తాడేపల్లి: రామాయపట్నం పోర్టుకు కస్టమ్స్ గుర్తింపు రావడంపై వైయస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధి ఫలిస్తోందంటూ ఆయన ‘ఎక్స్’ వేదికగా శుక్రవారం పోస్టు చేశారు. ‘ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి పోర్టులే చోదక శక్తులు. పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణే ఏపీకి అతిపెద్ద పెట్టుబడుల ఆకర్షణ. రామాయపట్నం పోర్టుకు కస్టమ్స్ గుర్తింపు కీలక మైలురాయి. దిగుమతులు, ఎగుమతుల కోసం కస్టమ్స్ పోర్టుగా సీబీఐసీ నోటిఫై చేసింది. మా ప్రభుత్వ హయాంలో పోర్టుల నిర్మాణాలను రూపొందించాం. ఏపీలోని విస్తారమైన తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని నాలుగు పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల నిర్మాణమే లక్ష్యంగా ప్రణాళికను రూపొందించాం’ అంటూ వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. పోర్టుల ఆధారంగా పారిశ్రామికీకరణను ముందుకు తీసుకెళ్లాలన్నది మా ఆలోచన.. ‘ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకునేందుకు, తీరం వెంబడి నాలుగు పోర్టులు (రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే), 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల ప్రతి 50 కిలోమీటర్లకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. రామాయపట్నం పోర్టును ప్రధాన వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతూ, పోర్టుల ఆధారంగా పారిశ్రామికీకరణను ముందుకు తీసుకెళ్లాలన్నది మా ఆలోచన. అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. పోర్టు పరిసరాల్లో బీపీసీఎల్ భారీ రిఫైనరీ సముదాయం, ఇండోసోల్ సోలార్ సమీకృత తయారీ కేంద్రంతో పాటు మరెన్నో భారీ పెట్టుబడి ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగావకాశాలతో అక్కడొక పారిశ్రామిక వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. మా పనితీరుకు నిదర్శనం ఏమిటంటే.. దావోస్ నుంచి సీఐఐ సదస్సుల వరకు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుగారు ఎక్కడికెళ్లినా పెట్టుబడులను ఆకర్షించేందుకు చూపిస్తున్నది మేం మొదలుపెట్టిన ఈ పోర్టులనే’ అని పేర్కొన్నారు. రామాయపట్నం పోర్టుకు కీలక మైలురాయి.. పోర్టుల ఆధారంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. మౌలిక సదుపాయాలపై దార్శనికతతో మేం ప్రారంభించిన ప్రణాళికే నేడు పెట్టుబడులకు అతిపెద్ద అవకాశంగా మారుతోంది. రామాయపట్నం పోర్టుకు ఇది కీలక మైలురాయి. దిగుమతులు, ఎగుమతుల కోసం రామాయపట్నం పోర్టును కేంద్ర పరోక్ష పన్నులు, మరియు కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) అధికారికంగా ప్రకటించింది. మా హయాంలో అడుగులు పడిన సముద్ర రవాణా మౌలిక సదుపాయాల ప్రణాళికను సాకారంచేసే దిశలో ఇది మరో కీలక ఘట్టం.