ప్ర‌జాస్వామ్యానికి పోలీసులే శ‌త్రువులుగా మారారు

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ధ్వ‌జం

ఎన్నిక‌ల అక్ర‌మాల‌పై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన అనంత‌రం అక్క‌డే మీడియాతో మాట్లాడిన వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు 

హైకోర్టు ఆదేశాలున్నా మాచర్లలో అభ్యర్థులపై పోలీసుల దాడులు, బెదిరింపులు

గుమ్మనూరు జయరాం అనుచరుల గన్‌ల బెదిరింపులతో గుంతకల్లు, గుత్తిలో భయానక పరిస్థితులు

జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుల దాడులు.. పెద్దారెడ్డి ఇంటి ధ్వంసంపై పోలీసుల ఉదాసీనత

కూట‌మి ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే స్థానిక సంస్థ‌ల ఎన్నికలు 

రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుకు పోలీసులు సహకరిస్తున్నారు 

ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి 

ఎస్ఈసీని డిమాండ్ చేసిన వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు

విజ‌య‌వాడ‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన పోలీసులు, ఎన్నికల అధికారులు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నిక‌ల అక్ర‌మాల‌పై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన అనంత‌రం వైఎస్సార్‌సీపీ నాయ‌కులు అక్క‌డే మీడియాతో మాట్లాడారు. 
 పల్నాడు జిల్లా మాచర్ల, గురజాలలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై దాడులు చేస్తూ, నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరించడం దారుణమని పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్ రెడ్డి ధ్వజమెత్తారు. గుంతకల్లు, గుత్తి ప్రాంతాల్లో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనుచరులు గన్‌లతో అభ్యర్థులను బెదిరిస్తూ, పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి, వాహనాల ధ్వంసం, దహనం జరిగినా పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోకుండా బాధితులపైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఎచ్చెర్లలో స్థానిక ఎమ్మెల్యే ఒత్తిళ్లతో సర్పంచ్ అభ్యర్థులను బెదిరిస్తూ, కిడ్నాప్‌లకు పాల్పడుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చెబుతున్న 93, 94 శాతం స్ట్రైక్ రేట్ ప్రజాస్వామ్యబద్ధంగా సాధించింది కాదని, రిగ్గింగ్, బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణల ఫలితమని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్, కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, పోలీసు అధికారులు హైకోర్టు ఆదేశాలను అమలు చేసి అభ్యర్థులకు రక్షణ కల్పించాలని, అక్రమాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. 
ఎస్ఈసీని క‌లిసిన వారిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి, విజ‌య‌వాడ మాజీ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, పార్టీ లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు మ‌ల‌సాని మ‌నోహ‌ర్ రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షుడు నారాయ‌ణమూర్తి, ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, బూత్ క‌మిటీ అధ్య‌క్షుడు సుధాక‌ర్ రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు, త‌దిత‌రులు ఉన్నారు. 

నాయ‌కులు ఎవ‌రెవ‌రు ఏం మాట్లాడారంటే...
 

అభ్యర్థులపై పోలీసుల దాడులు
- మలసాని మనోహర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసుల సహకారంతో అనేక అక్రమాలకు పాల్పడుతోంది. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా పోలీసులు వాటిని అమలు చేయడం లేదు. అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారి కాళ్లు, చేతులు విరగ్గొడుతూ, నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారు. గుంతకల్లు, గుత్తి ప్రాంతాల్లో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గన్‌లతో అనుచరులను వెంటబెట్టుకుని అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకోకపోతే కాల్చేస్తామని హెచ్చరిస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేసి దహనం చేసినా పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోవడం లేదు. బాధితులపైనే అక్రమ కేసులు పెట్టడం, పెద్దారెడ్డిని తన నియోజకవర్గంలో తిరగనివ్వకుండా నిర్బంధించడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోనూ స్థానిక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని సర్పంచ్ అభ్యర్థులను విత్‌డ్రా చేయించేందుకు దాడులు, కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ అక్రమాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. ఇప్పటికైనా పోలీసులు తమ వైఖరి మార్చుకోకపోతే ఎన్నికల ట్రిబ్యునల్ ద్వారా వారిని ప్రైవేటు పార్టీలుగా చేర్చి, న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాడతాం.

