గరివిడి: మండలంలోని కొండపాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బమ్మిడి కార్తీక్ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. వార్డు సభ్యుల అభ్యర్థులు కూడా తమ నామినేషన్లను సమర్పించారు. ఈ కార్యక్రమానికి గరివిడి జడ్పీటీసీ బొత్స పూజిత ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థులకు మద్దతు తెలిపారు. నామినేషన్ల సందర్భంగా గరివిడి, కొండపాలెం గ్రామాల్లో భారీ ర్యాలీ నిర్వహించడంతో పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధికి కట్టుబడిన అభ్యర్థులను గెలిపించండి స్థానిక అభివృద్ధికి కట్టుబడి ఉండే అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని జడ్పీటీసీ బొత్స పూజిత కోరారు. ఆమె హాజరుతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఆమె ఆశీస్సులతో కొండపాలెంలో అభ్యర్థుల విజయం ఖాయమని స్థానిక నాయకులు, అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బమ్మిడి అప్పలస్వామి, వాకాడ శ్రీను, రెడ్డి భారతి, వాకాడ గోపి, రెడ్డి గోవింద్, ఎడ్ల సూర్యారావు, మజ్జి లావణ్య, బమ్మిడి కృష్ణమ్మ, రేగుల సూరిబాబు, గరివిడి పట్టణ మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.