తాడేపల్లి: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బరితెగిస్తున్న వెన్నుపోటు పార్టీ ముఠాలతో పాటు ఎస్ఈసీకి సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన ఆదేశాలు చెంపపెట్టులా ఉన్నాయని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్ఈసీ అమలు చేయాలని, తన విస్తృత అధికారాలను వాడి ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. ఇవాళ కూడా పరిషత్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా 11 జిల్లాల్లో 76 ఘటనలు జరిగాయని, సుప్రీంకోర్టు ఆదేశాలున్నా బరితెగిస్తున్న వ్యవహారాన్ని తిరిగి అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ప్రెస్ మీట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకేమన్నారంటే... పరిషత్ ఎన్నికల్లోనూ అదే తీరు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్పోరేషన్లు, మున్సిపాలిటీల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగిసింది. అలాగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ రెండు ఓవర్ ల్యాప్ కావడం గందరగోళానికి దారి తీస్తోంది. ఇది కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా మా అభ్యర్ధుల్ని అడ్డుకోవడం, స్క్రూటినీలో అడ్డగోలుగా తిరస్కరించడం, స్క్రూటినీకి మా అభ్యర్ధులు రానివ్వకుండా అడ్డుకోవడం చేశారు. అలాగే విత్ డ్రా చేసుకోమనే బెదిరింపులు కూడా కొనసాగాయి. ఆ విధంగా పోలీసుల తప్పుడు కేసులు, వీళ్ల అండతో టీడీపీ నాయకుల బెదిరింపులు కొనసాగాయి. ఈ కారణాల వల్లే మా అభ్యర్ధులు కొన్ని చోట్ల విత్ డ్రా చేసుకున్నారు తప్ప డమ్మీగా నిలబడటమో, వైఎస్సార్సీపీ తరఫున నిలబడాలన్న కోరిక వారికి లేకపోవడమూ కాదు. పోలీసులు, అధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నుంచి నుంచి తప్పించుకునేందుకు, గంజాయి, ఇతర తప్పుడు కేసుల్లో ఇరికిస్తామనే బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఇవాళ మొదలైన పరిషత్ ఎన్నికల నామినేషన్లలోనూ ఇవన్నీ కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వీటిపై ఫిర్యాదులు చేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. పోలీసులకు, డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేదని ఎస్ఈసీకి చెప్తే .. ఆయన ఆ ఫిర్యాదుల్ని తిరిగి వారికే పంపడం, అధికారులకు నీతి సూత్రాలు చెప్పడం జరుగుతూనే ఉన్నాయి. ఆచరణలో మాకు పై నుంచి ఒత్తిడి ఉంది, ఏమనుకోకండి, మీరు నామినేషన్లు వేయొద్దని బుజ్జగింపులు, బెదిరింపులు, ఇవేవీ కుదరకపోతే తప్పుడు కేసులు పెడుతున్నారు. వీటిపైనే మేం కింది కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసినా ఫలితం లేక సుప్రీంకోర్టు వరకూ వెళ్లాం. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం వీటి మీద సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. మేం ఫిర్యాదు చేసిన మున్సిపాలిటీల్లో నామినేషన్ల తుది జాబితా ఖరారు 25వ తేదీ వరకూ వాయిదా వేయాలని, రేపు సాయంత్రం వరకూ ఫిర్యాదులపై ఓ నిర్ణయం తీసుకోవాలని చెప్పడం, డీజీపీకి సీసీటీవీ కెమెరాలు పెట్టాలని చెప్పడం మంచి పరిణామాలే. ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన అధికారాలు ఉపయోగించి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియ పూర్తి చేస్తుందని ఆశిస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు డీజీపీ కూడా ఇవన్నీ పాటించినట్లు కాంప్లయెన్స్ రిపోర్ట్ 27వ తేదీ కల్లా ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. సీసీటీవీ కెమెరాలు లేవని చెప్తే అదో పెద్ద లోపం అవుతుంది. గతంలో హైకోర్టు, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పాయి. ఇదంతా జరుగుతుండగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ పోలీసుల అండతో ఇలాంటి కుట్రల్ని అమలు చేస్తున్నారు. టీడీపీ కన్నుసన్నల్లో నడిచే పోలీసు అధికారులతో, నిష్పాక్షికంగా ఉండాల్సిన ఎన్నికల అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. టీడీపీ చెప్పుచేతల్లో ఉండి వాళ్లు చెప్పినట్లు వింటున్నారు. విజిలెన్స్ కేసుల భయంతోనో, రెడ్ బుక్ వల్ల ఇబ్బందులు వస్తాయనో భయంతోనే, ఈ ప్రభుత్వం వల్ల ప్రయోజనాలు పొందుతున్న వారో ఇలాంటి అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఇవాళ 11 జిల్లాల్లో 76 ఘటనలు ఇవాళ 11 జిల్లాల్లో ఇలాంటి 76 దాడులు, నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలు చించేయడం వంటి ఘటనలు జరిగాయి. వైఎస్సార్ జిల్లాలో 22, అన్నమయ్య జిల్లాలో 11, పల్నాడు జిల్లాలో 18, తిరుపతి జిల్లా 11, చిత్తూరు జిల్లా 2, ప్రకాశం జిల్లా 4, కర్నూలు జిల్లా 2, నంద్యాల జిల్లా 2, అనంతపురం జిల్లా 2, సత్యసాయి జిల్లా 1, కాకినాడ జిల్లా ఒకటి కలిపి ఇలాంటి 76 ఘటనలు జరిగాయి. ఇందులో టీడీపీ శ్రేణులు పోలీసుల అండతో దాడులు చేసిన ఘటనలు 11, పోలీసుల అండతో స్టేషన్లకు తరలింపులు చేసిన ఘటనలు 14, పోలీసుల గృహనిర్బంధ ఘటనలు 12, పోలీసుల అడ్డగింతలు, బెదిరింపులు, ఇతర ఆంక్షలు 14, నామినేషన్ పత్రాలు చించేసిన ఘటనలు 7, నామినేషన పత్రాలు లాక్కొన ఘటనలు 2 ఉన్నాయి. గతంలో చెదురుమదురు ఘటనల మధ్య పోలింగ్ జరిగేది. కానీ ఇప్పుడు నామినేషన్ల నుంచే ఇవన్నీ మొదలుపెట్టేశాడు. ఓటమి భయంతో చంద్రబాబు, ఆయన కుమారుడి దర్శకత్వంలో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. సుప్రీంకోర్టు దృష్టిలో ఉందని తెలిసీ బరితెగించి మరీ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ తిరిగి సుప్రీంకోర్టు ముందు పెడతాం. ఈ ఘటనలకు కారకులైన అధికారుల్ని బదిలీ చేయాలి, వీఆర్ కు పంపాలని ఎస్ఈసీని ఇప్పటికే కోరాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందూ ఇదే విజ్ఢప్తిచేస్తాం. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అయినా ఆయా అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాల్ని ఎస్ఈసీ అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత చంద్రబాబు సమీక్ష జరిపి వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడులు చేసి, మేమే కోర్టుకు వెళ్తున్నామని చెప్పుకుంటున్నారు. మేం దాడులు చేస్తున్నట్లు ఎక్కడైనా కనిపిస్తోందా ? గత కొన్ని రోజులుగా ఎవరు దాడులకు దిగుతున్నారో అందరికీ కనిపిస్తూనే ఉంది. ఆధారాలను కూడా సమర్పించాం. నామినేషన్ వేసేందుకు వెళ్లే వాళ్లు ఎక్కడైనా దాడులు చేస్తారా ? ప్రత్యర్థులు నామినేషన్ వేసేందుకు వెళ్తుంటే దాడులు చేస్తారు కానీ నామినేషన్ వేసే వాళ్లు ఎక్కడైనా దాడులు చేసిన ఘటనలు ఉన్నాయా ? పోలీసులే నామినేషన్ కేంద్రాల లోపల వాళ్లు ఉన్నారు, వెళ్లొద్దు అని పోలీసులే చెప్తున్నారు. దాడులు జరిగిన 19 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇది మంచిదే. మరి ఇప్పుడు జరుగుతున్న వాటి పరిస్ధితి ఏంటి ? సుప్రీంకోర్టు కదిలిస్తే తప్ప ఎస్ఈసీలో కదలిక రాలేదు. ఎస్ఈసీ స్పందించాల్సి ఉందని సుప్రీంకోర్టు ఇవాళ చెప్పింది. ఇప్పుడు తాజాగా జరిగిన ఘటనల మీద మేం మళ్లీ సుప్రీంకోర్టుకు పోవాలా ? లోపల టీడీపీ వాళ్లు వంద మంది ఉంటారు. లోపలికి వెళ్తే మా అభ్యర్ధుల దగ్గర పేపర్లు లాక్కుని చింపేస్తారు. సీసీ కెమెరాలు ఉండవు. ఎస్ఈసీ అనుకుంటే అన్నీ బయటికి వస్తాయి. ఎస్పీలు, కలెక్టర్లు అందరినీ నిలబెట్టి రిపోర్టులు తెప్పించుకునే అధికారం ఎస్ఈసీకి ఉంది. ఎస్ఈసీ ఆ పని చేస్తుందని ఆశిస్తున్నాం. