నామినేషన్లకు అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదు

మాజీ మంత్రి కాకాణి

స్థానిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాల‌ని నెల్లూరు కలెక్టర్‌కు వినతి

నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ నెల్లూరు జిల్లాకు చెందిన వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నేతలు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర నిరభ్యంతర పత్రాలు సకాలంలో అందేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను గుర్తించిన చంద్రబాబు, వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను ఇబ్బంది పెట్టే చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర ఎన్‌వోసీలు ఇవ్వకుండా జాప్యం చేస్తూ నామినేషన్లను తిరస్కరించేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బలమైన అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు వివిధ రూపాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నామినేషన్లకు అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి: ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి

ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, నెల్లూరులో వైయ‌స్ఆర్‌సీపీ బలమైన శక్తిగా ఉండటంతో కూటమి ప్రభుత్వం భయపడుతోందని వ్యాఖ్యానించారు. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అర్హతలు, హోదాకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ కార్పొరేషన్‌ కమిషనర్‌ వ్యవహారశైలిపైనా ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరగకపోతే తిరగబడతామని స్పష్టం చేశారు.

అభ్యర్థులకు పార్టీ అండగా ఉంటుంది: ఆనం విజయ్‌కుమార్‌

వైయ‌స్ఆర్‌సీపీ మేయర్‌ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు జిల్లా పార్టీ నాయకత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

Back to Top