బాబాయి గొడ్డలి జపం ఆపి, నిజాలు నిరూపించే ధైర్యం ఉందా? 

చంద్రబాబుకు పేర్ని నాని సవాల్‌

తప్పుడు కేసులతో వేధించినా వెనక్కి తగ్గని వల్లభనేని వంశీ.. 

వైయ‌స్ జగన్‌ నాయకత్వంలో మళ్లీ ప్రజాసేవకు సిద్ధం

కృష్ణా జిల్లా : గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ పదేపదే వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. బాబాయి హత్య కేసులో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమేయం ఉందని నిజంగా నమ్మితే, ఆ విషయాన్ని నిరూపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. గన్నవరం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారు. 

బాబాయి హత్య కేసుపై చంద్రబాబుకు ప్రశ్నలు

బాబాయి హత్య కేసును పదేపదే ప్రస్తావిస్తున్న టీడీపీ నేతలు, ఆ కేసులో నిజాలను నిరూపించేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు తనను తలుచుకుంటే ఐదు నిమిషాల్లో జగన్‌ను జైలులో పెడతానన్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, నిజంగా అంత ధైర్యం ఉంటే బాబాయి హత్య కేసులో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సవాల్‌ చేశారు. ఆధారాలు లేకుండా రాజకీయ విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

కేసులు, వేధింపులు ఎదురైనా వెనక్కి తగ్గని వంశీ

వల్లభనేని వంశీపై గతంలో నమోదైన కేసులను ప్రస్తావించిన పేర్ని నాని, 2014, 2015, 2018 సంవత్సరాలకు సంబంధించిన వివాదాలతో పాటు అనేక కేసుల ద్వారా ఆయనను వేధించారని ఆరోపించారు. భూ వివాదానికి సంబంధించిన కేసులోనూ వంశీని నిందితుడిగా చేర్చారని పేర్కొన్నారు. సుమారు 50 నుంచి 60 కేసులతో ఇబ్బందులకు గురిచేసినా వంశీ ధైర్యం కోల్పోలేదని అన్నారు.

జగన్‌ నాయకత్వంలో మళ్లీ ప్రజాసేవే లక్ష్యం

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ, ప్రజల మద్దతుతో మళ్లీ అసెంబ్లీకి వెళ్లాలనే లక్ష్యంతో వల్లభనేని వంశీ ముందుకు సాగుతున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థుల ఒత్తిళ్లకు లొంగకుండా, ఆత్మవిశ్వాసంతో ప్రజల్లో పనిచేస్తున్న వంశీని ఆయన అభినందించారు. ప్రత్యర్థులు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ప్రజల మన్ననలే అంతిమమని వ్యాఖ్యానించారు.

Back to Top