అనంతపురం: తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై హత్యాయత్నం ఘటన కలకలం రేపింది. పెద్దారెడ్డి ఇంటి వద్ద టీడీపీ వర్గీయులు పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని వైయస్ఆర్సీపీ శ్రేణులు పేర్కొన్నాయి. పోలీసుల సమక్షంలోనే దాడులు? తాడిపత్రి డీఎస్పీ, సీఐ సమక్షంలోనే జేసీ వర్గీయులు పెట్రోల్ బాంబులతో దాడులకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. పెద్దారెడ్డి ఇంటి వద్ద దాడులను టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి స్వయంగా ప్రోత్సహించారని వైయస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపించాయి. ఈ ఘటనపై తన హత్యకు కుట్ర జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధితులపైనే కేసులా? తాడిపత్రి ఘటనకు సంబంధించి పోలీసులు మొత్తం నాలుగు కేసులు నమోదు చేసినప్పటికీ, దాడికి గురైన వైయస్ఆర్సీపీ శ్రేణులపైనే అక్రమ కేసులు బనాయించారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు విషయంలో పోలీసులు వెనుకడుగు వేస్తున్నారని మండిపడ్డారు. తాడిపత్రిలో జరిగిన దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి అసలు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ శ్రేణులు కోరుతున్నాయి.