తాడేపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అనుబంధ విభాగాలు పూర్తి స్థాయిలో యాక్టివ్ అయి, గ్రామస్థాయి వరకు పార్టీ శక్తిని సమన్వయంతో వినియోగించుకోవాలని వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్లతో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన ఎజెండాగా సమావేశం జరిగింది. ప్రతి అనుబంధ విభాగం పార్టీకి ఒక కీలక భాగమని, అన్ని విభాగాలు సమర్థంగా పనిచేసినప్పుడే పార్టీ లక్ష్యాలను సాధించగలదని సజ్జల అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేసే ఒక అవకాశమని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన, ఎన్నికల ప్రక్రియపై ఆయన మండిపడ్డారు. రిజర్వేషన్ల నుంచి నామినేషన్ల వరకు సరైన సమాచారం, సమయం ఇవ్వకుండా ప్రతిపక్షాన్ని ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులు ఉన్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు, ఇతర అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వడంలో ఆలస్యం చేయడం, నామినేషన్లకు అడ్డంకులు సృష్టించడం, అభ్యర్థులను పోలీస్ స్టేషన్లకు పిలిపించడం, బైండ్ ఓవర్ కేసులతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి స్థానానికి ఒక అభ్యర్థితో సరిపెట్టకుండా, రెండు మూడు ప్రత్యామ్నాయాలను కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు. నామినేషన్ నుంచి పోలింగ్, కౌంటింగ్, బ్యాలెట్ బాక్సుల భద్రత వరకు ప్రతి దశలో పార్టీ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. - గ్రాస్‌రూట్ స్థాయిలో పార్టీకి పెరిగిన ఆర్గనైజేషనల్ బలం పార్టీకి ప్రస్తుతం రాష్ట్రం నుంచి గ్రామస్థాయి వరకు బలమైన ఆర్గనైజేషనల్ నెట్వర్క్ ఉందని సజ్జల పేర్కొన్నారు. లక్షలాది మంది కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకత్వంతో కేంద్ర కార్యాలయానికి నేరుగా కనెక్టివిటీ ఏర్పడిందని, ఎస్ఐఆర్ వంటి కార్యక్రమాల్లో ఈ వ్యవస్థ సమర్థంగా పనిచేసిందని చెప్పారు. ఈ బలాన్ని ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ప్రతి విభాగం తన కేడర్‌ను కిందిస్థాయి వరకు యాక్టివేట్ చేయాలని సూచించారు. - ప్రతి విభాగం తన సెక్షన్ సమస్యలపై ప్రచారం చేయాలి మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు, బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ తదితర ప్రతి వర్గానికి సంబంధించిన సమస్యలను ఆయా అనుబంధ విభాగాలు గుర్తించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సజ్జల సూచించారు. గత ప్రభుత్వ కాలంలోని పరిస్థితులతో ప్రస్తుత పరిస్థితులను పోల్చుతూ, మహిళల సమస్యలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, యువతకు ఉపాధి, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, ఎరువులు, విత్తనాలు, ఉద్యోగుల సమస్యలు, నిత్యావసర ధరలు, పట్టణాల్లో రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్ వంటి స్థానిక సమస్యలపై ప్రత్యేకంగా ప్రచారం చేయాలని చెప్పారు. - సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా వాడాలి తక్కువ సమయంలో ఎక్కువ మందికి చేరుకోవడానికి సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అత్యంత కీలకమని సజ్జల స్పష్టం చేశారు. సోషల్ మీడియా పని ఒక ప్రత్యేక విభాగం బాధ్యత మాత్రమే కాదని, అన్ని అనుబంధ విభాగాలు దానిని వినియోగించుకోవాలని చెప్పారు. ప్రతి విభాగం తనకు సంబంధించిన అంశాలపై చిన్న వీడియోలు, స్థానిక సమస్యలపై విజువల్ కంటెంట్ తయారు చేయాలని సూచించారు. మాట్లాడగలిగే కార్యకర్తలు, స్థానిక ఇన్ఫ్లూయన్సర్లు, యువకులను గుర్తించి వారి ద్వారా విస్తృతంగా కంటెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రతి విభాగం ఒక కోర్ టీమ్‌ను ఏర్పాటు చేసుకుని, కంటెంట్, సోషల్ మీడియా, ఫీల్డ్ కోఆర్డినేషన్, ప్రచారం వంటి బాధ్యతలను పంచుకోవాలని సూచించారు. - అభ్యర్థుల ప్రచారానికి కూడా అనుబంధ విభాగాలు అండగా ఉండాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల పేరు, ఫోటో, గుర్తు, వారు చేసిన పనులు, స్థానికంగా ఉన్న మంచి పేరు తదితర అంశాలను సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అభ్యర్థులకు ప్రచార పద్ధతులపై అవగాహన లేకపోయినా, అనుబంధ విభాగాలు, సోషల్ మీడియా, ఐటీ టీమ్‌లు వారికి సహకరించాలని చెప్పారు. - లీగల్ సపోర్ట్, విజువల్ ఎవిడెన్స్ తప్పనిసరి