బీసీ రిజ‌ర్వేష‌న్ల పేరుతో చంద్ర‌బాబు డ్రామాలు  

రాజకీయ లబ్ధి కోసమే జీవోల పేరుతో బీసీలను మోసం చేసే కుట్ర

మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఫైర్ 

శ్రీకాకుళంలోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు 

కోర్టులు కొట్టేస్తాయ‌ని జీవో ఇచ్చిన‌ప్పుడే జ‌గ‌న్ గారు హెచ్చ‌రించారు 

34% రిజర్వేషన్‌పై ప్ర‌భుత్వం న్యాయపరమైన స్పష్టత ఇవ్వాలి 

బీసీలకు జీవోలు కాదు.. నిజమైన రాజకీయ ప్రాతినిధ్యం కావాలి 

నిజంగా మేలు చేయాలంటే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అమ‌లు చేసి చూపించాలి

చంద్ర‌బాబుకి మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు స‌వాల్ 

శ్రీకాకుళం: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పేరుతో కూటమి ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ క్రీడలు, మోసపూరిత వైఖరిపై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరును నిలదీశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులు స్పష్టంగా ఉన్నప్పటికీ, కేవలం రాజకీయ లబ్ధి కోసమే మళ్లీ జీవోల పేరుతో బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. న్యాయపరమైన అంశాలపై స్పష్టత లేకుండా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు మాయ మాట‌ల‌తో మ‌భ్య‌పెట్టి మోసం చేసే కుట్ర‌కు తెర‌లేపాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీసీలకు నిజంగా 34 శాతం రాజకీయ ప్రాతినిథ్యం కల్పించాలనే చిత్తశుద్ధి ఉంటే, కేవలం జీవోలు, ప్రకటనలకే పరిమితం కాకుండా ఎన్నికల్లో పార్టీ తరఫున బీసీలకు అదే స్థాయిలో అవకాశాలు కల్పించాలని స‌వాల్ విసిరారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను ప్రభుత్వం గౌరవించాల్సిందే అన్నారు. 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన న్యాయపరమైన ఆధారాలు, రిజర్వేషన్ పరిమితిని ఎలా సమర్థిస్తారన్న అంశాలపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని వివరాలు కోరిందని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు కల్పించిన రాజకీయ ప్రాతినిథ్యాన్ని ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు గణాంకాలతో స‌హా వివరించారు.

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... 

కోర్టు తీర్పులు తెలిసే డ్రామాలు:

సుప్రీంకోర్టులో ఉండే తొమ్మిది మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం.. వివిధ కేటగిరీల రిజర్వేషన్లు అన్నీ కలిపి 50 శాతం మించకూడదు అనేది అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన అత్యున్నత తీర్పు. ఇది దేశంలో అమల్లో ఉంది. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా బాగా తెలుసు. అయినప్పటికీ, ఏపీలో మళ్లీ 34శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ జీవో ఇచ్చి అమలు చేస్తామని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఈ జీవో ఇచ్చిననాడే మేము స్పష్టంగా చెప్పాం.. ఇది రాజ్యాంగ ధర్మాసనం తీర్పునకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి కోర్టులో నిలబడదని, కొట్టేస్తారని ముందే చెప్పాం. ఇది తెలిసి కూడా ఇలాంటి అసాధ్యమైన జీవోలు ఇచ్చి హడావుడి చేయడం కేవలం ప్రజలను, ముఖ్యంగా బీసీలను మోసగించే చర్య కాక వేరే ఏమవుతుంది? రేపో మాపో సుప్రీంకోర్టు కూడా దీన్ని కొట్టేస్తుందని తెలిసినా కావాలనే ఈ నాటకాలు ఆడుతున్నారు. అమాయకులైన బీసీలను మోసం చేయడానికి ఇదొక ఆయుధంగా వాడుకుంటున్నారు.

నిజమైన ప్రేమ ఉంటే ఇప్పుడు అమలు చేసి చూపించండి:

మీకు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే, 34శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఉంటే.. ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసి చూపించండి! మీకంటే ముందు ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వైఎస్ జగన్ గారు బీసీలకు ఏకంగా పదవుల్లో ఎలా పెద్దపీఠ వేసి చూపించారో చూడండి. 

వైఎస్సార్సీపీ హయాంలో బీసీలకు రాజ్యాధికారం: 

రాష్ట్రంలోని మొత్తం 13 మేయర్ స్థానాల్లో ఏకంగా 9 స్థానాలు (69%) బీసీలకే కేటాయించి వైఎస్సార్‌‌సీపీ చరిత్ర సృష్టించింది.
13 జెడ్పీలలో 6 (46%) బీసీలకు ఇవ్వడం జరిగింది.
14 రాజ్యసభ స్థానాల్లో 4 (36%), అలాగే లోక్‌సభ పోటీల్లో 25 స్థానాలకు గాను 11 (44%) బీసీలకే కేటాయించారు.
ఎమ్మెల్సీలలో 48%, మున్సిపల్ చైర్‌పర్సన్‌లలో 53%, మండల పరిషత్తులలో 68% మేర బీసీలకు ప్రాతినిధ్యం కల్పించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే.

చంద్రబాబువి కేవలం మాటలే.. చేతలు శూన్యం: 

మంత్రివర్గంలోనూ, ఉన్నత పదవుల్లోనూ బీసీలను ఎప్పుడైనా సమానంగా గౌరవించారా? కేవలం మాటలు చెప్పడం, జీవోల పేరుతో కాలయాపన చేయడం తప్ప బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. నిజమైన సామాజిక న్యాయం కేవలం వైఎస్సార్సీపీ  అధినాయకుడు వైఎస్ జగన్ గారి హయాంలోనే సాధ్యమైంది. మోసపూరిత మాటలతో మిమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నవారి పట్ల బీసీ సోదరులు ఐక్యంగా అప్రమత్తంగా ఉండాలి. మనల్ని వంచించే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.
 

Back to Top