స్థానిక ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను ఓడించేందుకు చంద్రబాబు కుట్ర

పుత్తా శివశంకర్‌ ఫైర్‌ 

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ 

వైయ‌స్ఆర్‌సీపీని ఎదుర్కొనే దమ్ము కూటమికి లేదు

నామినేషన్‌ లను సైతం అడ్డుకునేందుకు అధికార యంత్రాంగాన్ని  దుర్వినియోగం

పుత్తా శివశంకర్‌ ధ్వజం

కులాలు మార్చుతూ సర్టిఫికెట్ల జారీ

ధృవీకరణ పత్రాల జారీలో కావాలనే జాప్యం

అధికార ధుర్వినియోగానికి పాల్పడుతూ బెదిరింపులు

పుత్తా శివశంకర్‌ ఆగ్రహం

పోలీసులను ఉసిగొలిపి వైయ‌స్ఆర్‌సీపీని బెదిరించలేరు

నోటిఫికేషన్‌  వెలువడక ముందే అధికార పార్టీకి భయమా..?

ప్రెస్‌ మీట్‌ లో నిలదీసిన పుత్తా శివశంకర్‌

తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతూ కుట్రలు పన్నుతోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ ధ్వజమెత్తారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న తరుణంలో వైఎస్సార్‌సీపీకి చెందిన బలమైన అభ్యర్థులను పోటీకి దూరం చేయాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగాన్ని తమకు అనకూలంగా ఉపయోగించుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం చేయడం, గతంలో జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలకు భిన్నమైన వివరాలు తెరపైకి తేవడం, పోలీసుల ద్వారా అభ్యర్థులను ప్రశ్నించడం వంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పుత్తా శివశంకర్‌ తేల్చి చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

సాంకేతిక కారణాలు చూపి కుట్ర:
    ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని, ప్రజల మద్దతు ఎవరికి ఉందో ఎన్నికల ఫలితాలే నిర్ణయించాల్సి ఉన్నా సరే, వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు పోటీలో ఉంటే తమకు ఇబ్బందులు తప్పవనే భయంతో వారిని సాంకేతిక కారణాలతో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా వ్యక్తుల పేర్లు, చిరునామాల్లో మార్పుల గురించి వింటుంటామని, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కుల ధ్రువీకరణ పత్రాల విషయంలోనే వివాదాస్పద పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక వ్యక్తి కులానికి సంబంధించిన అధికారిక రికార్డులు, గతంలో జారీ చేసిన ధృవీకరణ పత్రాలు, సంబంధిత ఆధారాలు ఉన్నప్పుడు వాటిని పరిశీలించి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. కానీ ఎందుకో రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే సమయంలోనే కుల ధృవీకరణ పత్రాల విషయంలో కొత్త వివాదాలు తలెత్తుతున్నాయి. విశాఖపట్నానికి చెందిన వెంకట నాగశశికళ విషయమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

కుల ధృవీకరణ సర్టిఫికెట్స్‌లో ఎందుకీ వివాదాలు?:
    విశాఖకు చెందిన వెంకట నాగశశికళ గతంలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా గ్రేటర్‌ వివాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ వైఖరికి అనుగుణంగా వ్యవహరించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే కుల ధ్రువీకరణ విషయంలో సమస్యలు ఎదురవడం వెనుక కారణాలేమిటి? 
    అలాగే విశాఖపట్నానికి చెందిన వెంకట సత్య విషయంలోనూ ఇదే తరహా సమస్య ఎదురవుతోంది. గతంలో తూర్పు కాపు, బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా ఆమెకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, అఫిడవిట్లు, ఇతర రికార్డులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆమె కులానికి సంబంధించి భిన్నమైన వివరాలు ప్రస్తావనకు వస్తున్నాయి. గతంలో ఉన్న పత్రాలకు ప్రస్తుత పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసంపై అధికారులు స్పష్టత ఇవ్వాలి. ఒకవేళ గతంలో జారీ చేసిన ధ్రువీకరణ పత్రాల్లో తప్పులు ఉన్నాయని అధికారులు భావిస్తే, చట్టప్రకారం విచారణ జరిపి, సంబంధిత వ్యక్తికి నోటీసులు ఇచ్చి, ఆధారాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అంతేకానీ, ఎన్నికల సమయంలో అభ్యర్థిని గందరగోళానికి గురిచేసే విధంగా వ్యవహరించడం సరికాదు.
    ఇంకా మార్కాపురంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఒక అభ్యర్థి ఇంటిగ్రేటెడ్‌ కుల ధ్రువీకరణ పత్రం కోసం ఈనెల 6న దరఖాస్తు చేశారు.  ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్న వాట్సాప్‌ గవర్నెన్స్‌ విధానాన్ని ఉపయోగించి దరఖాస్తు చేశారు. సంబంధిత అధికారులు ఫోన్‌ చేసి వాట్సాప్‌ ద్వారా పంపిన సాఫ్ట్‌ కాపీ సరిపోదని, ఒరిజినల్‌ పత్రాలను కార్యాలయానికి తీసుకురావాలని సూచించగా, అధికారుల సూచన మేరకు సంబంధిత పత్రాలను కార్యాలయానికి తీసుకెళ్లి సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు సర్టిఫికెట్‌ జారీ కాలేదు. 
    మరోవైపు వెన్నుపోటు పార్టీకి చెందిన వ్యక్తులు దరఖాస్తు చేసినప్పుడు త్వరితగతిన సర్టిఫికెట్లు అందుతున్నాయన్న సమాచారం మాకుంది. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారుల రికార్డులను పరిశీలించి, దరఖాస్తు ఎప్పుడు స్వీకరించారు, ఏ దశలో పెండింగ్‌లో ఉంది, ఎందుకు జారీ చేయలేదనే వివరాలను వెల్లడించాలి.

