తాడేపల్లి: రాష్ట్రంలో ఐపీఎస్, డీఎస్పీ స్థాయి అధికారులు అఫీషియల్ రౌడీలుగా మారిపోయి, ఎన్నికల్లో అక్రమ సంపాదన కోసం వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్కో డీఎస్పీకి రోజుకు రూ. 60 లక్షలు, డీఐజీలకు కోట్లాది రూపాయలు ముడుపులు అందుతున్నాయని, కావాలంటే దీనిపై ఎవరైనా విచారణ చేసుకోవచ్చని ఆయన ఆరోపించారు. ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించాల్సిన పోలీసులే అధికార పార్టీతో కుమ్మక్కై, కిందిస్థాయి సిబ్బందికి కూడా డబ్బులు పంచుతూ ఏకగ్రీవాల పేరుతో కోట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసుల సమక్షంలోనే మా అభ్యర్థులపై దాడులు జరుగుతున్నా, నామినేషన్ పత్రాలు చించేస్తున్నా పోలీసులు పట్టించుకోకుండా టీడీపీకి పూర్తిగా సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. . కడప మున్సిపాలిటీలో రూ. 40 కోట్లు వసూలు చేసి, అందులో సింహభాగాన్ని ఈ పోలీసు అధికారులకే పంచుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు..: చంద్రబాబు చేస్తున్న నీచమైన రాజకీయాలను చూసి ప్రజలంతా అసహ్యించుకుంటున్నారు. లోకేష్ శునకానందం కోసం, ఆయన రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబుకు ఉన్న విపరీతమైన ప్రేమతో ఈ రాష్ట్రాన్ని రావణాకాష్టంగా మారుస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లను అడ్డుకుంటూ టీడీపీ గూండాలు కట్టెలకు సర్జికల్ బ్లేడ్లు కట్టుకుని రోడ్లపై స్వైరవిహారం చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. కడప మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీ మేయర్ అభ్యర్థుల నుంచి రూ.40 కోట్లు వసూలు చేసి, ఆ డబ్బును పోలీసులకు పంచుతూ వారి ద్వారా దౌర్జన్యాలు చేయిస్తున్నారు. డీఎస్పీ స్థాయి అధికారులు ఈ ఎన్నికల ద్వారానే ఏకంగా రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు సంపాదిస్తున్నారని టీడీపీ నాయకులే నాతో చెబుతున్నారు. నేను చేస్తున్నవి కేవలం ఆరోపణలు కావు, ఇవన్నీ నిజాలు, కావాలంటే ఎవరైనా సమగ్ర విచారణ చేసుకోవచ్చు. అదనపు డీజీ స్థాయిలో ఉన్న ఓ అధికారి భవిష్యత్తులో డీజీపీ పదవి కోసం టీడీపీ గూండాలు ఏం చేసినా చూస్తూ ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. దాడులపై ఆధారాలున్నా పోలీసుల చర్యలు శూన్యం: మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారిపై జరిగిన దాడితో పాటు టీడీపీ నాయకులు చేస్తున్న దాడులు, ఆస్తుల ధ్వంసంపై సీసీటీవీ ఫుటేజీల వంటి ఆధారాలు ఉన్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ అరాచకాలను ఎవరూ ప్రశ్నించకూడదనే కుట్రతో పోలీసు వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహించలేనప్పుడు చంద్రబాబు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చినట్లు, నేరుగా తమ అభ్యర్థులనే ప్రకటించుకుంటే సరిపోయేది కదా. పరువు, మర్యాదలతో బతికే వారు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాలనుకునే వారు ఈ దౌర్జన్యాలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. వైఎస్ జగన్ గారిని లక్ష్యంగా చేసుకుని ఎల్లో మీడియా చౌకబారు రాతలు రాస్తోంది. అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చంద్రబాబు గొడ్డలి, చెల్లి, తల్లి అంటూ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో వైఎస్ జగన్గారే అసలు సిసలు హీరోగా నిలిచారు. అభ్యర్థులకు భద్రత కల్పించాలి.. దౌర్జన్యాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలి: సుప్రీంకోర్టు తీర్పుతోనైనా పోలీసులు, అధికారులు బుద్ధి తెచ్చుకోవాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునీతా సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేసి, ప్రతి అభ్యర్థి భయం లేకుండా స్వేచ్ఛగా నామినేషన్ వేసుకునే పరిస్థితిని కల్పించాలి. నామినేషన్ కేంద్రాల వద్ద తగిన భద్రత కల్పించడంతో పాటు దాడులు, బెదిరింపులు, ఆస్తుల ధ్వంసంపై నమోదైన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎన్నికల సంఘం తన రాజ్యాంగబద్ధ బాధ్యతను నిర్వర్తించాలి. పోలీసులు, ఎన్నికల అధికారులు ఇకనైనా చట్టబద్ధంగా వ్యవహరించాలి. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం అనే పద్ధతిని విడనాడాలి. ఎన్నికలంటే ప్రజాసేవకు అవకాశం కావాలి కానీ, ప్రాణాలకు ముప్పు తెచ్చే పరిస్థితి ఉండకూడదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న పాలకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. ప్రజాస్వామ్యంలో గెలవాల్సింది దౌర్జన్యం కాదు, డబ్బు కాదు, అధికార దుర్వినియోగం కాదు, ప్రజల తీర్పు మాత్రమే. ప్రజలు గెలవాలి, ప్రజాస్వామ్యం గెలవాలి అనే లక్ష్యంతో మా పోరాటం కొనసాగుతుందని సతీష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.