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కడప జడ్పీ దగ్గరే మా పార్టీ ఆఫీసు ఉంటుంది. అక్కడి నుంచి జడ్పీకి వెళ్లేందుకు బయలుదేరగానే పక్కనే ఉన్న ఇరిగేషన్ కాంపౌండ్ నుంచే రాళ్లు విసురుతారు. పోలీసులు వీళ్లకు అండగా ఉంటారు. ఇదీ కడపలో పరిస్దితి. నరసరావుపేటలో లోపల వంద, రెండొందల మంది ఉండి నామినేషన్ పత్రాలు చించేస్తారు. పుంగనూరు, వేలూరు, సింగరాయకొండ, పెనుగొండ, తొండంగి, మాచర్ల, నరసరావుపేటలో అన్నీ ఇలాంటి ఘటనలే. అభ్యర్ధులపై కేసులు పెట్టి వెంటనే తీసుకెళ్లిపోతున్నారు. నాయకుల్ని గృహనిర్భంధాలు చేస్తున్నారు. లేదా మర్డర్ కేసుల్లోనూ, ఇతర కేసుల్లోనో బెదిరించి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయేలా చేస్తున్నారు. ఎన్నికలంటే చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు. టీడీపీ వాళ్లు విచ్చలవిడిగా రోడ్లపై కత్తులతో తిరుగుతున్నారు. దాడులకు దిగుతున్నారు. తిరిగి మా వాళ్ల మీదే కేసులు పెడుతున్నారు. సుప్రీంకోర్టు ముందుకు ఇవన్నీ తీసుకెళ్తాం. అంతకంటే ముందే ఎస్ఈసీకి కూడా ఇస్తున్నాం. జరుగుతున్న ఘటనల్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఈసీ సరి చేస్తుందని, తన అధికారాలు ఉపయోగించి స్వేచ్చగా ఎన్నికలు నిర్వహిస్తుందని ఆశిస్తున్నాం. చంద్రబాబు ఆగడాన్ని మేం బయటపెట్టాల్సిన అవసరం లేదు, ఆయనే బయటపడిపోతున్నారు. మాఫియా ముఠాల్లా వ్యవహరిస్తున్న వారు బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. బీహార్ నుంచి రోడ్డు పనులకు వచ్చిన వాళ్లకు అదనపు డబ్బులిచ్చి ముఠాల్లా దింపుతున్నారు. లైసెన్సెడ్ రివాల్వర్ ఉన్న సెక్యూరిటీ గార్డులు కాదు అంతర్ రాష్ట్ర నేరస్తులు. వీళ్లు దించిన వాళ్లే అంతర్ రాష్ట్ర నేరస్తులు. ఓ పక్క అధికార బలం, పోలీసుల వస్తాసు, ఇంకో పక్క పక్క రాష్ట్రాల నుంచి తెచ్చిన నేరస్తుల ముఠాల సాయంతో ఇలాంటి హింసాయుత వాతావరణం సృష్టిస్తున్నారు. తిరిగి వైఎస్సార్సీపీ వాళ్లే చేస్తున్నారని ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మా పార్టీ కార్యకర్తలు, నాయకులు సంయమనంతో ఉంటూ ప్రజాస్వామ్య స్పూర్తితో పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది మా బలహీనత కాదు బలం. మేం న్యాయస్థానాల మీద, వ్యవస్థల మీద నమ్మకం పెట్టుకున్నాం. అదే మిమ్మల్ని గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. మీడియా ప్రశ్నలకు జవాబిస్తూ.. ఈ ఎన్నికలనేవి పద్దతిగా జరిపించేందుకే ఈ వ్యవస్థలు ఉన్నాయి.వాటి కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి రావడం దురదృష్టకరం. ఆ పరిస్ధితుల్లో దాన్ని సరి చేసే దిశలో ఓ అడుగు పడటం ఆహ్వానించదగ్గ పరిణామం. అది నిజమని, ప్రాధమికంగా కేసు ఉందని సుప్రీంకోర్టు చెప్పడం సంతోషం కలిగించే విషయం. ఎక్కడో చోట వ్యవస్థల్ని సక్రమంగా పనిచేసేలా చేసే వ్యవస్థలు ఉన్నాయి. అందుకే ప్రజాస్వామ్యం మీద విశ్వాసంతోనే మాతో పాటు ప్రజలు కూడా ముందడుగు వేస్తున్నారు. ప్రజాస్వామ్య స్పూర్తి ఉంది కాబట్టి మా పార్టీ నిలబడగలుగుతోంది. ఆ విశ్వాసానికి అర్దం ఉందని ఇవాళ తీర్పు ద్వారా తెలుస్తోంది. మేం పెట్టుకున్న నమ్మకానికి తగినట్లుగా ఈ తీర్పు ఉందన్న సంతోషం కలుగుతోంది. సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరిస్తోంది మేం కాదు. వాళ్లే వక్రీకరించాలని చూస్తున్నారు. మళ్లీ రేపు వీళ్లు అంతా బాగుందని సుప్రీంకోర్టుకు చెప్పినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఎస్ఈసీ తమ విస్తృత అధికారాలను వాడి ఆధారాలను తెప్పించుకోవాలని కోరుతున్నాం.