ఎన్నికల సమయంలో ఎక్కడైనా నామినేషన్లకు అడ్డంకులు, పోలీసు జోక్యం, అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు లేదా ఇతర వివాదాస్పద ఘటనలు జరిగితే వాటిని తప్పనిసరిగా వీడియో రూపంలో రికార్డు చేయాలని సజ్జల సూచించారు. ఇలాంటి విజువల్ ఎవిడెన్స్ కోర్టుల్లో, ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల్లో, మీడియా ద్వారా ప్రజలకు వివరించడంలో ఉపయోగపడుతుందని చెప్పారు. కేవలం ఆరోపణలు చేయడం కాకుండా, ఆధారాలతో ప్రతి ఘటనను రికార్డు చేయాలని స్పష్టం చేశారు. - బూత్ ఏజెంట్లు, పోలింగ్, కౌంటింగ్‌లో కూడా వింగ్స్ పాత్ర అనుభవం ఉన్న కార్యకర్తలను బూత్ ఏజెంట్లుగా గుర్తించడం, అభ్యర్థులకు పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో సహకరించడం, గతంలో ఎన్నికల అనుభవం ఉన్నవారి సేవలను వినియోగించుకోవడం వంటి అంశాల్లో కూడా అనుబంధ విభాగాలు చురుకైన పాత్ర పోషించాలని సమావేశంలో సూచించారు. - పని చేసిన వారికి గుర్తింపు పార్టీ కోసం నిజాయితీగా పని చేసే కార్యకర్తలు, నాయకుల పనితీరును ఈసారి వ్యవస్థీకృతంగా నమోదు చేయాలని సజ్జల చెప్పారు. కార్యక్రమాలు, సమావేశాలు, ప్రెస్మీట్లు, డిజిటల్ యాక్టివిటీ, ఫీల్డ్ పనితీరు తదితర అంశాలను ట్రాక్ చేసే విధానం తీసుకురావాలని పార్టీ నిర్ణయించిందన్నారు. కేవలం పదవి ఉన్నందుకే కాకుండా, వాస్తవంగా పార్టీకి విలువ జోడించి పనిచేసినవారికి భవిష్యత్తులో తగిన గుర్తింపు, గౌరవం ఉండేలా చూడాలని పేర్కొన్నారు. అనుబంధ విభాగాల నాయకులు తమ తమ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రామ, మండల స్థాయి పదవులను కూడా గుర్తించి భర్తీ చేసి, ఎన్నికల సందర్భంగా ఆర్గనైజేషన్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ● 11 లక్షల అనుబంధ విభాగాల శక్తిని ఎన్నికల్లో వినియోగించాలి: ఆలూరు సాంబశివారెడ్డి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇన్చార్జ్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం నుంచి గ్రామస్థాయి వరకు పార్టీకి బలమైన అనుబంధ విభాగాల వ్యవస్థ ఉందన్నారు. దాదాపు 14 లక్షల మంది పార్టీ ఆర్గనైజేషనల్ వ్యవస్థలో ఉండగా, అందులో పెద్ద సంఖ్యలో అనుబంధ విభాగాల నాయకత్వం ఉందని తెలిపారు. ఈ నెట్‌వర్క్‌ను గ్రామస్థాయి వరకు యాక్టివేట్ చేసి, ప్రచారం, సోషల్ మీడియా, బూత్ మేనేజ్మెంట్, అభ్యర్థుల ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి దశలో వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి విభాగం తనకు సంబంధించిన సమస్యలపై వన్ మినిట్ వీడియోలు, స్థానిక సమస్యలపై డిజిటల్ కంటెంట్ తయారు చేసి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ● ప్రచారం నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు అనుబంధ విభాగాలకు బాధ్యత: లేళ్ల అప్పిరెడ్డి వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, గత రెండేళ్లలో మహిళా, యువజన, విద్యార్థి, రైతు, బీసీ, ఎస్సీ తదితర అనుబంధ విభాగాలు ప్రజా సమస్యలపై అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు నిర్వహించాయని అభినందించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ప్రచారం నుంచి అభ్యర్థులకు అండగా నిలవడం, పోలింగ్ రోజున బూత్ ఏజెంట్లుగా పనిచేయడం, కౌంటింగ్ వరకు ప్రతి దశలో అనుబంధ విభాగాలు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ ఆర్గనైజేషన్‌ను మరింత బలోపేతం చేసుకునే అవకాశంగా తీసుకుని, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ● సోషల్ మీడియా ద్వారా మహిళలు, ప్రజల సమస్యలను విస్తృతంగా తీసుకెళ్లాలి: వరుదు కళ్యాణి వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయలేదని, ధరల పెరుగుదలతో పాటు మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నాయన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విస్తృతంగా ఉన్నందున, వన్ మినిట్ రీల్స్, చిన్న వీడియోల ద్వారా ప్రజా సమస్యలు, ప్రభుత్వ హామీల అమలు పరిస్థితి, గత వైయస్ జగన్ ప్రభుత్వంలో జరిగిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మహిళా విభాగం ఇప్పటికే మహిళల సమస్యలపై అనేక కార్యక్రమాలు నిర్వహించిందని, ఇతర అనుబంధ విభాగాల పోరాటాల్లో కూడా మహిళలు చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకత్వం ఇచ్చే బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.