేషన్లు, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. కానీ, బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదు. న్యాయస్థానాల్లో నిలబడలేని నిర్ణయాలతో బీసీల ఆశలను దెబ్బతీస్తూ, పది రోజుల వ్యవధిలో హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలినా ప్రభుత్వం తన వైఖరిని సమీక్షించుకోవడం లేదు. బీసీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుని, ఎన్నికల తర్వాత వారి హక్కులను విస్మరించడం తగదు. కేవలం ప్రకటనలు, ప్రచారాలు కాకుండా, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను పూర్తిచేసి చట్టపరంగా నిలబడే పరిష్కారం చూపించాలి. బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉంటే తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలి. జయలలిత మాదిరిగా పోరాడి సాధించలేవా? : గతంలో నీలం సంజీవరెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి వంటి ముఖ్యమంత్రులు తమ నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించినప్పుడు నైతిక బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. ఆయనకు నిజంగా రాయలసీమ పౌరుషం ఉంటే, వారి బాటలో నడిచి రాజీనామా చేయాలి. లేదంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మాదిరిగా కేంద్రంతో పోరాడి, బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు, తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్పించే దిశగా కృషి చేయాలి. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు, తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించి 34 శాతం రిజర్వేషన్లు సాధించాలి. ఇకనైనా బీసీలను పదే పదే మభ్యపెట్టే రాజకీయ జిమ్మిక్కులకు స్వస్తి పలికి, తన నిబద్ధతను నిరూపించుకోవాలి. శాస్త్రీయమైన ఇంపిరికల్ డేటాను సేకరించాలి: బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్‌ను పూర్తిస్థాయిలో అనుసరించాలి. మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వికాస్ కిషన్‌రావు గావ్లీ కేసులో నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం, స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ వెనుకబాటుతనాన్ని తగిన ఆధారాలతో నిరూపించాలి. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటా సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు ఉపయోగపడవచ్చు.. కానీ, రాజకీయ ప్రాతినిధ్యంలో వెనుకబాటుతనాన్ని నిరూపించే ప్రత్యేక అధ్యయనానికి ప్రత్యామ్నాయం కాదు. రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ ద్వారా వార్డు, పంచాయతీ, మున్సిపాలిటీ స్థాయిలో బీసీల ప్రాతినిధ్య లోటును గుర్తించి, శాస్త్రీయమైన ఇంపిరికల్ డేటాను సేకరించాలి. ట్రిపుల్ టెస్ట్‌కు అనుగుణంగా న్యాయస్థానాల్లో నిలబడే ఆధారాలను సమర్పించి, చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలి. కమిషన్ ఏర్పాటు లేదా సర్వే నిర్వహణ మాత్రమే విజయంకాదని, బీసీలకు హక్కులు సాధించడమే అసలైన లక్ష్యమని గుర్తించాలి. పాలాభిషేకాలతో ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు: బీసీ రిజర్వేషన్ల పేరుతో బ్యానర్లు, ఫ్లెక్సీలు, పాలాభిషేకాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలకు స్వస్తి పలకాలి. డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యులు, మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు కల్పించిన ప్రాతినిధ్యంపై ప్రభుత్వం లెక్కలు వెల్లడించాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు కల్పించిన రాజకీయ అవకాశాలతో పోల్చి చూసుకోవాలని సవాల్ చేస్తున్నాం. బీసీ డిక్లరేషన్‌లో 50 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.4వేల పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీతో పాటు, మేనిఫెస్టోలోని ఇతర హామీలను అమలు చేయాలి. రాబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు తమ హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమంపై స్పష్టమైన వైఖరితో ముందుకు రావాలి. చంద్రబాబు బీసీలకు నిజంగా మేలు చేస్తే వైఎస్సార్సీపీ సంతోషంగా స్వాగతిస్తుంది; కానీ వారి హక్కులకు నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోదు. బీసీలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని తలారి రంగయ్య స్పష్టం చేశారు.