కర్నూలు జిల్లా: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరిలో తనకు నోటీసు ఇవ్వకుండానే పోలీసులు గృహనిర్బంధం చేశారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే తనను, తన సోదరులను నిర్బంధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజాతీర్పును ఎదుర్కొనే బదులు పోలీసు వ్యవస్థను ఉపయోగించి తమ పార్టీ అభ్యర్థులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం ఎందుకు? ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని చంద్రబాబును బుసినే విరుపాక్షి ప్రశ్నించారు. ప్రజల మద్దతుపై నమ్మకం ఉంటే ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే ముందస్తు నిర్బంధాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కుప్పంలో టీడీపీని అడ్డుకున్నామా? వైయస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో ఎన్నికలు నిర్వహించలేదా అని చంద్రబాబును ప్రశ్నించిన విరుపాక్షి, గతంలో టీడీపీ నాయకులను బెదిరించి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయా అని నిలదీశారు. ఎన్నికల్లో గెలుపోటములను ప్రజలే నిర్ణయించాలని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులను పోటీకి దూరం చేయడం సరికాదని పేర్కొన్నారు. నిర్బంధించినా వెనక్కి తగ్గేది లేదు తనను గృహనిర్బంధం చేసినా, జైలులో పెట్టినా వైయస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేలా కృషి చేస్తామని బుసినే విరుపాక్షి స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎవరూ భయపడవద్దని, నామినేషన్ దాఖలులో ఎక్కడైనా అడ్డంకులు ఎదురైతే తనకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. ప్రతి అభ్యర్థికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అభ్యర్థులకు జగనన్న అండ వైయస్ఆర్సీపీ అభ్యర్థులు ధైర్యంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని, ఎలాంటి బెదిరింపులకు భయపడవద్దని విరుపాక్షి పిలుపునిచ్చారు. తమ వెనుక పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారనే నమ్మకంతో ముందుకు సాగాలని సూచించారు. నామినేషన్లు దాఖలు చేయడం ప్రతి అభ్యర్థికి ఉన్న ప్రజాస్వామ్య హక్కు అని, ఆ హక్కును కాపాడేందుకు పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.