అవినాష్‌రెడ్డిపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి

ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి?: డాక్టర్‌ మద్దిల గురుమూర్తి

తిరుప‌తి: కడప ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తిరుపతి ఎంపీ డాక్టర్‌ మద్దిల గురుమూర్తి తెలిపారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఎంపీపై పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని పేర్కొన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, బెదిరింపులు, పెట్రోల్‌ బాంబులు, రాడ్లు, కర్రలతో దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యంపై దాడేనని గురుమూర్తి అన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరిస్తూ దాడులు జరగడం మరింత ఆందోళనకరమన్నారు. ఎంపీలు స్వయంగా సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ అభ్యర్థుల నామినేషన్ల కోసం వెళ్లాల్సిన పరిస్థితి రావడం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంతగా దిగజారిందో చూపిస్తోందన్నారు.

ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయాలంటే భయపడే పరిస్థితులు సృష్టించడం ప్రజల ఎన్నికల హక్కును కాలరాయడమేనని గురుమూర్తి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తూ నియంతృత్వ పాలన సాగుతోందని మండిపడ్డారు. ఎన్నికల హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాత విచారణ జరిపించాలని, రాజ్యాంగబద్ధ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించి దాడులకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Back to Top