ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వైయ‌స్ జగన్ దిగ్భ్రాంతి

పెళ్లి శుభకార్యానికి వెళ్లి వస్తుండగా నలుగురి మృతి

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి 

తాడేపల్లి : ప్రకాశం జిల్లా పెళ్లూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడంపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి బాపట్లకు పెళ్లి బృందంతో వస్తున్న కారు కల్వర్టును ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న కుటుంబంలో విషాదం చోటుచేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.

ప్రమాదంలో గాయపడి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరికీ మెరుగైన వైద్యసేవలు అందించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. వారి ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆకాంక్షించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు తన సానుభూతి, అండగా ఉంటుందని తెలిపారు. 

Back to Top