విజయవాడ :ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకుని సాగించిన అక్రమాలు, దౌర్జన్యాలపై శాసనమండలి వైయస్సార్సీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ శ్రీ అబ్దుల్ నజీర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, కల్పలత రెడ్డి, మొండితోక అరుణ్, రుహుల్లా, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, మేరుగ నాగార్జున, వైయస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గవర్నర్ ని కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను సైతం అమలు చేయకుండా, వైయస్సార్సీపీ అభ్యర్థులను కనీసం నామినేషన్ కూడా వేయనీయకుండా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించిన కూటమి ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదని వైయస్సార్సీపీ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న ఈ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతికి, పార్లమెంట్‌కు సిఫారసు చేయాలని వారు గవర్నర్‌ను కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో అనంతరం లోక్‌భవన్ వద్ద బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అనంతరం లోక్‌భవన్ వద్ద మీడియాతో మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని అరాచకాలు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ దఫా జరిగిన దారుణమైన ఘటనలు మునుపెన్నడూ జరగలేదని గౌరవ గవర్నర్ గారికి వివరించాము. ముఖ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగం గౌరవించకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దౌర్జన్య కాండ, దుశ్శాసన పర్వం కొనసాగించారు. ఎంతో శాంతియుతంగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఇలాంటి అరాచకాలు సృష్టించడం రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు. కలకాలం వాళ్లే అధికారంలో ఉండిపోతామన్న ఆలోచనతో ఇంత దౌర్జన్యాలు చేస్తున్నారు. రాత్రి పోతే పగలు వస్తుంది, పగలు పోతే రాత్రి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పెట్రోల్ బాంబుల దాడులు.. పోలీసుల వింత వాదన: తాడిపత్రి, కడప, పుంగనూరులలో దాడులు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి మీద జరిగిన దాడులు అత్యంత దారుణం. తెలుగుదేశం కార్యకర్తలని చెప్పుకునే గూండాలు ఏకంగా పెట్రోల్ బాంబులతో దాడులు చేస్తారా? ఇదేనా సంస్కృతి?. పెద్దారెడ్డి ఇంటిపై దాడులకు పాల్పడితే... క్రాకర్స్ తెచ్చుకున్నారు కాబట్టి వాటి వల్లే కార్లు, వెహికల్స్ కాలిపోయాయని డీఎస్పీ స్టేట్మెంట్ ఇవ్వడం సిగ్గుచేటు. ప్రజలను, ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. పోలీసులను, గూండాలను కాపలా పెట్టుకుని చట్టాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఎన్నికలు జరిపారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరాం: రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిపామని ఈ ప్రభుత్వం చెప్పగలదా? నామినేషన్ దగ్గర నుంచి స్క్రూటినీ, పోలింగ్, కౌంటింగ్ వరకు ఎక్కడ చూసినా అల్లర్లు, పోలీసు జులుం, భయభ్రాంతులకు గురిచేయడమే కనిపించింది. మీ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా, ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండడానికి వీలు లేదు. మీరు సుప్రీంకోర్టు న్యాయకోవిదులుగా పనిచేశారు కాబట్టి రాజ్యాంగ విలువలు మీకు