నెల్లూరు: నెల్లూరు నగరంలో కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి వైయస్ఆర్సీపీ కార్యాచరణను వేగవంతం చేసింది. రాంజీనగర్లోని పార్టీ నగర కార్యాలయంలో 70వ డివిజన్ నాయకులు, కార్యకర్తలతో నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 70వ డివిజన్ వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా భాగి వెంకటరమణ పేరును ప్రకటించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు చంద్రశేఖర్రెడ్డి దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, వైయస్ఆర్సీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. భాగి వెంకటరమణ అభ్యర్థిత్వ ప్రకటనతో పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. 70వ డివిజన్లో సమష్టిగా పనిచేసి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి ఈ డివిజన్ను వైయస్ఆర్సీపీకి బలమైన స్థానంగా నిలబెడతామని పేర్కొన్నారు.