జల్‌ జీవన్‌ మిషన్‌ సభ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం

 జగన్‌ హయాంలో పూర్తయిన పనులకు కూటమి ప్రభుత్వం క్రెడిట్‌ కొట్టేస్తోంది.. 

దమ్ముంటే కడప, ప్రొద్దుటూరు అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలి: రవీంద్రనాథ్‌రెడ్డి

వైయ‌స్ఆర్ జిల్లా : ప్రొద్దుటూరులో కూటమి ప్రభుత్వం నిర్వహించిన జల్‌ జీవన్‌ మిషన్‌ సభ కేవలం ప్రచారం కోసమే జరిగిందని వైయ‌స్ఆర్‌సీపీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. కడప జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సభ మొత్తం వైఎస్‌ జగన్‌ను విమర్శించడానికే పరిమితమైందని, గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తయిన అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం క్రెడిట్‌ తీసుకుంటోందని అన్నారు.

వైఎస్‌ జగన్‌ హయాంలోనే ఇంటింటికీ తాగునీటి ప్రాజెక్టులు, పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందని రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు–మైలవరం రిజర్వాయర్‌ తాగునీటి ప్రాజెక్టు పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయని, 43 ఎంఎల్‌డీ సామర్థ్యం, 17 ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, 40 కిలోమీటర్ల పైప్‌లైన్‌ పనులు నాలుగేళ్ల క్రితమే పూర్తయ్యాయని పేర్కొన్నారు. మైలవరం తాగునీటి ప్రాజెక్టు టెస్ట్‌ ట్రయల్స్‌ 2022లోనే విజయవంతంగా పూర్తయినట్లు మెగా ఇంజనీరింగ్‌ సంస్థ వెల్లడించిందని చెప్పారు. ప్రొద్దుటూరులో తాగునీటి కోసం రూ.150 కోట్లు, వైఎస్సార్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి రూ.65 కోట్లు, మార్కెట్‌ యార్డుకు రూ.53 కోట్లు, నూతన బస్టాండ్‌కు రూ.5 కోట్లు ఖర్చు చేశామని, ఆర్టీపీసీకి దగ్గరి దారి కల్పించేందుకు రూ.53 కోట్లతో రామేశ్వరం బ్రిడ్జి నిర్మించామని వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో తాగునీటి, గృహ నిర్మాణ రంగాల్లో చేపట్టిన పనులను కూడా రవీంద్రనాథ్‌రెడ్డి ప్రస్తావించారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం రూ.700 కోట్లతో తాగునీటి ప్రాజెక్టును పూర్తి చేశామని, డోన్‌, నెల్లూరు సహా ఐదు ప్రాంతాల్లో 85 శాతానికి పైగా తాగునీటి పనులు పూర్తి చేశామని అన్నారు. 95.44 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు అందించేందుకు చర్యలు చేపట్టామని, రూ.17,717 కోట్లు ఖర్చు చేసి 7 లక్షల ఇళ్లను పూర్తి చేశామని తెలిపారు. 31.9 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, రాష్ట్రవ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.

వెలుగొండ ప్రాజెక్టును వైయ‌స్సార్‌ 80 శాతం పూర్తి చేస్తే, వైఎస్‌ జగన్‌ దాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేశారని రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అమరావతి పేరుతో అధిక వ్యయాలు, ఉచిత ఇసుక పేరుతో జరుగుతున్న అక్రమాలపై కూడా ఆయన విమర్శలు చేశారు. ప్రజల ఇళ్లకు తాగునీరు అందించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం మద్యం మాత్రం ఇంటింటికీ చేరుస్తోందని ఆరోపించారు. పాత టెండర్లను రద్దు చేసి రీ-టెండర్లు పిలవడం వెనుక కమీషన్ల ఉద్దేశం ఉందని విమర్శించారు. కడప, ప్రొద్దుటూరు అభివృద్ధిపై కూటమి నేతలు తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు. 

Back to Top