స్థానిక ఎన్నికల కోసం పట్టాభిషేకాల పేరుతో డ్రామాలు 

వైయ‌స్ఆర్‌సీపీ హయాం నాటి ఇళ్ల పట్టాలతో చంద్రబాబు పబ్లిసిటీ

వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్‌ ఫైర్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌

చంద్రబాబు అబద్ధాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు

జగన్‌ హయాంలోనే ఇళ్ల నిర్మాణాలకు జీవోలు ఇచ్చి, అప్రూవల్‌ పూర్తి 

ఆ పనులన్నింటినీ తన ఖాతాలో వేసుకుంటున్న చంద్రబాబు  

పట్టాభిషేకాల పేరుతో పాత పథకాలకే కొత్త రంగులతో డ్రామా  

కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగట్టిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేక ముఖ్యమంత్రి చంద్రబాబు రకరకాల డ్రామాలతో ప్రజలను మబ్బే పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ అ«ధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ఆక్షేపించారు. గత ప్రభుత్వంలో జగన్‌గారు జీవోలు ఇచ్చి, అప్రూవల్‌ పూర్తి చేసిన పనులన్నింటినీ నేడు చంద్రబాబు ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటూ ’క్రెడిట్‌ చోరీ’ చేస్తోందని వారు గుర్తు చేశారు. పట్టాభిషేకాల పేరుతో పాత పథకాలను తమవిగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని, ప్రజలు ఈ అబద్ధాలను నమ్మే స్థితిలో లేరని తేల్చి చెప్పారు.
    రాజధాని ప్రాంతంలో పేదల కోసం కేటాయించిన 1402 ఎకరాల్లో సుమారు 50,793 మందికి జగన్‌గారు ఇళ్ల పట్టాలు ఇస్తే.. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్‌ ధ్వజమెత్తారు. పేదలు అక్కడ ఉండకూడదనే దుర్బుద్ధితోనే చంద్రబాబు ఈ చర్యలకు పాల్పడ్డారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు  దుయ్యబట్టారు. 
ప్రెస్‌మీట్‌లో వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్‌ ఇంకా ఏమేం మాట్లాడారంటే..:

జగన్‌గారి హయాంలో 17,005 లేఅవుట్ల నిర్మాణం:
    వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, వాటి కోసం పెద్ద ఎత్తున లేఅవుట్లను అభివృద్ధి చేయడం జరిగింది. మొత్తం 17,005 లేఅవుట్లు నిర్మించి, వాటిలో మౌలిక వసతుల కోసం దాదాపు రూ.32,900 కోట్లు ఖర్చు చేశాం. పేదలకు కేవలం స్థలం ఇవ్వడం మాత్రమే కాకుండా, ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఆ కుటుంబానికి విలువైన ఆస్తి సమకూరేలా కాలనీలను అభివృద్ధి చేయాలన్నది గత మా ప్రభుత్వ లక్ష్యం. పేదల ఇళ్ల విషయంలో జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగించకుండా, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొత్త కార్యక్రమాలు చేపడుతోంది.

ఎన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చారు? ఎన్ని లేఅవుట్లు అభివృద్ధి చేశారు?:
    పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పడం కంటే, ఎన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చారు? ఎన్ని లేఅవుట్లు అభివృద్ధి చేశారు? ఎంతమంది పేదలకు ఇళ్లు అందాయి? కాలనీల్లో ఎలాంటి మౌలిక వసతులు కల్పించారు? అనే వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలి. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులను పూర్తి చేయకుండా వదిలేసి, ఇప్పుడు కొత్తగా పేదలపై ప్రేమ ఉన్నట్లు ప్రచారం చేసుకోవడం సరికాదు. 

