నామినేషన్ల తిరస్కరణపై చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ధర్నా

తిరుప‌తి కలెక్టర్‌ కార్యాలయం ఎదుట శాంతియుత‌ నిరసన 

 తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుతో సర్పంచ్‌, వార్డు స్థానాలకు దాఖలు చేసిన నామినేషన్లను నిబంధనలకు విరుద్ధంగా తిరస్కరిస్తున్నారని ఆరోపిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధ‌ర్నా నిర్వ‌హించారు. కలెక్టర్‌ ఛాంబర్‌ ముందు అంబేద్కర్‌ చిత్రపటంతో శాంతియుతంగా బైఠాయించి ఎన్నికల అధికారుల తీరును నిరసించారు.

పేజీలు చించి నామినేషన్లు తిరస్కరిస్తున్నారు

చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా కొంతమంది రిటర్నింగ్‌ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆరోపించారు. ఆర్డీఓల వద్ద అన్ని పత్రాలతో సక్రమంగా దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల్లోని కొన్ని పేజీలను అధికారులు చించివేసి, అవే పేజీలు లేవంటూ అభ్యర్థుల ముందే నామినేషన్లను తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. అభ్యర్థులకు అందించిన చెక్‌లిస్ట్‌లో అన్ని పేజీలు సక్రమంగా ఉన్నట్లు ఆర్‌ఓలు సంతకాలు చేసి ఇచ్చినప్పటికీ, ఇప్పుడు పేజీలు లేవంటూ నామినేషన్లను తిరస్కరించడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రశ్నిస్తే పోలీసులతో బయటకు పంపిస్తున్నారు

నామినేషన్ల తిరస్కరణపై అభ్యర్థులు ఆర్‌ఓలను ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా పోలీసుల ద్వారా బలవంతంగా బయటకు పంపిస్తున్నారని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆరోపించారు. నామినేషన్ల కేంద్రాల వద్ద బాధిత అభ్యర్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కొంతమంది ఆర్‌ఓలు డబ్బులకు అమ్ముడుపోయి ఇంత దారుణానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికలు ఇంత నిస్సిగ్గుగా నిర్వహించాల్సిన అవసరం లేదని, అన్ని స్థానాలను ఏకగ్రీవంగా ప్రకటించుకోవచ్చని ఎద్దేవా చేశారు.

న్యాయం జరిగే వరకు కలెక్టర్‌ కార్యాలయం వీడను

నామినేషన్ల తిరస్కరణతో తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని బాధిత అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు కలెక్టర్‌ కార్యాలయం నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆర్‌ఓలపై ఎన్నికల సంఘంతో పాటు హైకోర్టులో ప్రైవేట్‌ కేసులు వేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని, నామినేషన్ల తిరస్కరణపై సమగ్ర విచారణ జరిపి బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.

Back to Top