 
రిగ్గింగ్‌తో గెలిచి.. స్ట్రైక్ రేట్ పేరుతో చంద్రబాబు గొప్పలా?
- వరుదు కళ్యాణి, వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్సీ

రాష్ట్రంలో చంద్రబాబు కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారు, నామినేషన్లు వేసిన వారిని బలవంతంగా ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో హైకోర్టు అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించినా పోలీసులే వారిని కొడుతూ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేసినా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులపై చర్యలు తీసుకోవడం లేదు, బాధితులకే ఇబ్బందులు కలిగిస్తున్నారు. గుమ్మనూరు జయరాం వంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు ఒత్తిళ్లు తెస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు చెబుతున్న 93, 94 శాతం స్ట్రైక్ రేట్ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల ఫలితం కాదు, రిగ్గింగ్‌లు, అక్రమాల ద్వారా సాధించిన స్ట్రైక్ రేట్ అని గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు స్పందించి అభ్యర్థులకు స్వేచ్ఛగా నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలి, లేదంటే బాధ్యులైన అధికారులు, అక్రమాలను సమర్థిస్తున్న వారిపై న్యాయస్థానాల ద్వారా చర్యలు తీసుకునే వరకు పోరాడతాం.

పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తున్నారు 
- రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ మాజీ మేయర్

కార్పొరేషన్ ఎన్నికల నుంచి మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల వరకు కూటమి నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకులపై పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులు చేయడం, పోలీసులు లాఠీచార్జీలు, గన్‌ఫైరింగ్‌కు దిగడం చూస్తుంటే రాష్ట్రంలో పాలన ఎంత దుర్మార్గంగా సాగుతోందో అర్థమవుతోంది. మాచర్లలోని కారంపూడిలో హైకోర్టు ఆదేశాల ప్రకారం సర్పంచ్ అభ్యర్థులకు పోలీసులే రక్షణ కల్పించి నామినేషన్లు వేయించాలి. కానీ ఉదయం నుంచి పోలీస్‌స్టేషన్ దగ్గర ఉన్న అభ్యర్థులను ఎస్సైలు, సీఐలే బ్రెయిన్‌వాష్ చేస్తూ, మీకెందుకు గొడవ, నామినేషన్లు ఎందుకు అని చెప్పి విత్‌డ్రా చేయిస్తున్నారు. అసలు రెడ్‌బుక్ రాజ్యాంగానికి పోలీసు వ్యవస్థ సలాం చేస్తుందా? రెడ్‌బుక్ రాజ్యాంగం కోసమే ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా? నాయకులు ఒకవైపు బెదిరిస్తుంటే, పోలీసులు మరోవైపు బెదిరిస్తున్నారు, అయినా కలెక్టర్లు, ఎస్పీలు ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా పోలీసులు హైకోర్టు ఆదేశాలను గౌరవించి మా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించాలి, లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి బాధ్యులకు తగిన శిక్ష పడేలా పోరాడతాం.

అధికారులు నీతి, నియమాలతో పనిచేయాలి
- నలమారు చంద్రశేఖర్ రెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం అధ్యక్షుడు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు, రిటర్నింగ్ అధికారులు అనేక తప్పిదాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగిగా న్యాయంగా విధులు నిర్వహిస్తానని చేసిన ప్రమాణాన్ని గుర్తుపెట్టుకుని రాజ్యాంగం, చట్టాలకు అనుగుణంగా పనిచేయాలి. కారంపూడిలో సర్పంచ్ అభ్యర్థులను పోలీస్‌స్టేషన్‌లో ఉంచి, హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ నామినేషన్లు వేయకుండా ఒత్తిడి చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. నామినేషన్ సమయంలో అన్ని సర్టిఫికెట్లు స్వీకరించి సంతకాలు, స్టాంపులతో రసీదులు ఇచ్చిన రిటర్నింగ్ అధికారులు స్క్రూటినీ సమయంలో నాలుగు సర్టిఫికెట్లు లేవని చెప్పడం ఏమిటి, వాటికి పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదే. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పోలీసు అధికారులు, రిటర్నింగ్ అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారకుండా కనీసం ఈ కొద్ది రోజులైనా నిజాయితీగా పనిచేయాలి. మేము ఎవరికీ అనుకూలంగా పనిచేయమని అడగడం లేదు, అభ్యర్థులు నామినేషన్లు వేసి, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడాలని మాత్రమే కోరుతున్నాం.

ఎమ్మెల్యేల చెప్పుచేతుల్లో అధికారులు 
- కొమ్మూరి కనకారావు, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే సిగ్గేస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై ఎన్నిసార్లు ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదులు చేసినా, క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. మాచర్ల నుంచి శ్రీకాకుళం వరకు పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో సీఐలు, డీఎస్పీలు, రిటర్నింగ్ అధికారులు స్థానిక ఎమ్మెల్యేల చెప్పుచేతుల్లో పనిచేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగేవి అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం దుర్మార్గం. గ్రామాల అభివృద్ధి కోసం ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని కూడా ఎమ్మెల్యేలు అధికారులను అడ్డుపెట్టుకుని కాలరాస్తున్నారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని అపహాస్యం చేసే ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులంతా గమనించాలి. ఎన్నికలను అడ్డుకుంటున్న పోలీసు అధికారులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని, అభ్యర్థులు స్వేచ్ఛగా పోటీ చేసే పరిస్థితులు కల్పించాలి.

Back to Top