వారు ప్రభుత్వ ఉద్యోగులని గుర్తు పెట్టుకోవాలి:
    రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగుల నుంచి తహసీల్దార్లు, ఇతర ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ చట్టప్రకారం విధులు నిర్వర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకి వ్యక్తిగత సేవకులు కాదు. ప్రజలకు సేవ చేయడానికి రాజ్యాంగబద్ధమైన బాధ్యతతో పని చేస్తున్నారు. ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు పొందుతున్న అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కుల ధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఇతర అవసరమైన పత్రాలను నిర్ణీత విధానాల ప్రకారం జారీ చేయాలి. అభ్యర్థులు వైయ‌స్ఆర్‌సీపీకి చెందినవారనే కారణంతో దరఖాస్తులను పక్కన పెట్టడం, అనవసరమైన అభ్యంతరాలు చెప్పడం, కార్యాలయాల చుట్టూ తిప్పడం వంటి చర్యలకు పాల్పడితే బాధ్యులపై సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతాం. 
    అధికారులు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించకపోతే, సంబంధిత ఆధారాలతో ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తాం. ఇది అధికారులను బెదిరించడం కాదు. వారి రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను గుర్తుచేయడమే.  ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి పనిచేయాలి. 

పోలీసులను ఉసిగొలిపి వైయ‌స్ఆర్‌సీపీని బెదరించలేరు:
    స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు వ్యవహరిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో ప్రాంతంలో వందలాది మందిపై బైండోవర్‌ చర్యలు చేపడుతున్నారు.ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకముందే ఇలాంటి చర్యలు తీసుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటి..?  నిజంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడాన్ని ఎవరూ వ్యతిరేకించరు. అయితే ఎలాంటి తప్పు చేయని ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను రాజకీయ కారణాలతో ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం సహించబోం. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు తప్పులు చేసినా పట్టించుకోకుండా, ప్రతిపక్షానికి చెందినవారిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారనే ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. 
    పోలీసుల విధి శాంతిభద్రతలను కాపాడటం, ప్రజలకు రక్షణ కల్పించడం. అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని ప్రశ్నించడం లేదా రాజకీయ కార్యకలాపాలను నియంత్రించేందుకు ప్రయత్నించడం వారి బాధ్యత కాదు. చట్టాన్ని అమలు చేసే వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా పనిచేయాలి.   ఎన్నికల సమయంలో ప్రతి పౌరుడికి సమానమైన రక్షణ కల్పించాలి.

నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థులను అడ్డుకునే ప్రయత్నమా?:
    స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాల వరకు వైఎస్సార్‌సీపీ బలమైన అభ్యర్థులను సిద్ధం చేసుకుంటోంది. పార్టీకి ప్రజల్లో మద్దతు ఉంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాసరే, వైఎస్సార్‌సీపీకి అభ్యర్థులు లేరని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. మచిలీపట్నం సహా వివిధ ప్రాంతాల్లో పార్టీ పోటీకి సిద్ధమవుతోందని అభ్యర్థులతో సహా ప్రకటించాం. అభ్యర్థుల ఎంపిక, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, పోలీసుల చర్యలు వంటి అంశాలను కలిపి చూస్తే ప్రతిపక్షాన్ని సాంకేతికంగా బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి.  కానీ, ఇలాంటి చర్యలతో వైఎస్సార్‌సీపీని బలహీనపరచలేరు. 

కూటమిలో కీచులాట:
    కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ అంతర్గత రాజకీయాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. లోకేశ్‌కు ప్రతిపాదిస్తున్న 80–15–5 ఫార్ములాను ప్రస్తావిస్తూ, కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో అవనిగడ్డ, విజయవాడ వంటి ప్రాంతాల్లో అభ్యర్థుల ఎంపిక, బీఫారాల కేటాయింపు విషయంలో, తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం కొనసాగుతూ, జనసేనకు కేటాయింపుల విషయంలో అన్యాయం జరుగుతోంది. కార్యకర్తలు, నాయకులు తమకు తగిన ప్రాధాన్యం లభిస్తోందా లేదా అనే అంశాన్ని పరిశీలించుకోవాలి.  

అడ్డదారులు తొక్కితే సహించం:
    వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీని ఎన్నికల్లో ఎదుర్కోలేక అడ్డదారులు తొక్కడం కూటమి ప్రభుత్వ బలహీనతకు నిదర్శనం.  ప్రజల తీర్పును గౌరవించాలంటే ముందుగా అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం కల్పించాలి. అధికార యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా రాజ్యాంగబద్ధంగా పని చేయాలి. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు అన్యాయం జరిగితే పార్టీ న్యాయపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతాం.  ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, అర్హులైన అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించడం, ప్రజల తీర్పును గౌరవించడం ప్రభుత్వ బాధ్యత. స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడమే కూటమి ప్రభుత్వానికి తమ డిమాండ్‌ అని పుత్తా శివశంకర్‌ స్పష్టం చేశారు.

Back to Top