తెలుసు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతికి, పార్లమెంట్‌కు సిఫారసు చేయమని గవర్నర్ గారిని కోరాము. మాకు అధికారం వెంటనే చేతికి రావాలనే ఆతృత లేదు కానీ, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చెడు సంప్రదాయాలు పెడితే రాబోయే తరాలకు ఏం సందేశం ఇస్తాం?. దమ్ముంటే ఎన్నికలు రద్దు చేసి మళ్లీ నిర్వహించండి: మీరు వీరులు, శూరులు అనుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా ఎన్నికలు జరపండి. లేదా ఇప్పటివరకు జరిగిన మొత్తం ఎన్నికలను రద్దు చేసి మళ్లీ కొత్తగా ఎన్నికలు జరపండి. అంతే తప్ప మీరే నామినేట్ చేసుకుని ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదు. గవర్నర్ గారు అన్ని విషయాలు విన్నారు, మేము చూపించిన ఆధారాలన్నీ చూశారు. ఆయన పరిధిలో ఉన్నంతవరకు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)తో మాట్లాడి ఉపయోగం లేదు. ఆయనను మేము చాలాసార్లు కలిశాం. గట్టిగా అడిగితే అవసరమైతే రాజీనామా చేసి వెళ్లిపోతాను అంటున్నారు. ఆయన రాజీనామా చేస్తే మాకేం వస్తుంది? రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థగా ఎన్నికల చట్టం ప్రకారం నడిపించాలి కదా!. డీజీపీ డ్యూటీ చంద్రబాబు, లోకేష్ చేస్తున్నారు: రాష్ట్రంలో డీజీపీ గానీ, పోలీసు అధికారులు గానీ ఎవరూ తమ విధిని నిర్వర్తించడం లేదు. పోలీసులు ఎస్ఈసీ మాట వినడం లేదు. డీజీపీ ఉద్యోగం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చేస్తున్నాడు. లా అండ్ ఆర్డర్ డీజీపీగా వారి తనయుడు లోకేష్ ఉన్నాడు. ఎక్కడా చూడని చోద్యం చూస్తున్నాం. నేను 15 సంవత్సరాలు మంత్రిగా చేశాం, ప్రతిపక్షంలో ఉండి కూడా ఎన్నో ఎన్నికలు చూశాం కానీ ఎప్పుడూ ఇలాంటి ఎన్నికలు చూడలేదు. చంద్రబాబు అందాన్ని చూసి ఓటేశారా?: కొట్టి, తిట్టి నామినేషన్లు వేయకుండా ఆపేయడం, పోలీసులను అడ్డుపెట్టుకుని ఆపేయడం ప్రభుత్వం చేసిన మంచా? విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో మధ్యాహ్నం ఒంటి గంటకు ఎన్నిక జరిపి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్‌ను ఎన్నుకున్న తర్వాత, ఎమ్మెల్యే, ఆమె భర్త వచ్చి గొడవ పెట్టారని ఆర్వో రాత్రి 9 గంటల తర్వాత ఎన్నిక క్యాన్సిల్ చేసి మళ్లీ ఎన్నిక పెట్టారు. ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగాయని చెప్పడానికి చంద్రబాబుకు ఇంకెక్కడి హక్కు ఉంది? చంద్రబాబు ముఖారవిందం చూసి, ఏడు రాష్ట్రాలకు అందగాడని ప్రజలు ఓట్లు వేశారా? ఆయన అందమే కారణమైతే మళ్లీ ఎన్నికలు పెట్టండి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చని వ్యక్తికి ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారు?. వాపును చూసి బలుపు అనుకుంటున్నారు: మరోవైపు 92 శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందని చెప్పుకుంటున్నారు.. ఎవరినీ నామినేషన్ వేయనీయకుండా అడ్డుకుని, లోపల వాళ్లు ఒక్కరే ఉండి నామినేట్ చేసుకుంటే 100 శాతం స్ట్రైక్ రేట్ వస్తుందని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని.. విజయనగరం జిల్లాలో బీసీలకు ఇవ్వాల్సిన జడ్పీ చైర్పర్సన్ స్థానాన్ని ఓసీలకు ఇచ్చి ఇవాళ పెద్ద కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే విజయనగరం జిల్లాలో బీసీ నాయకులను మాట్లాడాలని సవాల్ చేశారు. అధికారం ఉంది కదాని ఇష్టారీతిన చేసుకోవచ్చు కానీ, రెండు రోజులు ఆగితే న్యాయస్థానాలే అసలు నిజాలు చెబుతాయని ఆయన తేల్చి చెప్పారు.