ఓటమి భయంతోనే వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడులు

ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం 

 నామినేషన్ల అడ్డగింతలపై వైయ‌స్ఆర్‌సీపీ ప్రచార విభాగం జోన్‌-3 అధ్యక్షురాలు మైళా రత్నకుమారి వీడియో విడుదల 

కృష్ణా జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డంకులు సృష్టించడం, భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని వైయ‌స్ఆర్‌సీపీ ప్రచార విభాగం జోన్‌-3 అధ్యక్షురాలు మైళా రత్నకుమారి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశాయని, ప్రజల తీర్పును స్వేచ్ఛగా ఎదుర్కొనే బదులు కూటమి నాయకులు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆమె విమర్శించారు. ఈ మేర‌కు ఆమె ఓ వీడియో విడుద‌ల చేశారు.

నామినేషన్లను అడ్డుకుని ఏకగ్రీవాలా?

ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుని, అనంతరం ఏకగ్రీవాలంటూ ప్రకటించుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మైళా రత్నకుమారి పేర్కొన్నారు. ప్రజల మద్దతు ఉంటే ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కోవాలని, అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు. నామినేషన్ల సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు ఎదుర్కొంటున్న అడ్డంకులు, దాడులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ప్రతిపక్ష అభ్యర్థులకు రక్షణ కల్పించి, స్వేచ్ఛాయుతంగా నామినేషన్లు దాఖలు చేసే వాతావరణాన్ని అధికారులు కల్పించాలని స్పష్టం చేశారు.

న్యాయపోరాటంతో హక్కుల పరిరక్షణ

వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల ఎన్నికల హక్కులను కాపాడేందుకు చట్టపరమైన మార్గాల్లో పోరాటం కొనసాగిస్తామని మైళా రత్నకుమారి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగేందుకు ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. 
 

 

Back to Top