తాడేపల్లి: దేవాదాయ శాఖలో నిరుద్యోగ యువత నుంచి రూ.7 కోట్లు వసూలు చేసిన వ్యవహారం వెనుక పెద్ద కుంభకోణం ఉందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఆరోపించారు. శనివారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ‘రుక్మిణి కోట రహస్యం’ పేరుతో బయటకు వస్తున్న వ్యవహారంలో నకిలీ ఆఫర్ లెటర్లు, సర్వీస్ బుక్స్, డిజిటల్ సంతకాల ఫోర్జరీ వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. దేవాదాయ శాఖలో గ్రేడ్-3 ఉద్యోగాన్ని విక్రయించి, అసిస్టెంట్ కమిషనర్ సంతకంతో నకిలీ ఆఫర్ లెటర్ ఇచ్చారని, అభ్యర్థి వేలిముద్రలు తీసుకుని సర్వీస్ బుక్ కూడా తయారు చేశారని ఆయన పేర్కొన్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన వ్యక్తి పేరు ‘ఏపీ టెంపుల్స్’ ప్రభుత్వ వెబ్‌సైట్ డేటాబేస్‌లో గ్రేడ్-3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎలా నమోదైందని ప్రశ్నించారు. నెలకు రూ.30 వేల జీతానికి పనిచేసే ధరణి కృష్ణ ఒక్కరే ఉన్నతాధికారుల డిజిటల్ సంతకాలు ఫోర్జరీ చేసి ప్రభుత్వ డేటాబేస్ మార్చగలదా అని నిలదీశారు. నిరుద్యోగుల నుంచి వసూలైన రూ.7 కోట్లు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయో, 36 మంది బాధితుల వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదో తేల్చాలని యనమల కోరారు. కైరాన్ సంస్థకు చెందిన మంగళగిరి, లండన్ బ్యాంకు ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని, ఈ వ్యవహారంపై సీబీసీఐడీకి బదులుగా సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ధరణి కృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి మూడు రోజుల పాటు అదృశ్యం చేసి కొట్టారని ప్రభుత్వ ఆసుపత్రి ఎంఎల్‌సీ రిపోర్ట్‌లో ఉందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ ఆసుపత్రి ఇంటిమేషన్ సర్టిఫికెట్‌తో పెనమలూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదు తీసుకోలేదన్నారు. తనపై 18 కేసులు పెట్టి జైలుకు పంపినా తాను భయపడలేదని, ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదని, కైరాన్ సంస్థకు సంబంధించిన రికార్డులు, పత్రాలతోనే విషయాలను ప్రజల ముందుకు తెచ్చామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, రుక్మిణి కోటకు నిజాయితీ ఉంటే ఈడీ లేదా సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించాలని యనమల సవాల్ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం, హోంశాఖ విచారణను ఏకపక్షంగా నడిపించకుండా పూర్తి స్థాయి స్వతంత్ర దర్యాప్తు జరిపితేనే వాస్తవాలు బయటపడతాయని అన్నారు.