ప్రజాస్వామ్యాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు 

 బీసీ రిజర్వేషన్లను కాలరాస్తూ బలహీన వర్గాలకు చంద్రబాబు ద్రోహం

 ఈ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి 

 బొత్స సత్యనారాయణ డిమాండ్ 

 విజ‌య‌న‌గ‌రం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన శాస‌న‌మండ‌లి విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. 

 పూసపాటిరేగ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ 

 ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రం ఇచ్చాక మళ్లీ ఎన్నిక నిర్వహించడం ఏమిటి?

 వైఎస్ జగన్ కుటుంబంపై ట్రోలింగ్ పై లోకేష్, పవన్ ఎందుకు మౌనం?

 ప్రెస్ మీట్ లో బొత్స సత్యనారాయణ ఫైర్ 

విజయనగరం: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా చేతుల్లోకి తీసుకుందని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, పూసపాటిరేగ మండల పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నిక, జిల్లా పరిషత్ బీసీ స్థానం వంటి అంశాలపై ప్రభుత్వ తీరును నిలదీశారు. 19వ తేదీన మధ్యాహ్నం పూసపాటిరేగ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షునిగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రం ఇచ్చిన తర్వాత, అదే రోజు రాత్రి 9 గంట‌ల త‌ర్వాత ఫోన్ చేసి 20వ తేదీ ఉదయం 11 గంటలకు మళ్ళీ ఎన్నిక నిర్వహిస్తామని ఇంటికి నోటీసు పంపడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని తేల్చి చెప్పారు. ధ్రువీకరణ పత్రం ఇచ్చిన తర్వాత అభ్యంతరం ఉంటే న్యాయస్థానానికి వెళ్లాలి కానీ, అధికార దుర్వినియోగంతో ఇలా మళ్ళీ ఎన్నిక ఎలా పెడతారని ప్రశ్నించారు. దీంతోపాటు జిల్లా పరిషత్ చైర్ పర్స‌న్‌గా బీసీ మహిళకు కేటాయించిన స్థానంలో బీసీ మహిళే కూర్చోనివ్వ‌కుండా అన్యాయం చేశార‌ని, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కుల కోసం న్యాయస్థానంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను చేతుల్లోకి తీసుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, పోలీసులూ ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో విఫలమయ్యారని అన్నారు. ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా భ్ర‌ష్టుప‌ట్టించిన ఈ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 
     ఎంపీ అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాలు క‌ర్ర‌లు, రాళ్లు, పెట్రోల్ బాంబుల‌తో చేసిన దాడిని బొత్స ఖండించారు. చంద్ర‌బాబు పాల‌న జంగిల్ రాజ్‌ని త‌ల‌పిస్తోంద‌ని.. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను తమ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం ప్రమాదకరమైన సాంప్రదాయమని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... 

ఏ రూల్ ప్ర‌కారం మ‌ళ్లీ ఎన్నిక నిర్వ‌హిస్తారు?: 
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ఎన్నికల ప్రక్రియను తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకుంటూ ఎన్నికల అధికారులు, ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు తెస్తోంది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడి ఎన్నికలో జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనం. నవంబర్ 19న ఎన్నికల అధికారి సమక్షంలో ఎన్నిక నిర్వహించి, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అధికారికంగా ధ్రువీకరణ పత్రం అందజేశారు. అయితే అదే రోజు రాత్రి మరోసారి నోటీసు జారీ చేసి, నవంబర్ 20న ఉదయం 11 గంటలకు తిరిగి ఎన్నిక నిర్వహిస్తామని చెప్పడం ఏ ప్రజాస్వామ్య సంప్రదాయం? ఎన్నిక పూర్తయి, ధ్రువీకరణ పత్రం ఇచ్చిన తర్వాత అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి తప్ప మళ్లీ ఎన్నిక నిర్వహించడం ఏమిటి? ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, ఎంపీల కుటుంబ సభ్యుల ఒత్తిళ్లతో ఎన్నికల వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు.  ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు సాధించుకోవడానికి పోలీసు యంత్రాంగాన్ని, ఎన్నికల అధికారులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన వ్యవస్థలను అధికార పార్టీ తమ చేతుల్లోకి తీసుకోవడం ఆందోళన క‌లిగించే అంశం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలను ఈ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్న పరిస్థితులను ఇప్పుడే చూస్తున్నాం. 

పరిష‌త్‌లో బీసీల‌కు ప్ర‌భుత్వం తీర‌ని ద్రోహం:  
జిల్లా పరిషత్‌లో బలహీన వర్గాలకు కేటాయించిన బీసీ స్థానాన్ని కూడా అన్యాయంగా చేజిక్కించుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జిల్లాలో కాపులు, వెలమలు, యాదవులు సహా వివిధ బలహీన వర్గాల హక్కులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. బీసీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కులను కాలరాయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం బలహీన వర్గాలకు ద్రోహం చేస్తోంది. బీసీ మహిళకు కేటాయించిన స్థానంలో బీసీ మహిళే పదవిని చేపట్టాలి, ఇతరులు అన్యాయంగా ఆ స్థానాన్ని ఆక్రమించడానికి వీల్లేదు. బీసీ సర్టిఫికెట్లు ఏ విధంగా పొందారు, వాటి వెనుక ఉన్న వాస్తవాలేమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మాకు పదవులపై ఆశ లేదు, పదవులు పోయినా నష్టం లేదు, కానీ చంద్రబాబు బలహీన వర్గాలను ఏ విధంగా మోసం చేస్తున్నారన్నది ప్రజలకు తెలియాలి. పూసపాటిరేగ ఎన్నికల వ్యవహారంతో పాటు జిల్లా పరిషత్‌లో బీసీ రిజర్వేషన్ స్థానానికి సంబంధించిన అంశాలపై న్యాయస్థానంలో పోరాటం చేస్తాం, న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది.

జ‌గ‌న్ గారి కుటుంబ స‌భ్యుల‌ను సోష‌ల్ మీడియాలో తిడుతుంటే క‌నిపించ‌దా?:     
వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన వీడియోలు, ట్రోలింగ్ జరుగుతున్నా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? నాడు తన భార్య‌ను  అవ‌మానించార‌ని చంద్ర‌బాబు తీవ్రంగా స్పందించారు. మరి ఇతరుల కుటుంబ సభ్యులు, భార్యలు, కుమార్తెల గౌరవం విషయంలోనూ అదే బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం లేదా? రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని పెయిడ్ ఆర్టిస్టులతో ట్రోలింగ్ చేయించడం హేయమైన చర్య. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి చర్యలను ఖండించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. ఈ వ్యవహారాలన్నింటినీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కుప్పకూలిన పరిస్థితిని వివరించి కూటమి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు, అధికార యంత్రాంగానికి, మీడియాకు కూడా ఉంది, ఈ దౌర్జన్యాలు, అక్రమాలపై వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటం కొనసాగిస్తుందని శాస‌న‌మండ‌లి విప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు.

Back to Top