తాడేపల్లి: నాడు మెగా డీఎస్సీ–2025 పేరుతో ప్రతిభావంతులైన నిరుద్యోగ యువతను దగా చేసి, ఇప్పుడు షార్ట్ డీఎస్సీ పేరుతో మరోసారి మాయమాటలతో మభ్యపెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీలో 16 వేలకు పైగా పోస్టుల భర్తీపై అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, వాటికి సమాధానం చెప్పకుండా, స్వతంత్ర విచారణకు ఆదేశించకుండా 2,721 పోస్టులతో షార్ట్ డీఎస్సీ ప్రకటన చేయడం నిరుద్యోగ యువతను మరోసారి మోసం చేయడమేనని మండిపడ్డారు. మెగా డీఎస్సీపై వివాదాలు, ఆరోపణలకు సమాధానం చెప్పకుండా, కొత్త ప్రకటనలతో అసలు సమస్యను పక్కదారి పట్టించాలని ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో నిజాయితీ, నిష్పక్షపాతత్వం, పారదర్శకత పాటించకపోతే నిరుద్యోగ యువతతో కలిసి పెద్దఎత్తున పోరాటం చేస్తామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగార్జున యాదవ్ హెచ్చరించారు. ప్రెస్‌మీట్‌లో నాగార్జున యాదవ్ ఏమన్నారంటే..: ఉద్యోగాల భర్తీకి వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకం కాదు: మెగా డీఎస్సీ పేరుతో 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై అవకతవకల ఆరోపణలు వస్తున్నా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. స్వతంత్ర విచారణకు ఆదేశించకుండా ఇప్పుడు 2,721 పోస్టులతో షార్ట్ డీఎస్సీ ప్రకటిస్తే నిరుద్యోగ యువత ఎలా నమ్మాలి? ఉద్యోగాల భర్తీకి వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకం కాదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలు భర్తీ కావాలి. అయితే గత నియామకాలపై వచ్చిన ఆరోపణలకు ప్రభుత్వం ముందుగా సమాధానం చెప్పాలి. పాత వివాదాన్ని పక్కదారి పట్టించేందుకు కొత్త ప్రకటనలు చేయడం సరికాదు. షార్ట్ డీఎస్సీకి షెడ్యూల్ ఎక్కడ?: 2,721 పోస్టులతో షార్ట్ డీఎస్సీ ప్రకటించిన ప్రభుత్వం కనీసం షెడ్యూల్ కూడా వెల్లడించలేదు. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? నియామకాలు ఎప్పటికి పూర్తి చేస్తారు? స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఈ ప్రకటన కూడా మరుగున పడుతుందా? ఎన్నికల ముందు నిరుద్యోగ యువతలో ఆశలు రేపడం కాదు.. స్పష్టమైన కాలపట్టిక ప్రకటించి నియామకాలను పూర్తి చేయాలి. గత డీఎస్సీపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కొత్త నోటిఫికేషన్ గురించి ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యం. మెగా డీఎస్సీ అక్రమాలపై సమాధానాలు చెప్పాలి: ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయ పోస్టు ఇప్పిస్తామని ఓ యువతి నుంచి రూ.14.10 లక్షలు తీసుకున్నారన్న కేసుపై విచారణ ఏ స్థాయిలో ఉంది? 870 క్రీడా ధ్రువపత్రాల్లో నకిలీవి ఉన్నాయన్న అంశంపై ఏ చర్యలు తీసుకున్నారు? జూడో కేటగిరీ నియామకాలపై న్యాయస్థానం ఆదేశించిన విచారణ, కరిష్మా ధ్రువపత్రాల పరిశీలన, టెట్ మార్కుల వివాదం, ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రాల క్రాస్ వెరిఫికేషన్, త్రీమెన్ కమిటీ నివేదికపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఎస్సీఈఆర్‌టీలో పనిచేస్తూ ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియలో భాగస్వామ్యం ఉన్న నవీన్‌కు మొదటి ర్యాంకు రావడం, ఆ తర్వాత మెరిట్ జాబితా నుంచి తొలగించడం వెనుక కారణాలేమిటో వెల్లడించాలి. జీవో 47, జీవోలు 23, 56లోని నిబంధనల్లో ఏవి కొత్త డీఎస్సీకి వర్తిస్తాయో చెప్పాలి. అర్హతలు, ధ్రువపత్రాల పరిశీలనలో ఎలాంటి మినహాయింపులూ ఉండకూడదు. నిజాయితీగా నియామకాలు చేపట్టాలి. లేదంటే పోరాటం తప్పదు: మెగా డీఎస్సీపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపించి వాస్తవాలను బయటపెట్టాలి. కొత్త నియామకాల్లోనూ అవకతవకలకు తావిస్తే వైయస్‌ఆర్‌సీపీ సహించదు. నిరుద్యోగ యువతతో కలిసి పోరాటం చేస్తుంది. మెగా డీఎస్సీ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఉద్యోగాల భర్తీలో నిజాయితీ, నిష్పక్షపాతత్వం, పారదర్శకత పాటించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలి అని యనమల నాగార్జున యాదవ్ డిమాండ్ చేశారు.