స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు సర్టిఫికెట్ల జారీలో జాప్యం వద్దు  

ఎన్నికల అధికారులు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ అధికారులకు తక్షణ ఆదేశాలు ఇవ్వండి

రాష్ట్ర ఎన్నికల సంఘాని (ఎస్‌ఈసీ)కి వైయస్సార్‌సీపీ విజ్ఞప్తి  

పరిపాలనా జాప్యం వల్ల అర్హులైన అభ్యర్థులు నామినేషన్‌కు దూరం కాకూడదు

రాష్ట్రవ్యాప్తంగా పారదర్శకంగా, ఒకే విధానంలో, నిర్దిష్ట గడువులో సర్టిఫికెట్లు జారీ చేయాలి

ఆ లేఖలో ఎస్‌ఈసీని కోరిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

తాడేపల్లి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులకు అవసరమైన కుల/కమ్యూనిటీ ధ్రువీకరణ పత్రాలు, నో–డ్యూస్‌ సర్టిఫికెట్ల జారీలో అనవసర ఆలస్యం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్‌ఈసీ) కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎస్‌ఈసీకి లేఖ రాశారు.

ఆ లేఖలో లేళ్ల అప్పిరెడ్డి ఏయే అంశాలు ప్రస్తావించారంటే..:
    మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు అవసరమైన సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం జరుగుతున్నట్లు మాకు పలు ఫిర్యాదులు అందాయి. నామినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయడానికి ఎన్నికల నిబంధనల ప్రకారం అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అత్యంత కీలకం. ఎన్నికల సంఘం హ్యాండ్‌బుక్‌లో కూడా అభ్యర్థులు నిర్ణీత పత్రాలను సరైన విధంగా, సమయానికి దాఖలు చేయాల్సిన అవసరాన్ని స్పష్టంగా పేర్కొన్న విషయం మీకు తెలిసిందే. అభ్యర్థులు అవసరమైన పత్రాలు సమర్పించలేని పరిస్థితి ఏర్పడితే నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది.
    అందువల్ల రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకుని అన్ని జిల్లా కలెక్టర్లు/జిల్లా ఎన్నికల అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీ అధికారులు, ఇతర సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. కుల/కమ్యూనిటీ సర్టిఫికెట్లు, నో–డ్యూస్‌ సర్టిఫికెట్ల కోసం వచ్చే దరఖాస్తులను ఎలాంటి వివక్ష లేకుండా, అనవసర జాప్యం చేయకుండా వేగంగా పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేయాలి. 
    అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ ఒకే విధంగా, పారదర్శకంగా, నిర్దిష్ట కాలపరిమితితో జరిగేలా ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) పర్యవేక్షించాలని లేళ్ల అప్పిరెడ్డి తన లేఖలో కోరారు.

Back to Top