చిత్తశుద్ధి ఉంటే జగనన్న కాలనీలను పూర్తి చేయండి:
    పేదల ఇళ్ల అంశాన్ని రాజకీయ ప్రచారానికి పరిమితం చేయకుండా, వారికి వాస్తవంగా ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు, లేఅవుట్ల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పేదల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పటికీ నిలబడుతుంది. వారి భూములు, ఇళ్లు, హక్కులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా పార్టీ అండగా ఉంటుంది. జగన్‌ గారి హయాంలో పేదలకు జరిగిన మేలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పేదలకు జరుగుతున్న కీడు ఏమిటో ప్రజలు గమనిస్తున్నారు.
    విశాఖపట్నంలో, విజయవాడలో ఇళ్ల పట్టాల పేరుతో నిర్వహించిన కార్యక్రమాలు పేదల కోసం ప్రభుత్వం చేసిన వాస్తవ పనులకు నిదర్శనం కాదు. పేదలకు నిజంగా ఇళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే అభివృద్ధి చేసిన జగనన్న కాలనీల పరిస్థితిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

జగన్‌ గారి పథకాలను కాపీ కొడుతున్నాడు.
:వెలంపల్లి శ్రీనివాస్‌. మాజీ మంత్రి.

– చంద్రబాబు నాయుడు తన సీనియారిటీని చెప్పుకుంటూ జగన్‌ గారి సంక్షేమ పాలనను కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పదే పదే అబద్ధాలు ఆడుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీహయాంలోనే అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇంటి హక్కు కల్పించామని నేను స్పష్టం చేస్తున్నాను. విజయవాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎవరికీ ఇబ్బంది లేకుండా సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ పరిపాలన సాగింది. కానీ అమరావతిలో పేదల కోసం కేటాయించిన వేలాది ఇళ్ల పట్టాలను కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా రద్దు చేసింది. ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌ అని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజం.

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో పంచిన ఇళ్ల పట్టాలు.
:మల్లాది విష్ణు. మాజీ ఎమ్మెల్యే.

– ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి, ఎన్నికల ముందు ప్రజలను మబ్బే పెట్టడానికే ప్రభుత్వం రకరకాల పేర్లతో అబద్ధాలు ప్రచారం చేస్తోంది. విశాఖపట్నంలో తాగునీటి సమస్యలను పరిష్కరించలేని ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? వైయ‌స్‌ జగన్‌ హయాంలో క్యాబినెట్‌ అప్రూవ్‌తో జీవోలు ఇచ్చి వేలాది మందికి పట్టాలు ఇస్తే, నేడు చంద్రబాబు ప్రభుత్వం అవే పనులను తాము చేసినట్లు ’క్రెడిట్‌ చోరీ’ చేస్తోంది. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో 27,000 మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చి పనులు పూర్తి చేసిన ఘనత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానిదే. పాత పట్టాలకే కొత్త రంగులు అద్ది ప్రజలను మోసం చేయాలని చూస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కూటమి ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన మూల్యం చెల్లించక తప్పదు. 

స్థానిక సంస్థల ఎన్నికల కోసం డ్రామాలు 
:దేవినేని అవినాష్‌. ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు.

– స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కూటమి ప్రభుత్వం ’పట్టాభిషేకం’ పేరుతో కొత్త డ్రామాలు ఆడుతోంది. విజయవాడ నగరంలో, ఎన్టీఆర్‌ జిల్లాలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకున్న ఘనత కేవలం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. అధికారంలోకి రాగానే అమరావతి ప్రాంతంలో పేదలు ఉండకూడదనే దుర్బుద్ధితోనే చంద్రబాబు ఆ ఇళ్ల పట్టాలను రద్దు చేశారు. మేము అధికారంలో ఉన్నప్పుడు వేలాది మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి సంక్షేమాన్ని అందిస్తే, నేడు ఈ ప్రభుత్వం వాటిని విస్మరించింది. ఇచ్చిన హామీల అమలు గురించి మాట్లాడకుండా కేవలం వైయ‌స్ఆర్‌సీపీ పై విమర్శలు చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. ప్రజలందరూ కూటమి మోసాలను గమనిస్తున్నారు, త్వరలోనే వారికి తగిన బుద్ధి చెబుతారు.

Back to Top